Eatala Rajender Flex Boards: బీజేపీని నాశనం చేస్తున్నావు..! ఈటలపై ఫెక్సీలు.. కమలం పార్టీలో కలకలం..
బీజేపీలో ఉంటూనే బీఆర్ఎస్ తో ఎలా దోస్తీ కడతావ్ అంటూ నిలదీశారు. పార్టీ కోసం పని చేసే వారిని కాదని భజన బృందాలను ప్రోత్సహిస్తున్నావు..
Eatala Rajender Flex Boards: బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ పై ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు కలకలం రేపుతున్నాయి. బీజేపీలో బీసీలను ఎదగనివ్వకుండా చేస్తున్నావంటూ గుర్తు తెలియని వ్యక్తులు పలు చోట్ల బ్యానర్లు ఏర్పాటు చేశారు. బండి సంజయ్, ఎంపీ అర్వింద్ మధ్య ఈటల చిచ్చు పెడుతున్నారని ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. బీజేపీలో ఉంటూనే బీఆర్ఎస్ తో ఎలా దోస్తీ కడతావ్ అంటూ నిలదీశారు. పార్టీ కోసం పని చేసే వారిని కాదని భజన బృందాలను ప్రోత్సహిస్తున్నావు అంటూ వివిధ రకాల విమర్శలతో ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఈటల టార్గెట్ గా ఏర్పాటు చేసిన ఈ ఫ్లెక్సీలు బీజేపీ శ్రేణుల్లో కలకలం రేపాయి. తీవ్ర చర్చకు దారితీశాయి. అసలు వీటిని ఎవరు ఏర్పాటు చేశారు అనే డిస్కషన్ జరుగుతోంది.
బీజేపీని బలహీనపరిచే కుట్ర- రాంచందర్ రావు
ఈటలపై వెలసిన ఫ్లెక్సీల వ్యవహారంపై తెలంగాణ బీజేపీ చీఫ్ రాంచందర్ రావు స్పందించారు. బీజేపీ నేతల మధ్య ఐక్యతను దెబ్బతీసే కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. బీజేపీ వ్యతిరేకులే ఈ పని చేశారని భావిస్తున్నామన్నారు. పార్టీ ఎదుగుదల చూసి ఓర్వలేక ఇలాంటి కుట్రలు చేస్తున్నారని ఆయన ఆరోపించారు. ఈ ఘటనపై డీజీపీతో పాటు సైబరాబాద్, మల్కాజ్ గిరి సీపీలకు ఫిర్యాదు చేస్తామన్నారు.
”కొంతమంది కొన్ని అభియోగాలతో మల్కాజ్ గిరి పార్లమెంటులో, సికింద్రాబాద్ లో పెద్ద పెద్ద ఫ్లెక్సీలు, బ్యానర్లు ఈటల రాజేందర్ కు వ్యతిరేకంగా పెట్టారు. ఈ పని చేసింది బీజేపీ వ్యతిరేకులే. బీజేపీని మళ్లీ బలహీన పరిచేందుకు కొందరు వ్యక్తులు, కొన్ని పార్టీలు చేస్తున్న పన్నాగం ఇది. ఇదొక కుట్రగా భావిస్తున్నాం. ఇటువంటి చిల్లర రాజకీయాలు చేయొద్దు. బీజేపీ బలంగా ఉంది, అందరూ ఐక్యంగా ఉన్నాం” అని రాంచందర్ రావు తేల్చి చెప్పారు.
ఈటల రాజేందర్.. అలాంటి వ్యక్తి కాదు- ఎంపీ అర్వింద్
ఈటల రాజేందర్ పై వెలసిన ఫ్లెక్సీల అంశంపై బీజేపీ ఎంపీ అర్వింద్ తీవ్రంగా స్పందించారు. ఫ్లెక్సీల ఏర్పాటును ఆయన ఖండించారు. ”ఈటల రాజేందర్ పై దుష్ప్రచారం, అభ్యంతరకర బ్యానర్లు ఏర్పాటు చేయడాన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నా. తెలంగాణ రాజకీయాల్లో ఈటల రాజేందర్ సౌమ్య స్వభావం కలిగిన నాయకుడు. దశాబ్దాలుగా ప్రజా జీవితంలో ఉన్న ఆయనపై దుష్ప్రచారం చేయడం ఏమాత్రం సమంజసం కాదు.
కేంద్ర మంత్రి బండి సంజయ్, నాకు మధ్య అలాగే ఈటల రాజేందర్ గొడవలు పెడుతున్నారనేది నూటికి నూరు శాతం అబద్దం. బండి సంజయ్ కి, నాకు సోదర భావం తప్ప ఇంకేమీ లేదు. రాజకీయాల్లో ఆరోగ్యకరమైన చర్చలు, ప్రజా సమస్యలపై పోటీ ఉండాలి గానీ వ్యక్తిత్వ హననం, దుష్ప్రచారం సరికాదు. ఇలాంటి చర్యలకు పాల్పడుతున్న వారు వెంటనే వాటిని నిలిపివేయాలి” అని నిజామాబాద్ ఎంపీ అర్వింద్ ధర్మపురి అన్నారు.
Also Read: దమ్ముంటే.. రైతు డిస్కంపై సీఎం రేవంత్ కి హరీశ్ రావు సవాల్
