Harish Rao – Cm Revanth: దమ్ముంటే.. రైతు డిస్కంపై సీఎం రేవంత్ కి హరీశ్ రావు సవాల్
మీరు వచ్చిన తర్వాతే 24 గంటల ఉచిత విద్యుత్ కి మంగళం పాడారు అని విరుచుకుపడ్డారు.
Harish Rao – Cm Revanth: రైతు డిస్కం విషయంలో అధికార, విపక్షాల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఒకరిపై మరికొరు తీవ్ర వ్యాఖ్యలు చేసుకుంటున్నారు. అధికార, విపక్ష నేతల మధ్య సవాళ్ల పర్వం నడుస్తోంది. తాజాగా రైతు డిస్కం అంశంలో సీఎం రేవంత్ రెడ్డికి ఛాలెంజ్ విసిరారు మాజీ మంత్రి హరీశ్ రావు.
రేవంత్ కు దమ్ముంటే.. రైతులకు 24 గంటల కరెంట్ ఇస్తేనే ఎన్నికల్లో ఓట్లు అడుగుతానని చెప్పగలరా అని సవాల్ విసిరారు. 24 గంటల కరెంట్ రావటం లేదని, రాష్ట్రంలో ఏ ఊరికైనా వెళ్దామని హరీశ్ అన్నారు. ఏ ఊరిలో కూడా రైతులకు 13 గంటలకు మించి ఉచిత విద్యుత్ రావడం లేదని తేల్చి చెప్పారు. 24 గంటల ఉచిత విద్యుత్ ఇవ్వడానికే ఆర్పీడీసీఎల్ పెడుతున్నానని రేవంత్ చెబుతున్నారు.. కానీ మీరు వచ్చిన తర్వాతే 24 గంటల ఉచిత విద్యుత్ కి మంగళం పాడారు అని విరుచుకుపడ్డారు.
”24 గంటల ఉచిత విద్యుత్ కోసమే ఆర్పీడీసీఎల్ ఏర్పాటు చేస్తున్నామని ముఖ్యమంత్రి రేవంత్ చెప్పారు. ఆర్పీడీసీఎల్ ద్వారా ఉచిత విద్యుత్ రానే రాదు. మన దగ్గర అన్ని లిఫ్ట్ ఇరిగేషన్ లు ఉన్నాయి. సాగునీటిని అందించే లిఫ్ట్ ఇరిగేషన్ల పాలిట ఆర్పీడీసీఎల్ అనేది శాపంగా మారబోతోంది. ఈఆర్సీ ముందు రైతులకు 3 గంటల కరెంట్ చాలు అని రేవంత్ చెప్పారు” అని హరీశ్ రావు అన్నారు.
”రైతు డిస్కంపై రేవంత్ అబద్ధాలు చెప్పారు. ప్రభుత్వ చర్యలు గమనిస్తుంటే కరెంట్ కోతలు, నీటి కష్టాలు తప్పవని అర్థమవుతోంది. రేవంత్ అబద్దాలు చెబుతూ పబ్బం గడుపుకుంటున్నారు. 24 గంటల కరెంట్ కు రేవంత్ మంగళం పాడారు. రైతులకు ప్రస్తుతం 13 గంటలకు మించి కరెంట్ రావడం లేదు” అని హరీశ్ రావు ఫైర్ అయ్యారు.
Also Read: ఎన్టీఆర్ విగ్రహావిష్కరణతో పాలిటిక్స్‌లో ట్విస్టులు..! తెలంగాణవాదులు ఎత్తుకున్న కొత్త నినాదమేంటి..
