GHMC: ఇంట్లో పాత ఫర్నిచర్ ఉందా? సింపుల్‌గా క్యూఆర్ కోడ్ స్కాన్ చేయండి.. వాళ్లే వచ్చి తీసుకెళ్తారు ఫ్రీగా
హైదరాబాద్ నగరంలో వీధుల్లో పాత పరుపులు, ఇతర గృహోపకరణాలను పారవేయడంపై జీహెచ్ఎంసీ(GHMC) ఒక వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది.
- V Santhosh Kumar
- Published on- July 7, 2026 / 11:11 AM IST
GHMC released a QR code for facilitate the collection of old mattresses and furniture from households
- పాత వస్తువుల ఉచిత సేకరణ
- క్యూఆర్ కోడ్‌తో సులభంగా బుకింగ్
- ఇంటి వద్దకే జీహెచ్ఎంసీ వాహనాలు
GHMC: హైదరాబాద్ నగరంలో వరద నాలాలు, వీధుల్లో పాత పరుపులు, సోఫాలు, ఇతర గృహోపకరణాలను ఇష్టారాజ్యంగా పారవేయడం పెద్ద సమస్యగా మారింది. ఈ వ్యర్థాల వల్ల నాలాలు పూడిపోయి వర్షపు నీరు నిలిచిపోతుండటంతో.. జీహెచ్ఎంసీ(GHMC) ఒక వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. నగరవాసుల ఇళ్ల వద్ద నుంచే పాత పరుపులు, ఫర్నిచర్‌ను ఉచితంగా సేకరించేందుకు ప్రత్యేక రవాణా వ్యవస్థను అందుబాటులోకి తెచ్చింది. గ్రేటర్ పరిధిలోని ఆరు జోన్లలో ఈ ఉచిత సేవలు అందుబాటులో ఉంటాయని జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్ ప్రకటించారు.
సింపుల్‌గా బుకింగ్: క్యూఆర్ కోడ్‌తో ఉచిత రవాణా:
ఈ ఉచిత వాహన సేవలను పొందడం నగరవాసులకు ఎంతో సులభతరం చేశారు. దీనికోసం జీహెచ్ఎంసీ ఒక ప్రత్యేక క్యూఆర్ కోడ్‌ను (QR Code) విడుదల చేసింది. ప్రజలు తమ మొబైల్‌తో ఈ క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేయగానే ఒక వెబ్ లింక్ ఓపెన్ అవుతుంది. ఆ లింక్‌లో తాము ఇవ్వాలనుకుంటున్న పాత వస్తువుల వివరాలను నమోదు చేయాలి. ఆ తర్వాత తమ ఇంటి చిరునామాకు సంబంధించిన గూగుల్ మ్యాప్ లొకేషన్‌ను ఎంపిక చేసి వాహనాన్ని బుక్ చేసుకోవచ్చు.
ఇంటి వద్దకే వచ్చి వ్యర్థాల సేకరణ: పర్యావరణ పరిరక్షణే లక్ష్యం:
వినియోగదారులు ఆన్‌లైన్‌లో బుక్ చేసుకున్న తర్వాత, నిర్దేశిత సమయంలో జీహెచ్ఎంసీతో ఒప్పందం కుదుర్చుకున్న ప్రైవేటు సంస్థ ప్రతినిధులు నేరుగా ఇంటికే వచ్చి ఆ వ్యర్థాలను తీసుకెళ్తారు. వాహనం ఏ సమయానికి వస్తుందనే సమాచారాన్ని వినియోగదారునికి ముందుగానే మెసేజ్ ద్వారా తెలియజేస్తారు. ఈ సదుపాయం ద్వారా నగర వీధులు, నాలాలు శుభ్రంగా ఉండటమే కాకుండా.. వ్యర్థాల శాస్త్రీయ నిర్వహణ సాధ్యమవుతుందని, నగరవాసులు ఈ ఉచిత సేవలను పెద్ద ఎత్తున సద్వినియోగం చేసుకోవాలని అధికారులు కోరుతున్నారు.
