కుక్కలకు మెర్సీ కిల్లింగ్? హైదరాబాద్ వాసులను కుక్క కాటు బాధ నుంచి తప్పించేందుకు..!

కుక్క కాటు కేసులు విపరీతంగా పెరిగిపోతున్నాయి.

Dogs

గ్రేటర్ హైదరాబాద్‌లో వీధి కుక్కలు బెంబేలెత్తిస్తున్నాయి. కుక్క కాటు కేసులు అధికంగా నమోదవుతుండడంతో వాటికి మెర్సీ కిల్లింగ్ చేయాలని జీహెచ్‌ఎంసీ యోచిస్తోంది. దీనికోసం అధికారులు హైకోర్టులో అఫిడవిట్ వేశారు.

జీహెచ్ఎంసీ పరిధిలో దాదాపు నాలుగు లక్షల వీధి కుక్కలు ఉన్నాయని అధికారులు అంటున్నారు. వాటిలో 80 శాతం కుక్కలకు స్టెరిలైజేషన్ చేశారు.

అలాగే, పాఠశాలలు, కళాశాలల్లో అవగాహన కార్యక్రమాలను సైతం నిర్వహిస్తున్నప్పటికీ కుక్క కాటు కేసులు పెరుగుతూనే ఉన్నాయి. 2019-2024 మధ్య మొత్తం కలిపి 1,76,896 కుక్క కాటు కేసులు వచ్చాయి.

వాటివల్ల పదుల సంఖ్యలో జనాలు మృతి చెందారు. ప్రతిరోజు కుక్క కాటు కేసులు వస్తున్నాయి. వేసవి కాలంలో ఈ కేసులు మరింత ఎక్కువగా ఉంటున్నాయి. చిన్నారులను కుక్కలు పీక్కుతింటున్న ఘటనలు కూడా నమోదవుతున్నాయి.

Read Also: ఇదేందయ్యా ఇదీ.. అన్ని ప్రాంతాల్లో రేట్లు పెరిగిపోతుంటే.. అక్కడ మాత్రం అతి తక్కువ ధరకు చికెన్..

దీంతో మెర్సీ కిల్లింగ్ కోసం జనవరి 10న హైకోర్టులో అధికారులు అఫిడవిట్ వేశారు. దీనిపై పిబ్రవరి 25న హైకోర్టు వాదనలు విననుంది. కుక్కలకు మెర్సీ కిల్లింగ్ ఇవ్వాలని అనుమతి తప్పకుండా తీసుకోవాలి.

పలు రకాల కుక్కలకు మాత్రమే మెర్సీ కిల్లింగ్ చేయడానికి అనుమతి ఇస్తారు. ఇప్పటికే దాడులు చేసిన కుక్కలతో పాటు దీర్ఘకాలిక వ్యాధులు ఉన్న కుక్కలను మెర్సీ కిల్లింగ్ చేయవచ్చు. హైకోర్టు నుంచి అనుమతి వస్తే యానిమల్ వెల్ఫేర్ బోర్డు ఆఫ్ ఇండియా నియమ నిబంధనల కింద ఈ ప్రక్రియను పూర్తి చేస్తారు.

గతంలోనూ ఇటువంటి అనుమతులు పలు హైకోర్టుల నుంచి వచ్చాయి. 2008లో బాంబే హైకోర్టు నుంచి, 2015లో కేరళ హైకోర్టు నుంచి ఇటువంటి అనుమతులను అధికారులు తీసుకున్నారు.