Ramgopalpeta Fire Incident : రాంగోపాల్ పేట అగ్నిప్రమాద ఘటన.. 5, 6వ అంతస్తులకు లేని అనుమతులు
సికింద్రాబాద్ రాంగోపాల్ పేట అగ్నిప్రమాద ఘటనపై జీహెచ్ఎంసీ ప్రకటన విడుదల చేసింది. 5,6వ అంతస్తులకు అనుమతి లేదని జీహెచ్ఎంసీ అధికారులు ధృవీకరించారు. రేపు ఇంజినీరింగ్ టౌన్ ప్లానింగ్ అధికారులు ప్రమాదం జరిగిన భవనాన్ని పరిశీలించనున్నారు.
- bheemraj
- Published On : January 19, 2023 / 10:48 PM IST
FIRE ACCIDENT
Ramgopalpeta Fire Incident : సికింద్రాబాద్ రాంగోపాల్ పేట అగ్నిప్రమాద ఘటనపై జీహెచ్ఎంసీ ప్రకటన విడుదల చేసింది. 5,6వ అంతస్తులకు అనుమతి లేదని జీహెచ్ఎంసీ అధికారులు ధృవీకరించారు. రేపు ఇంజినీరింగ్ టౌన్ ప్లానింగ్ అధికారులు ప్రమాదం జరిగిన భవనాన్ని పరిశీలించనున్నారు. అధికారులు బిల్డింగ్ పటిష్టతను పరిశీలించనున్నారు. బిల్డింగ్ పరిసర ప్రాంతాల ప్రజలను శిబిరాలకు తరలించారు. రాంగోపాల్‌పేటలో గురువారం భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఉదయం 11.00 గంటలకు డెక్కన్ నిట్వేర్ స్పోర్ట్స్ షాపులో అగ్ని ప్రమాదం సంభవించింది.
సెల్లార్ వన్‌లో మొదలైన మంటలు క్రమంగా పై అంతస్థులకు వ్యాపించాయి. సమచారం అందుకున్న ఫైర్ సిబ్బంది సహాయక చర్యలు ప్రారంభించారు. అగ్నిమాపక సిబ్బంది క్రేన్ల సహాయంతో ఇప్పటివరకు ఐదుగురిని కాపాడారు. ఫైర్ ఇంజిన్లతో మంటలు ఆర్పేందుకు ప్రయత్నించారు. కొద్దిసేపటి వరకు మంటలు అదుపులోకి వచ్చినప్పటికీ, సెల్లార్ నుంచి మంటలు తిరిగి ప్రారంభమయ్యాయి. దీంతో మంటలార్పడం కష్టమైంది. మరింత భారీగా మంటలు వ్యాపించాయి.
మరోవైపు దట్టమైన పొగ కూడా అలుముకుంది. దీంతో సహాయక చర్యలకు ఆటంకం కలిగింది. బిల్డింగ్ ఎల్ ఆకారంలో ఉండటం వల్ల కూడా సహాయక చర్యలకు కష్టమైంది. మళ్లీ వ్యాపించిన మంటల కారణంగా పక్క బిల్డింగ్, వెనుకవైపు ఉన్న బిల్డింగులకు కూడా మంటలు అంటుకున్నాయి. అగ్ని ప్రమాదం సంభవించిన బిల్డింగ్ లోపల మరింత మంది చిక్కుకుని ఉండే అవకాశం ఉందని అధికారులు భావించారు.
ఈ క్రమంలో లోపల ఎవరైనా చిక్కుకుని ఉంటే వారిని రక్షించేందుకు అగ్నిమాపక సిబ్బంది ఆక్సిజన్ మాస్కులు ధరించి బిల్డింగులోకి చేరుకున్నారు. తీవ్రంగా శ్రమించిన ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేశారు. గంటల తరబడి శ్రమించి మంటలను అదుపులోకి తెచ్చింది. ఈ ఘటనలో నలుగురిని ఫైర్ సిబ్బంది రక్షించింది. రెస్క్యూ చేస్తుండగా ఇద్దరు ఫైర్ సిబ్బందికి తీవ్ర గాయాలయ్యాయి. చికిత్స కోసం వారిని ఆస్పత్రికి తరలించారు. వీరిలో ఒకరికి ఐసీయూలో చికిత్స అందిస్తున్నారు.
