Kaleshwaram Project: కారు పార్టీలో కొత్త జోష్..! బీఆర్ఎస్‌ను తిరిగి అధికారంలోకి తెచ్చేది కాళేశ్వరమేనా?
గత అసెంబ్లీ ఎన్నికల్లో తమ ఓటమికి ఓ కారణమైన కాళేశ్వరం ప్రాజెక్టే ఇప్పుడు తమకు సానుకూలంగా మారుతుందని లెక్కలు వేసుకుంటోందట కారు పార్టీ.
- Naveen
- Updated on- April 23, 2026 / 08:46 PM IST
Kaleshwaram Project: ఓసారి బంపర్ విక్టరీని అందించింది. నెక్స్ట్ టర్మ్‌కు వచ్చేసరికి హ్యాట్రిక్ విక్టరీని దూరం చేసింది. రెండున్నరేళ్ల ప్రతిపక్షంలో ఆ అంశమే వెంటాడుతోంది. ఇప్పుడు మళ్లీ అదే కారు జోరును పెంచబోతుందన్న హోప్స్ మొదలయ్యాయి. కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్‌పై హైకోర్టు ఇచ్చిన తీర్పు..బీఆర్ఎస్‌లో ఎక్కడ లేని కాన్ఫిడెన్స్‌ను నింపిందట. అప్పుడు ఓటమికి కారణమైన కాళేశ్వరమే తిరిగి తమను పవర్‌లోకి తీసుకొస్తుందన్న ధీమా పెరిగిపోతోందట. ఏదైనా తమ బలం, బలహీనత ఉండేనో.. ఇప్పుడు దాన్నే ఆయుధంగా మల్చుకునే ప్లాన్‌లో ఉందట గులాబీ దళం
ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్..కేసీఆర్ బ్రెయిన్ చైల్డ్‌గా పేరున్న కాళేశ్వరం రికార్డుల్లోకెక్కింది. అంతే స్థాయిలో వివాదాలకు కేరాఫ్‌గా నిలుస్తూ వస్తోంది. 2014లో రాష్ట్ర విభజన తర్వాత అధికారంలోకి వచ్చిన బీఆర్ఎస్ మ్యాజిక్ ఫిగర్‌ను దాటి ఐదారు సీట్లే ఎక్కువగా గెలిచింది. కానీ 2018కి వచ్చేసరికి వార్ వన్‌సైడ్ అన్నట్లుగా ఏకంగా 88 సీట్లు గెలిచి ప్రభంజనం సృష్టించింది కారు పార్టీ. తమకు అప్పుడు ఆ స్థాయిలో అధికారం దక్కడానికి కారణం కాళేశ్వరం ప్రాజెక్టేనని బీఆర్ఎస్ బలంగా నమ్మేది. ఏదైనా ఆ పార్టీ బలంగా నిలిచిందో..2023 ఎన్నికలకు వచ్చేసరికి అదే బలహీనతగా మారిన పరిస్థితి.
డ్యామేజ్ చేసిన కాళేశ్వరమే.. తిరిగి గులాబీ గుబాళింపునకు పునాదులు వేస్తుందా?
ఆ కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలోని మేడిగడ్డ కుంగుబాటు చుట్టే రాజకీయం రచ్చ చేసింది. కాంగ్రెస్ వేసిన స్కెచ్ వర్కౌట్ అయి బీఆర్ఎస్‌కు జరగాల్సిన దానికంటే ఎక్కువే డ్యామేజ్ జరిగిందన్న టాక్ ఉంది. ఆ తర్వాత రేవంత్ సర్కార్ పీసీ ఘోష్ కమిషన్‌ను ఏర్పాటు చేయడం..ఏకంగా సీబీఐ విచారణకు ఆదేశించడంతో బీఆర్ఎస్ మరింత కార్నర్ అయినట్లే కనిపించింది సీన్. కట్ చేస్తే గులాబీ పార్టీ చేసిన న్యాయపోరాటం ఫలించి..కాళేశ్వరం కమిషన్ నివేదికను హైకోర్టు నిలిపివేసింది. దీంతో కారు పార్టీలో మళ్లీ జోష్ కనిపిస్తోంది. 2018లో పవర్‌లోకి దించి..2023 ఎన్నికల్లో తీవ్రంగా తమకు డ్యామేజ్ చేసిన కాళేశ్వరమే..తిరిగి గులాబీ గుబాళింపుకు పునాదులు వేస్తుందని నమ్ముతోందట బీఆర్ఎస్.
గత అసెంబ్లీ ఎన్నికల్లో తమ ఓటమికి ఓ కారణమైన కాళేశ్వరం ప్రాజెక్టే ఇప్పుడు తమకు సానుకూలంగా మారుతుందని లెక్కలు వేసుకుంటోందట కారు పార్టీ. జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదికను హైకోర్టు నిలిపివేయడంతో గులాబీ శ్రేణుల్లో పెద్దఎత్తున ఉత్సాహాన్ని నింపింది. ఈ తీర్పు రాజకీయంగా బీఆర్ఎస్ పార్టీకి ఒక పెద్ద ఊరటనిస్తోంది. ఘోష్ కమిషన్ నివేదిక ఆధారంగా మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి హరీష్ రావుపై ఎలాంటి చర్యలు తీసుకోకూడదని హైకోర్టు స్పష్టం చేసింది. కాళేశ్వరం ప్రాజెక్టుపై హైకోర్టు తీర్పు వెలువడిన వెంటనే అటు కేటీఆర్, ఇటు హరీశ్‌రావు రియాక్ట్ అయ్యారు.
జనం మద్దతు కూడగట్టొచ్చనే ప్లాన్..!
కాంగ్రెస్ ప్రభుత్వం తమపై చేస్తున్న దుష్ప్రచారానికి ఈ తీర్పు ఒక చెంపపెట్టు అని అటాక్ చేస్తున్నారు. రాజకీయ కక్షతోనే తమను టార్గెట్ చేశారని వారు ఆరోపించారు. 2023 ఎన్నికల్లో కాళేశ్వరం అవినీతి ఆరోపణలు పార్టీ ఓటమికి ఒక ప్రధాన కారణంగా నిలవగా..ఇప్పుడు కోర్టు తీర్పుతో తామేం తప్పు చేయలేదని ప్రజల్లోకి తీసుకెళ్లడం ద్వారా జనం మద్దతు కూడగట్టొచ్చనేది బీఆర్ఎస్ ప్లాన్ తెలుస్తోంది. అందుకే చిల్లర రాజకీయాలు పక్కన పెట్టి మేడిగడ్డ పిల్లర్ల మరమ్మతులు చేయాలన్న డిమాండ్‌ను బలంగా వినినిస్తోంది చేస్తోంది.
తక్కువ వర్షపాతం, కరువు ఏర్పడొచ్చన్న అంచనాలతోనే కాళేశ్వరం ప్రాజెక్టుకు రిపేర్లు చేస్తున్నా..ఆ ప్రాజెక్టు బాగై..నీళ్లు వస్తే తమకే మైలేజ్ వస్తుందనే అంచనాల్లో ఉంది గులాబీ దళం. కాళేశ్వరం అంటే ప్రజలకు టక్కున కేసీఆరే గుర్తుకు వస్తారని..ఇప్పుడు ప్రభుత్వం మరమ్మత్తులు చేసి నీళ్లు లిఫ్ట్ చేస్తే ప్రజలకు వాస్తవాలు తెలుస్తాయంటోంది బీఆర్ఎస్. కారు పార్టీకి మళ్లీ కాళేశ్వరమే జోష్ తెస్తుందో లేదో చూడాలి.
Also Read: పాలనా యంత్రాంగంలో భారీ ప్రక్షాళన..! సీఎం రేవంత్ సరికొత్త కసరత్తు వెనుక మాస్టర్ ప్లాన్ ఏంటి?
