Telangana Parties Representative Image (Image Credit To Original Source)
Telangana Municipal Elections: ప్రచార గడువు దగ్గర పడుతుంది. ఎన్నికల తేదీ ముంచుకొస్తోంది. పార్టీలన్నీ హోరాహోరీగా క్యాంపెయిన్ చేస్తున్నాయ్. పురపోరులో సరికొత్త జిమ్మిక్స్ ప్లే చేస్తున్నాయి పార్టీలు. ప్రత్యర్థుల ఇలాకాపై ప్రత్యేక దృష్టి పెట్టి..ఒకరిపై మరొకరు పైచేయి సాధించే ప్లాన్ చేస్తున్నారు నేతలు. గులాబీ బాస్ కేసీఆర్, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నియోజకవర్గాల్లోని మున్సిపాలిటీలపై కాంగ్రెస్, బీజేపీ సీరియస్ ఫోకస్ పెడితే..సీఎం, మంత్రుల సొంత సెగ్మెంట్లలో సత్తా చాటేందుకు కారు పార్టీ స్ట్రాటజీస్ ప్లే చేస్తోందట. కాంగ్రెస్, బీజేపీ కీలక నేతలను టార్గెట్ చేస్తూనే..కవిత అనుచరులు పోటీ చేస్తున్న సెగ్మెంట్లలో తమ పవర్ ఏంటో చూపించాలని బీఆర్ఎస్ ప్లాన్ చేస్తోందట.
తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల రాజకీయం అంతకంతకు వేడుక్కుతోంది. అధికార కాంగ్రెస్, విపక్ష బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు పురపోరును ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నాయి. ప్రచార పర్వంలో అన్ని పార్టీల నుంచి కీలక నేతలు బిజీ అయిపోయారు. ఈ క్రమంలో రాజకీయ ప్రత్యర్థుల నియోజకవర్గాలపై ప్రత్యేక దృష్టితో పని చేస్తున్నారట అధికార, విపక్ష నేతలు. మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఇలాకా గజ్వేల్‌తో పాటు, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎమ్మెల్యేగా ఉన్న సిరిసిల్లపై కాంగ్రెస్, బీజేపీ స్పెషల్ ఫోకస్ పెట్టాయట. కేసీఆర్ నియోజకవర్గం పరిధిలో గజ్వేల్, తూప్రాన్, కేటీఆర్ నియోజకవర్గంలోని సిరిసిల్ల మున్సిపాలిటీకి ఎన్నికలు జరుగుతున్నాయి. గజ్వేల్, తూప్రాన్‌లో పట్టు జారకుండా బీఆర్‌ఎస్ ప్రత్యేక కార్యాచరణతో ముందుకు వెళ్తోంది. మాజీ మంత్రి హరీశ్‌రావు ఈ మున్సిపాలిటీలకు స్పెషల్ ఇంచార్జ్‌గా ఉండగా, ఈ రెండు మున్సిపాలిటీలకు ఇద్దరు సీనియర్ లీడర్లను ఇంచార్జ్‌లుగా నియమించింది అధిష్టానం.
కేసీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్‌లో రెండు మున్సిపాలిటీలను గెలుచుకుని బీఆర్‌ఎస్‌ను డైలమాలో పడేయాలని అధికార కాంగ్రెస్ పార్టీ ప్లాన్ చేస్తోందట. ఎలాగైనా గజ్వేల్, తూప్రాన్ మున్సిపాలిటీలపై కాంగ్రెస్ జెండా ఎగరాల్సిందేనని..ఇంచార్జ్ మంత్రులకు, స్థానిక నేతలకు ఆ పార్టీ పెద్దల నుంచి డైరెక్షన్స్ వెళ్లాయట. అయితే కాంగ్రెస్ ఎత్తులకు మాజీ మంత్రి హరీశ్‌రావు పైఎత్తులు వేస్తున్నారట. ఎట్టి పరిస్థితుల్లో గజ్వేల్, తూప్రాన్ మున్సిపాలిటీస్‌లో గులాబీ పార్టీదే విజయమంటూ..అన్నీ తానై పని చేస్తున్నారు. పక్కా ప్రణాళికతో రంగంలోకి దిగిన హరీశ్..ప్రతిరోజు గ్రౌండ్ లెవల్‌లో పరిస్థితులపై ఆరా తీస్తున్నారట.
ఇక బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సొంత సెగ్మెంట్‌లో సిరిసిల్ల మున్సిపాలిటీపై అధికార కాంగ్రెస్‌తో పాటు బీజేపీ కూడా స్పెషల్ ఫోకస్ పెట్టింది. కేంద్రమంత్రి బండి సంజయ్ సిరిసిల్ల మున్సిపాలిటీలో కాషాయ జెండా ఎగరవేసేందుకు గట్టిగానే ప్రయత్నాలు చేస్తున్నారట. సిరిసిల్లలో కాంగ్రెస్ ప్రభావం తక్కువే అయినా ప్రధాన పోరు బీఆర్‌ఎస్, బీజేపీ మధ్య జరగవచ్చంటున్నారు. పార్టీ సీనియర్ నాయకురాలు తుల ఉమను ఇంచార్జ్‌గా పెట్టి కేటీఆర్ అంతా తానై నడిపిస్తున్నారు. టికెట్ల కేటాయింపు నుంచి నామినేషన్స్ వరకు అన్నింటినీ స్వయంగా కేటీఆర్ పర్యవేక్షించారు. సిరిసిల్ల మున్సిపాలిటీని ఎలాగైనా గెల్చుకుంటామని బీఆర్ఎస్ ధీమాగా ఉంటే..కాంగ్రెస్, బీజేపీ సై అంటే సై అంటుండటంతో ఉత్కంఠ రేపుతోంది.
కాంగ్రెస్, బీజేపీలు కారు పార్టీ పార్టీ ముఖ్యనేతల సెగ్మెంట్లపై దృష్టి పెడితే..బీఆర్ఎస్.. సీఎం, మంత్రులు నియోజకవర్గాలపై స్పెషల్ కాన్సన్‌ట్రేషన్ పెట్టిందట. మంత్రులు, వారు ఇంచార్జ్‌లు ఉన్న మున్సిపాలిటీలు..సీఎం ప్రత్యేక చొరవ తీసుకుని ప్రచారం చేస్తున్న పురపాలక సంఘాల్లో గెలిచి..కాంగ్రెస్‌కు షాక్ ఇవ్వాలనేది బీఆర్ఎస్ స్ట్రాటజీగా తెలుస్తోంది. అయితే ప్రచార బాధ్యతలన్నీ లోకల్ లీడర్లకు, మాజీమంత్రులకు అప్పగించిన బీఆర్ఎస్..కాంగ్రెస్ ఢీకొట్టేందుకు తమ నేతలు సరిపోతారంటూ సవాల్ చేస్తోంది.
సేమ్‌టైమ్ అటు జాగృతి అధ్యక్షురాలు కవిత అనుచరులు పోటీ చేస్తున్న మున్సిపాలిటీస్‌పై కూడా బీఆర్ఎస్ నజర్ పెట్టిందట. ఆమెకు ఏ మాత్రం పట్టులేదని ఈ ఎన్నికల్లోనే ప్రూవ్ చేయాలని..ఓట్లు చీలకుండా..తమ ఓట్లు జాగృతికి వెళ్లకుండా జాగ్రత్త పడుతోందట కారు పార్టీ. కవిత కూడా ఇదే మాట చెబుతున్నారు. జాగృతి పోటీ చేస్తున్న చోటనే హరీశ్‌రావు తిరుగుతున్నారని ఆరోపిస్తున్నారామె. ఇలా ఎత్తుకు పైఎత్తు పాలిటిక్స్‌తో మున్సిపల్ ఎన్నికల పోరు రసవత్తరంగా మారింది. ఈ పొలిటికల్ గేమ్‌లో ఎవరు పైచేయి సాధిస్తారో వేచి చూడాలి మరి.
Also Read: జంపింగ్‌లకే పెద్దపీట..! ఆ రెండు చోట్ల ఇంచార్జ్‌లకు ఝలక్ ఇచ్చిన కాంగ్రెస్..! ఎందుకిలా..