Harish Rao: ఒట్టేసి రుణమాఫీ అన్నవ్.. చేసినవా?.. సీఎంపై హరీష్ షాకింగ్ కామెంట్స్
దేవుళ్ల మీద ఒట్టు వేసి ఇచ్చిన హామీలను అమలు చేయకుండా మాట తప్పడం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి అలవాటుగా మారిందని హరీశ్‌రావు(Harish Rao) విమర్శించారు.
Harish Rao strong counter to the comments made by CM Revanth at the Khammam meeting
- దేవుడిపై ఒట్టు రుణమాఫీ ఎక్కడ
- కాళేశ్వరం ప్రాజెక్టుపై రాజకీయ ద్వేషం
- తెలంగాణకు శాపంగా సీఎం నిర్ణయాలు
Harish Rao: దేవుళ్ల మీద ఒట్టు వేసి ఇచ్చిన హామీలను అమలు చేయకుండా మాట తప్పడం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి అలవాటుగా మారిందని భారాస శాసనసభాపక్ష ఉపనేత హరీశ్‌రావు(Harish Rao) తీవ్రంగా విమర్శించారు. ఖమ్మం జిల్లా మధిర సభలో సీఎం రేవంత్ చేసిన వ్యాఖ్యలకు కౌంటర్‌గా ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. భద్రాద్రి శ్రీరాముడి సాక్షిగా సంపూర్ణ రుణమాఫీ చేస్తామని చెప్పిన రేవంత్ రెడ్డి, ఆ ప్రమాణాన్ని ఎందుకు నిలబెట్టుకోలేకపోయారని ప్రశ్నించారు. కనీసం ఖమ్మం జిల్లాలోనైనా రైతులందరికీ పూర్తిస్థాయిలో రుణమాఫీ జరిగిందా అని ఆయన నిలదీశారు.
కాళేశ్వరం ప్రాజెక్టుపై రాజకీయ ద్వేషం:
రాజకీయ కక్ష సాధింపు చర్యల కోసమే కాళేశ్వరం ప్రాజెక్టును పక్కనబెట్టి, తెలంగాణ రైతాంగ భవిష్యత్తును కాంగ్రెస్ ప్రభుత్వం బలి చేస్తోందని హరీశ్‌రావు ఆరోపించారు. రాష్ట్రంలో నెలకొన్న తాగు, సాగునీటి ఎద్దడికి ప్రస్తుత ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. చివరి ఏడాదిలోనే రాజకీయాలు చేద్దామని చెబుతూనే, సీఎం రేవంత్ రెడ్డి ప్రతి బహిరంగసభలో ఎందుకు అంతలా అసహనానికి గురవుతున్నారని ప్రశ్నించారు. కన్నెపల్లి పంప్‌హౌస్ నుండి నీటిని లిఫ్ట్ చేయలేని తమ ప్రభుత్వ అసమర్థతను అబద్ధాలతో కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు.
తెలంగాణకు శాపంగా మారిన సీఎం నిర్ణయాలు:
గతంలో 28 లక్షల క్యూసెక్కుల మహా వరద వచ్చినప్పుడే మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలు చెక్కుచెదరకుండా నిలబడ్డాయని, ఇప్పుడు కేవలం లక్ష క్యూసెక్కుల వరదకే ఏదో మునిగిపోతుందంటూ ప్రభుత్వం అపోహలు సృష్టిస్తోందని హరీశ్‌రావు దుయ్యబట్టారు. వెంటనే నీళ్లను లిఫ్ట్ చేయాలని రిటైర్డ్ ఇంజినీర్లు నెత్తీనోరూ బాదుకుంటున్నా ప్రభుత్వం ఎందుకు నిర్లక్ష్యం చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. గోదావరి జలాలతో తెలంగాణ రిజర్వాయర్లను నింపకుండా సీఎం రేవంత్ రెడ్డి వ్యవహరిస్తున్న తీరు మన రాష్ట్రానికి శాపంగా, ఆంధ్రప్రదేశ్‌కు వరంగా మారిందని హరీశ్‌రావు ఆవేదన వ్యక్తం చేశారు.
