KCR: ఏప్రిల్‌ 27 తర్వాత.. బీఆర్ఎస్‌లో సమూల మార్పులు? కేసీఆర్ కీలక నిర్ణయాలు తీసుకోబోతున్నారా?

టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్‌గా మారిన తర్వాతే పార్టీ అధికారం కోల్పోయిందని, నేతల చుట్టూ కేసులు విచారణలు అంటూ కష్టాలు మొదలయ్యాయనే చర్చ పార్టీలో ఉంది. ఈ నేపధ్యంలో పార్టీ పేరును మళ్లీ బీఆర్ఎస్ నుంచి టీఆర్ఎస్‌గా మార్చాలన్న డిమాండ్ పెరుగుతూ వస్తోంది.

  • Updated on- April 25, 2026 / 11:36 PM IST
  • ఇక నుంచి ఫీల్డ్‌లో ఉండేలా కేసీఆర్ ప్రణాళికలు?..
  • కవిత పార్టీ టార్గెట్‌గా బీఆర్ఎస్‌ వ్యూహాలు?
  • బీఆర్ఎస్‌ను టీఆర్ఎస్‌గా మార్చే అంశంపై స్పందిస్తారా?

KCR: అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా రెండేళ్ల సమయం ఉంది. ఇక స్పీడ్ పెంచాల్సిందే. ఇటు అధికార కాంగ్రెస్‌ను..ఇటు కవిత పార్టీని టార్గెట్‌ చేస్తూ దూకుడు పెంచాల్సిందేనని డిసైడ్ అయిందట గులాబీ పార్టీ. గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయాలని గులాబీ బాస్ డిసైడ్ చేశారట. ఈనెల 27న పార్టీ ఆవిర్భావ వేడుకల ముగింపు సమావేశంలో కేసీఆర్ కీలక నిర్ణయాలు ప్రకటించబోతున్నారని పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. పార్టీ పేరును టీఆర్ఎస్‌గా మార్చాలన్న డిమాండ్ నేపధ్యంలో ఊహించని మార్పులు ఉండొచ్చని గుసగుసలు వినిపిస్తున్నాయి.

ఇక పోరుబాటే అంటోంది బీఆర్ఎస్. ఇప్పటికే కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు గడుస్తుండటంతో..ఇంక స్పీడును పెంచేందుకు సమూల మార్పులకు సిద్ధమవుతోంది. ఈ నెల 27న బీఆర్ఎస్ రజతోత్సవాల ముగింపు సందర్భంగా..తెలంగాణ భవన్‌లో కీలక సమావేశాన్ని నిర్వహించబోతున్నారు. పార్టీ అధినేత కేసీఆర్‌ హాజరుకానున్న ఈ మీటింగ్‌ చాలా కీలకమైందిగా చెబుతున్నారు. వచ్చే జీహెచ్ఎంసీ ఎన్నికలతో పాటు 2028లో జరిగే అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని బిగ్ డెసిషన్స్‌ తీసుకోబోతున్నారన్న టాక్ నడుస్తోంది.

పూర్తిస్థాయిలో కమిటీల ఏర్పాటుపై ఫోకస్..

పార్టీ పేరు టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్‌గా మారిన తర్వాత పార్టీ సంస్థాగత నిర్మాణంపై అధినేత కేసీఆర్ పూర్తిగా దృష్టి పెట్టలేదు. చాలా కాలంగా పార్టీ కమిటీల ఏర్పాటు పూర్తిస్థాయిలో జరగలేదు. 2022లో ప్రాంతీయ పార్టీ నుంచి జాతీయ పార్టీగా మార్చిన కేసీఆర్ వెంటనే అసెంబ్లీ ఎన్నికలు, ఆ తర్వాత పార్లమెంటు ఎలక్షన్స్ బిజీలో ఉండిపోయారు. దీంతో కమిటీల నియామకం ఎప్పటికప్పుడు వాయిదా పడుతూ వస్తోంది. ఇప్పుడు ఎన్నికలకు ఇంకా రెండేళ్ల టైమ్ మాత్రమే ఉండటంతో..పార్టీ బలోపేతంపై కేసీఆర్ సీరియస్ ఫోకస్ చేసినట్లు చెబుతున్నారు. ప్రస్తుతం పార్టీకి జిల్లా అధ్యక్షులతో పాటు రాష్ట్ర స్థాయిలో కొంత మంది ప్రధాన కార్యదర్శులు మాత్రమే ఉన్నారు. దీంతో కొత్త కమిటీల నియామకం తప్పనిసరని భావిస్తున్నారట. రెండు మూడు నెలల్లో కచ్చితంగా కమిటీలన్నీ నియమించాలన్న ప్లానింగ్‌లో ఉన్నారట. సభ్యత్వ నమోదు తర్వాత పూర్తిస్థాయిలో కమిటీల ఏర్పాటుపై ఫోకస్ చేస్తారట.

పార్టీ పేరు మార్పుపై కేసీఆర్ కీలక ప్రకటన?

ఇక పార్టీ పేరును టీఆర్ఎస్‌ నుంచి బీఆర్ఎస్‌గా మార్చిన తర్వాత వరుసగా అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల్లో ఘోర పరాజయం పాలవడంతో..నెగెటివ్‌ సెంటిమెంట్‌గా ఫీల్ అవుతున్నారట. టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్‌గా మారిన తర్వాతే పార్టీ అధికారం కోల్పోయిందని, నేతల చుట్టూ కేసులు విచారణలు అంటూ కష్టాలు మొదలయ్యాయనే చర్చ పార్టీలో ఉంది. ఈ నేపధ్యంలో పార్టీ పేరును మళ్లీ బీఆర్ఎస్ నుంచి టీఆర్ఎస్‌గా మార్చాలన్న డిమాండ్ పెరుగుతూ వస్తోంది. దీంతో పార్టీ పేరు మార్పుపై బీఆర్ఎస్ ముఖ్య నేతలు ఢిల్లీలో న్యాయ నిపుణులతో చర్చించినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఈనెల 27న జరగబోయే పార్టీ కీలక సమావేశంలో పార్టీ పేరు మార్పుపై కేసీఆర్ కీలక ప్రకటన చేసే అవకాశం ఉందంటున్నారు.

ఇక కవిత పార్టీ ఏర్పాటు..టీఆర్ఎస్‌ పేరు..ఈ అంశాలపై కేసీఆర్ రియాక్ట్ అవుతారా లేదా అన్నది కూడా ఇంట్రెస్టింగ్‌గా మారింది. కవిత నేరుగా కేసీఆర్‌నే టార్గెట్ చేయడంతో..క్యాడర్, లీడర్లలో కాన్ఫిడెన్స్ నింపేందుకు గులాబీ బాస్ స్పందిస్తారా? ఎప్పటిలాగే లైట్ తీసుకుంటారా అనేది చూడాలి.

Also Read: టీఆర్ఎస్‌ పేరుతో కవిత పార్టీ.. కేసీఆర్‌ను టార్గెట్ చేయడం వెనుక వ్యూహమేంటి..?