Gossip Garage : ఈటల రాజేందర్, హరీశ్‌రావు, కేసీఆర్‌ను విచారణకు పిలుస్తారా?

ఎవరెవరికి నోటీసులు రాబోతున్నాయి.? ఒకవేళ కమిషన్‌ పిలిస్తే కేసీఆర్, హరీశ్‌ రావు విచారణకు వెళ్తారా అన్నది చర్చనీయాంశంగా మారింది.

Gossip Garage : లక్ష కోట్ల కుంభకోణం అన్నారు. ఓ బ్యారేజీ కుంగిపోయిందని ఎన్నికలకు ముందు రచ్చ అయింది. కాంగ్రెస్‌ పవర్‌లోకి వచ్చింది. తర్వాత ఆ పెద్ద ప్రాజెక్టుపై విచారణకు ఆదేశించింది. రెండు నెలల కాల పరిమితితో ఏర్పాటైన కమిషన్‌ 9 నెలలు దాటినా విచారణను తుది దశకు తేలేదు. అయితే ఇప్పుడు కమిషన్ గడువు ముగుస్తుండటంతో కథ క్లైమాక్స్‌కు తేవాలని ప్లాన్ చేస్తోందట కాళేశ్వరం విచారణ కమిషన్. దీంతో మరోసారి తెలంగాణ గట్టు మీద కాక రేపుతోంది కాళేశ్వరం ప్రాజెక్టు. ఫినిషింగ్‌ టచ్‌లో భాగంగా.. రేపోమాపో కొందరు పెద్దలను విచారణకు పిలుస్తారని అంటున్నారు. ఇంతకీ కమిషన్ ఫైనల్ టార్గెట్ ఎవరు..? కమిషన్ విచారించబోయేది ఎవరెవరిని.?

ఏడేళ్లుగా అదే హాట్ టాపిక్. ఆ ప్రాజెక్టుకు పునాది నుంచి..కుంగిపోయిందన్న ప్రచారం వరకు..తెలంగాణ పాలిటిక్స్‌లో కాళేశ్వరం ప్రాజెక్టు రాజకీయ పార్టీలకు అస్త్రంగా మారింది. అటు బీజేపీ, కాంగ్రెస్..బీఆర్‌ఎస్‌ను టార్గెట్‌ చేస్తుంటే..కాళేశ్వరంతో తెలంగాణ పచ్చని మాగానికిగా మారిందని గులాబీ పార్టీ చెప్పుకుంటూ వస్తోంది. ఈనేపథ్యంలో విమర్శలు, ప్రతి విమర్శలతో డైలీ ఎపిసోడ్‌ కంటిన్యూ అవుతూనే ఉంది.

గతేడాది మార్చి 14న విచారణ కమిషన్‌ ఏర్పాటు..
అందులో భాగంగా కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ బ్యారేజీ కుంగుబాటుపై విచారణకు ఆదేశించింది రేవంత్ సర్కార్. జస్టిస్ పినాకిని చంద్రఘోష్ ఆధ్వర్యంలో గతేడాది మార్చి 14న విచారణ కమిషన్‌ ఏర్పాటు చేసింది. రెండున్నర నెలల్లో అంటే జూన్ 30లోపు విచారణ పూర్తి చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. కానీ అనేక అంశాలు ముడిపడి ఉండటంతో సకాలంలో విచారణ పూర్తి కాలేదు.

ఇక ఫినిషింగ్ టచ్ ఇవ్వాలని చూస్తోంది..
ఇలా ఇప్పటి వరకు నాలుగు సార్లు విచారణ కమిషన్‌ గడువును పొడిగించారు. ఇప్పటివరకు కాళేశ్వరం ప్రాజెక్టులో భాగస్వామ్యం ఉన్న ఇంజనీర్లు, మాజీ ఇంజనీర్లతో పాటు ఈఎన్సీలను విచారించింది కమిషన్‌. పబ్లిక్ హియరింగ్‌లో భాగంగా టీజేఎస్ అధ్యక్షుడు ఎమ్మెల్సీ కోదండరాం, వెదెరె శ్రీరాం వంటి వారి నుంచి కూడా సమాచారం తీసుకుంది. ఈ మధ్య కాలంలో ఐఏఎస్‌లు స్మితా సబర్వాల్, రామకృష్ణారావు, మాజీ సీఎస్ సోమేశ్ కుమార్, ఎస్కే జోషిని కూడా వివరాలు అడిగి తెలుసుకుంది జస్టిస్ చంద్రఘోష్ కమిషన్. ఇక ఫినిషింగ్ టచ్ ఇవ్వాలని చూస్తోంది.

Also Read : ఫార్ములా ఈ కార్ రేస్ కేసు.. ఈడీ ముందుకు కేటీఆర్.. అడిగే ప్రశ్నలు ఇవే?

ఇక పొలిటికల్ లీడర్లపై ఫోకస్..
కాళేశ్వరం విచారణలో భాగంగా వివిధ దశల్లో భాగంగా సమగ్ర సమాచారాన్ని కమిషన్ సేకరించింది. ప్రజాకోర్టుల ద్వారా విచారణ చేయడంతో పాటు అఫిడవిట్ల నుంచి సమాచారం సేకరించింది కమిషన్. ఇక పొలిటికల్ లీడర్లపై ఫోకస్ చేయాలని చూస్తోంది. ఇప్పటివరకు అధికారుల ఇచ్చిన సమగ్ర సమాచారాన్ని పూర్తిస్థాయిలో స్టడీ చేసి.. నెక్ట్స్ స్టెప్‌లో భాగంగా పొలిటికల్ లీడర్లను విచారణ చేయాలని చూస్తోంది. కమిషన్ విచారణ గడువును ఇప్పటికే నాలుగు సార్లు పొడిగించిన నేపథ్యంలో.. ఇక ఫైనల్‌ వచ్చే నెల 28 లోపు విచారణను పూర్తి చేసి ప్రభుత్వానికి రిపోర్టు ఇవ్వాలని భావిస్తోంది. అందుకే రేపోమాపో విచారణ కమిషన్ తన ప్రక్రియను మరింత స్పీడప్ చేయనుంది.

ఈటల, హరీశ్, కేసీఆర్ ను విచారిస్తారా?
ఈ నెల 19న జస్టిస్ పినాకిని చంద్రఘోష్ హైదరాబాద్ వస్తున్నారు. ఈ నెల 21 నుంచి క్రాస్ ఎగ్జామినేషన్‌ను ప్రారంభించనున్నారు. ఈ దఫా ఆర్థికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావుతో పాటు నిర్మాణ సంస్థల ప్రతినిధులను కమిషన్ విచారించనుంది. ఆ తర్వాత ఫినిషింగ్ టచ్‌లో భాగంగా..కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణ సమయంలో ఆర్థిక శాఖ మంత్రిగా, నీటి పారుదల శాఖ మంత్రిగా పనిచేసిన నేతలను విచారణకు పిలుస్తారని అంటున్నారు. ఈ నేపథ్యంలో గతంలో ఆర్థిక శాఖమంత్రిగా పనిచేసిన ఈటల రాజేందర్, ఇరిగేషన్‌ మంత్రిగా పనిచేసిన హరీశ్‌రావుతో పాటు, మాజీ సీఎం కేసీఆర్‌ను కూడా విచారించాలని జస్టిస్ పినాకిని చంద్రఘోష్‌ కమిషన్ భావిస్తోందట.

మాజీ సీఎం కేసీఆర్, మాజీ ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్, మాజీ ఇరిగేషన్‌ మినిస్టర్ హరీశ్‌రావుకు నోటీసులు ఇచ్చి విచారణకు పిలిచే అవకాశం ఉంది. ఈ ముగ్గురిని విచారణ చేస్తేనే క్లారిటీ వస్తుందని కమిషన్ భావిస్తోందట. కమిషన్‌కు తమ వివరణ ఇచ్చిన ఇంజనీర్లు, స్మితాసబర్వాల్ వంటి ఐఏఎస్‌లు కూడా ఈ వ్యవహారం అంతా మంత్రులు, సీఎం స్థాయిలో జరిగిందని చెప్పారట. వారు చెప్పిన వివరాలను ముందుపెట్టి ఈ ముగ్గురు నేతల నుంచి సమాచారాన్ని సేకరించాలని కమిషన్ ఆలోచిస్తుందట.

ఈ ప్రక్రియను కూడా వచ్చే నెలాఖరులోపు పూర్తి చేసి డిటేయిల్డ్‌ రిపోర్టును ప్రభుత్వానికి ఇవ్వాలని పినాకిని చంద్రఘోష్‌ కమిషన్‌ డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఎవరెవరికి నోటీసులు రాబోతున్నాయి.? ఒకవేళ కమిషన్‌ పిలిస్తే కేసీఆర్, హరీశ్‌ రావు విచారణకు వెళ్తారా అన్నది చర్చనీయాంశంగా మారింది.

 

 

Also Read : రేవంత్ సర్కార్‌కు జనవరి 26 గుబులు..! ఇంతకీ కాంగ్రెస్ ప్రభుత్వానికి కంగారు ఎందుకు?