PM Modi: కేసీఆర్ గారు ఎలా ఉన్నారు? ఆయన ఆరోగ్యం ఎలా ఉంది? హెల్త్ జాగ్రత్తగా చూసుకొమ్మని నా మాటగా చెప్పండి. మాజీ సీఎం కేసీఆర్ ఆరోగ్యంపై ఇంతలా ఆరా తీసింది మరెవ్వరో కాదు స్వయంగా ప్రధాని మోదీ. అవును.. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆరోగ్యంపై మోదీ వివరాలు అడిగి తెలుసుకోవడం ఇప్పుడు రాజకీయవర్గాల్లో ఆసక్తి రేపుతోంది. కేసీఆర్ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకొమ్మని తాను చెప్పినట్లుగా చెప్పాలని మరీ ప్రధాని మోదీ చెప్పడం అటు బీజేపీ, ఇటు బీఆర్ఎస్ పార్టీలో ఇంట్రెస్టింగ్‌గా మారింది.
తెలంగాణ మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆరోగ్యంపై ప్రధాని నరేంద్ర మోదీ ఆరా తీయడం రాజకీయవర్గాల్లో ఆసక్తి రేపుతోంది. కేసీఆర్ ఆరోగ్య పరిస్థితిపై ప్రత్యేకంగా బీఆర్ఎస్ ఎంపీలను అడిగి తెలుసుకున్నారు మోదీ. ఇప్పుడు ఈ పరిణామంపైనే తెలంగాణ పొలిటికల్ సర్కిల్స్‌లో ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. ఎందుకంటే మోదీ, కేసీఆర్ కలిసి దాదాపు నాలుగేళ్లు అవుతోంది. 2021లో ఆఖరిసారి ప్రధాని మోదీని ముఖ్యమంత్రి హోదాలో కలిశారు కేసీఆర్. ఆ తర్వాత మోదీ, కేసీఆర్‌లు ఉప్పు, నిప్పులా ఉంటూ వచ్చారు. ప్రధాన మంత్రిగా మోదీ తెలంగాణకు అధికారిక పర్యటనకు వచ్చినా కనీసం కేసీఆర్ రిసీవ్ చేసుకోవడానికి ఎయిర్ పోర్టుకు కూడా వెళ్లలేదు.
ఇక లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో కేసీఆర్‌పై మోదీ, మోదీపై కేసీఆర్ ఆరోపణలు, విమర్శలు చేసుకున్నారు. టీఆర్ఎస్‌ను బీఆర్ఎస్ గా మార్చి దేశవ్యాప్తంగా పార్టీని విస్తరించి జాతీయ స్థాయిలో రాజకీయం చేయాలని కేసీఆర్ తీవ్రంగా ప్రయత్నించారు. కానీ 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి, లోక్ సభ ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత ఫామ్ హౌజ్‌కే పరిమితం అవుతూ..అక్కడే సమీక్షలు నిర్వహిస్తూ వస్తున్నారు కేసీఆర్.
ఇక లోక్‌సభ ఎన్నికల తర్వాత ఏడాదిన్నర కాలం నుంచి ప్రధాని మోదీ కూడా కేసీఆర్ పేరును పెద్దగా ఎక్కడా ప్రస్తావించలేదు. ఇలాంటి సిచ్యువేషన్‌లో ప్రధాని మోదీ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆరోగ్యంపై ఆరా తీయడం రాజకీయవర్గాల్లో ఆసక్తి రేపుతోంది. బీఆర్‌ఎస్ రాజ్యసభ సభ్యులు కేఆర్ సురేశ్ రెడ్డి, వద్దిరాజు రవిచంద్ర, దామోదర్‌రావు పార్లమెంట్‌లో ప్రధాన మంత్రిని ఆయన కార్యాలయంలో కలిసిన సందర్భంలో కేసీఆర్ ఆరోగ్యం గురించి అడిగి తెలుకున్నారట మోదీ. కేసీఆర్ ఎలా ఉన్నారు? ఆయన ఆరోగ్యం ఎలా ఉంది? కేసీఆర్ గారిని టీవీల్లో చూశాను..చాలా వీక్‌గా కనిపించారు..ఆయన హెల్త్‌ను జాగ్రత్తగా చూసుకోమనండి అంటూ మోదీ చెప్పడం చర్చకు దారితీస్తోంది. పైగా ఇవన్నీ తాను ప్రత్యేకంగా చెప్పమన్నానని చెప్పండి అంటూ తనను కలిసిన బీఆర్‌ఎస్ ఎంపీలకు మోదీ సూచించారు. కేసీఆర్ పూర్తి ఆరోగ్యంతో ఉన్నారని, మళ్లీ పార్టీ కార్యక్రమాల్లో బిజీ కాబోతున్నారని బీఆర్ఎస్ ఎంపీలు మోదీకి వివరించినట్లు తెలుస్తోంది.
ప్రధాని మోదీ మాజీ సీఎం కేసీఆర్ ఆరోగ్యంపై ప్రత్యేకంగా ఆరా తీయడం తెలంగాణ పాలిటిక్స్‌లో ఇంట్రెస్టింగ్‌గా మారింది. మరీ ముఖ్యంగా ఈ అంశంపై బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలో చర్చనీయాంశమవుతోంది. ఎందుకంటే తెలంగాణ రాజకీయాలలో పార్టీ సమీకరణలపై ఎప్పటికప్పుడు కొత్తగా చర్చలు జరుగుతున్నాయి. వచ్చే ఎన్నికల్లోనూ కాంగ్రెస్ తిరిగి అధికారంలోకి వస్తుందని సీఎం రేవంత్ ధీమా వ్యక్తం చేస్తుండగా.. ప్రభుత్వంపై వ్యతిరేకత పెరిగిందని..మళ్లీ కేసీఆర్ సీఎం అవుతారని బీఆర్ఎస్ నేతలు చెబుతున్నారు. ఈ క్రమంలో బీఆర్ఎస్, బీజేపీ ఒక్కటేనని..పంచాయతీ ఎన్నికల్లో ఈ రెండు పార్టీలు కలిసి పోటీ చేశాయని సీఎం రేవంత్ రెడ్డి ఆరోపిస్తున్నారు.
అంతేకాదు రాబోయే ఎన్నికల్లోపు బీజేపీలో బీఆర్ఎస్ విలీనం అని ఓ చర్చ జరుగుతుండగా..పొత్తు ఉంటుందని మరో ప్రచారం నడుస్తోంది. ఇలాంటి సమయంలో కేసీఆర్ ఆరోగ్యంపై ప్రధాని మోదీ ఆరా తీయడం చర్చనీయాంశమవుతోంది. ఈ మధ్యే తెలంగాణ బీజేపీ ఎంపీలు, పార్టీ నేతల పనితీరుపై ప్రధాని మోదీ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇంతలోనే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆరోగ్యంపై ప్రధాని ఆరా తీయడం కాకతాళీయమా లేక ఏదైనా మతలబ్ ఉందా అనేది పొలిటికల్ సర్కిల్స్‌లో హాట్ టాపిక్ మారింది.
Also Read: ఒకే ఒక్క స్టేట్‌మెంట్.. వైసీపీకి అంతా రివర్స్..! జగన్ చేసిన వ్యాఖ్యలేంటి? ఎందుకింత రచ్చ?