Siddipet Congress: సిద్ధిపేట కాంగ్రెస్‌లో ఏం జరుగుతోంది? డీసీసీ అధ్యక్షురాలి తీరుపై అసంతృప్తి ఎందుకు?
ఈ మధ్య జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో పార్టీ ఘోర పరాజయానికి.. ఆమె తీరే కారణం అనే చర్చ పార్టీ వర్గాల్లో జరుగుతోంది. గజ్వేల్, దుబ్బాక, హుస్నాబాద్, చేర్యాలలో ఎన్నికలు జరగా.. ఒక్క హుస్నాబాద్‌లో మాత్రమే కాంగ్రెస్ విజయం సాధించింది.
- Naveen
- Published On : March 28, 2026 / 09:58 PM IST
Siddipet Congress: సిద్ధిపేట జిల్లా.. బీఆర్ఎస్ కంచుకోట. జిల్లాలోని నాలుగింట మూడు నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలే ఉన్నారు. అలాంటి జిల్లాలో.. కారు పార్టీని కొట్టాలంటే.. గెలుపును లాక్కోవాలంటే.. ఎంత కష్టపడాలో.. ఎలా కలిసుండాలో.. ఎలాంటి వ్యూహాలు రచించాలో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అలాంటిది నేతల మధ్య లుకలుకలు.. హస్తం పార్టీని ఇబ్బంది పెడుతున్నాయ్. పార్టీ వర్గాలకు.. డీసీసీ అధ్యక్షురాలికి మధ్య రోజురోజుకూ దూరం పెరుగుతోందట. అసలు సిద్ధిపేట కాంగ్రెస్‌లో జరుగుతోంది.. ఆంక్ష రెడ్డి తీరుపై ఎలాంటి చర్చ నడుస్తోంది..
సిద్ధిపేట జిల్లా.. బీఆర్ఎస్ ఇలాఖా. జిల్లాలో మొత్తం నాలుగు నియోజకవర్గాలు ఉంటే.. ఒక్క హుస్నాబాద్‌లో మాత్రమే కాంగ్రెస్ గెలిచింది. గజ్వేల్‌లో కేసీఆర్, సిద్ధిపేటలో హరీష్.. దుబ్బాకలో కొత్త ప్రభాకర్ రెడ్డి ఘన విజయం సాధించారు. గజ్వేల్ నుంచి గత ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున పోటీ చేసిన తూంకుంట నర్సారెడ్డి.. 32వేలకు పైగా ఓట్లు సాధించి.. మూడో స్థానంలో నిలిచారు. ఆయన కూతురు ఆంక్ష రెడ్డే ఇప్పుడు సిద్ధిపేట జిల్లా డీసీసీ అధ్యక్షురాలిగా ఉన్నారు. నిజానికి ఓ బీసీ నాయకుడికి జిల్లా అధ్యక్ష పదవి కట్టబెట్టాలని పార్టీ అధిష్టానం ఆలోచించినా.. తన కూతురికే ఆ పదవి దక్కేలా చక్రం తిప్పారట తూంకుంట నర్సారెడ్డి. ఐతే విభేదాలు, గ్రూప్ రాజకీయాలతో.. ఆంక్ష రెడ్డికి సవాళ్లు ఎదురవుతున్నాయని.. ఆమె మాట జిల్లాలో అసలు చెల్లుబాటు కావడం లేదనే గుసగుసలు వినిపిస్తున్నాయ్.
దుబ్బాక, సిద్ధిపేటలో సొంత పార్టీ నేతలే పట్టించుకోవట్లేదా..
హుస్నాబాద్ నుంచి మంత్రి పొన్నం ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆయన మార్క్ దూకుడు చూపిస్తున్నారు. ఇక గజ్వేల్, సిద్ధిపేట, దుబ్బాకలో గ్రూపు రాజకీయాలు పార్టీకి తలపోటుగా మారాయని.. అక్కడి నాయకులు ఆంక్ష రెడ్డిని కనీసం తమ నాయకురాలిగా కూడా గుర్తించడం లేదని టాక్ నడుస్తోంది. గజ్వేల్‌లో కేసీఆర్‌ను, సిద్ధిపేటలో హరీష్‌ను ఓడిస్తానంటూ డీసీసీ అధ్యక్షురాలిగా బాధ్యత తీసుకున్నప్పుడు ఆంక్ష రెడ్డి భారీ స్టేట్‌మెంట్ ఇచ్చారు. ఐతే గజ్వేల్‌తో పాటు దుబ్బాక, సిద్ధిపేటలో సొంత పార్టీ నాయకులే ఆమెను పెద్దగా పట్టించుకోవడం లేదట. తన ఆదేశాలను ప్రతీ ఒక్కరు అమలు చేయాల్సిందేనంటూ ఆమె మోనార్క్‌లా వ్యవహరిస్తున్న తీరుపై.. నాయకులు గుర్రుగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇది కేడర్ లో అసంతృప్తికి కారణం అవుతుందనే చర్చ నడుస్తోంది.
ఆంక్ష దూకుడుతో పార్టీకి, కేడర్‌కు మధ్య దూరం..
ఈ మధ్య సీఎం రేవంత్ సిద్ధిపేట పర్యటనలోనూ.. కాంగ్రెస్ వర్గపోరు బయటపడింది. సిద్ధిపేట ఇంచార్జి పూజల హరికృష్ణ ఫొటో లేకుండా ఆంక్ష రెడ్డి ఫ్లెక్సీలు దర్శనమివ్వగా.. మరోవైపు డీసీసీ అధ్యక్షురాలి ఫొటో కాకుండా మైనంపల్లి హనుమంతరావు ఫొటోలతో ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి.. సీఎంకు ఘన స్వాగతం పలికారు పూజల హరికృష్ణ. ఇది జిల్లా రాజకీయాల్లో కొత్త చర్చకు దారి తీసింది. తూంకుంట, మైనంపల్లి మధ్య ఎప్పటి నుంచో విభేదాలు ఉన్నాయ్. ఐతే ఇప్పుడు మైనంపల్లి వర్గీయులు.. ఆంక్ష రెడ్డి నాయకత్వానికి ఏమాత్రం సపోర్టు ఇచ్చేలా కనిపించడం లేదు. ఇక ఆమె దూకుడు కూడా.. జిల్లా పార్టీ పెద్దలకు, కేడర్‌కు మధ్య దూరం పెంచుతుందనే ప్రచారం జరుగుతోంది. ఇక అటు కేసీఆర్, హరీష్‌ను ఓడించి చూపిస్తాం అంటూ ఆంక్ష రెడ్డి, రేవంత్ రెడ్డి సవాళ్లు విసురుతుంటే.. జిల్లాలో సొంత పార్టీ నేతలే అంక్షరెడ్డిని పట్టించుకోకపోవడం హాట్ టాపిక్ అవుతోంది.
కేవలం గజ్వేల్‌కే పరిమితం అయ్యారనే విమర్శలు..
ఈ మధ్య జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో పార్టీ ఘోర పరాజయానికి.. ఆంక్ష రెడ్డి తీరే కారణం అనే చర్చ పార్టీ వర్గాల్లో జరుగుతోంది. గజ్వేల్, దుబ్బాక, హుస్నాబాద్, చేర్యాలలో ఎన్నికలు జరగా.. ఒక్క హుస్నాబాద్‌లో మాత్రమే కాంగ్రెస్ విజయం సాధించింది. మిగతా చోట్ల గులాబీ జెండా ఎగిరింది. డీసీసీ అధ్యక్షురాలిగా అన్ని మున్సిపాలిటీలపై దృష్టి పెట్టి గెలిపించుకోవాల్సిన ఆమె.. కేవలం గజ్వేల్‌కే పరిమితం అయ్యారనే విమర్శలు వినిపిస్తున్నాయ్. తీరా చూస్తే.. అక్కడ కూడా గెలవని పరిస్థితి. ఓవరాల్‌గా ఆంక్ష రెడ్డి తీరు.. జిల్లాలో పార్టీ ఎదుగుదలకు ఉపయోగపడకపోగా.. తీవ్ర నష్టాన్ని చేకూర్చేలా ఉన్నాయని పార్టీ వర్గాలు అనుకుంటున్నాయట.
Also Read: కవిత కొత్త పార్టీ.. ఎవరెవరు చేరబోతున్నారు? ఏ పార్టీపై ప్రభావం ఉండబోతోంది?
