కోమటిరెడ్డి వ్యాఖ్యల వెనుక మతలబు ఏంటి.. సీఎం రేవంత్‌కి ఆగస్టు గండం అంటున్న బీఆర్ఎస్ ఆరోపణల్లో నిజమెంత?

తెలుగు రాజకీయాల్లో ఆగస్టు నెలకో ప్రత్యేకస్థానం ఉంది. ఏడాదిలో 12 నెలలు ఉంగా, ఆగస్టు వచ్చిందంటే పాలకులు ఉలిక్కి పడుతుంటారు. దీనికి గత అనుభవాలు చాలానే ఉన్నాయి. ముఖ్యంగా ఉమ్మడి రాష్ట్రంలో ఎన్టీఆర్‌ సీఎంగా ఉండగా, రెండు సార్లు ఆగస్టు నెలలోనే పదవీ గండం ఎదుర్కొన్నారు.

Gossip Garage : రాష్ట్రం మారినా… రాజకీయాలు మారినా… ఆగస్టు నెలపై పొలిటికల్‌ గాసిప్స్‌కు బ్రేక్‌ పడటం లేదు. ఉమ్మడి రాష్ట్ర అనుభవాలను దృష్టిలో పెట్టుకుని ఏటా ఆగస్టు నెలలో ఏదో రకమైన పొలిటికల్‌ గాసిప్‌కు మసాలా దట్టించి వదులుతుంటారు. ఇప్పుడు కూడా మంత్రి కోమటిరెడ్డి కామెంట్స్‌ను ప్రచారంలోకి తెచ్చి అదే రకమైన హడావుడి చేస్తోంది బీఆర్‌ఎస్‌. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడినా… ఆగస్టు ఆనవాయితీని కొనసాగించడమే ఇప్పుడు ఆసక్తికరంగా మారింది…. ఇంతకీ తాజా ఆగస్టు గాసిప్‌ ఏంటి?

ఆగస్టు నెలలో ఎన్టీఆర్ కు రెండుసార్లు పదవీ గండం..
తెలుగు రాజకీయాల్లో ఆగస్టు నెలకో ప్రత్యేకస్థానం ఉంది. ఏడాదిలో 12 నెలలు ఉంగా, ఆగస్టు వచ్చిందంటే పాలకులు ఉలిక్కి పడుతుంటారు. దీనికి గత అనుభవాలు చాలానే ఉన్నాయి. ముఖ్యంగా ఉమ్మడి రాష్ట్రంలో ఎన్టీఆర్‌ సీఎంగా ఉండగా, రెండు సార్లు ఆగస్టు నెలలోనే పదవీ గండం ఎదుర్కొన్నారు. ఇక అప్పటి నుంచి ఆగస్టు వచ్చిందంటే రాజకీయాల్లో ఏదో టాపిక్‌ హల్‌చల్‌ చేస్తూ ఉంటుంది. ఐతే ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో టీడీపీ లేకపోయినా, ఆగస్టు గండంపై ఏటా ఏదో ఒక టాపిక్‌ నడుస్తూనే ఉంటుంది. ఈ నెలలో ఏదో ఒక కుంభకోణం వెలుగు చూడటమో… అధికారంలో ఉన్న నేతల విషయాల్లో వార్తల్లో నిలుస్తుంటాయి. గత పదేళ్లలో బీఆర్‌ఎస్‌ కూడా అడపదడపా ఆగస్టు అనుభవాలను చవిచూసిందంటున్నారు. దీంతో ఆగస్టుకు రాజకీయంగా ప్రాధాన్యం ఏర్పడింది.

ఆగస్టు నెలలో కాంగ్రెస్‌ కు గడ్డు పరిస్థితులు?
ఇక ఇప్పుడు కూడా ఆగస్టు నెలలో కాంగ్రెస్‌ గడ్డు పరిస్థితులను ఎదుర్కోబోతోందంటూ మంత్రి కోమటిరెడ్డిని తెరపైకి తెస్తోంది గులాబీ పార్టీ….. ఆగస్టు గండానికి లింకు పెట్టి.. కోమటిరెడ్డి వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో కలకలం రేపనున్నాయని బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలు…. రాష్ట్ర రాజకీయాల్లో ఆగస్టుపై చర్చకు దారితీస్తున్నాయి.

రేవంత్ కుర్చీ లాగేస్తారంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు
సీఎం రేతంత్‌రెడ్డి అమెరికా పర్యటనకు వెళుతుండగా, రాష్ట్రంలో పాలన వ్యవహారాలను తాను చూసుకుంటానని మంత్రి కోమటిరెడ్డి వ్యాఖ్యానించడాన్ని విస్తృతంగా ప్రచారం చేస్తోంది బీఆర్‌ఎస్‌. సీఎం అమెరికాలో ఉండగా నల్లగొండ, ఖమ్మం మంత్రులు ఆయన కుర్చీ లాగేస్తారని కౌశిక్‌రెడ్డి వ్యాఖ్యానించడం…. తన వ్యాఖ్యలకు ఆగస్టు గండాలను ఉదహరిస్తుండటం ఆసక్తికరంగా మారింది. రాజకీయ విమర్శలైనా…. తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో ఆగస్టుకు ఉన్న ప్రత్యేకత దృష్ట్యా కౌశిక్‌రెడ్డి వ్యాఖ్యలు వైరల్‌ అవుతున్నాయి.

భట్టి ఉండగా కోమటిరెడ్డి అలాంటి వ్యాఖ్యలు చేయడం ఏంటి?
విదేశీ పెట్టుబడులను ఆకర్షించేందుకు సీఎం రేవంత్‌రెడ్డి అమెరికా పర్యటనకు శ్రీకారం చుట్టారు. 12 రోజుల పాటు సీఎం అమెరికాలో ఉంటారు. ఈ 12 రోజులు రాష్ట్ర పాలన వ్యవహారాలను డిప్యూటీ సీఎం హోదాలో భట్టి విక్రమార్క చూడాల్సివుంది. రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పడిన నుంచి సీఎం రేవంత్‌రెడ్డికి చేదోడువాదోడుగా ఉంటున్న భట్టి… ఆర్థిక మంత్రిగా కీలక బాధ్యతలు చూస్తున్నారు. ఐతే సీఎం విదేశాలకు వెళుతుండటంతో తాను రాష్ట్ర రాజకీయాలను… పాలనా వ్యవహారాలను చూసుకుంటానని మంత్రి కోమటిరెడ్డి వ్యాఖ్యానించడాన్ని బీఆర్‌ఎస్‌ అస్త్రంగా మార్చుకుంటోంది.
డిప్యూటీ సీఎం భట్టి ఉండగా, కోమటిరెడ్డి అలాంటి వ్యాఖ్యలు చేయడం కాంగ్రెస్‌లోనూ చర్చకు దారితీస్తోంది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితో సన్నిహితంగా ఉంటున్న కోమటిరెడ్డి యథాలాపంగా ఆ మాటలు అనేశారా? లేక రాష్ట్ర రాజకీయాలను శాసించాలనే ఆలోచన నిజంగా ఉందా? అనే చర్చ జరుగుతోంది.

అధికార పక్షాన్ని ఆత్మరక్షణలోకి నెట్టేసేలా బీఆర్ఎస్ వ్యూహం..
ఇదే సమయంలో బీఆర్‌ఎస్‌ రంగంలోకి దిగి అధికార పక్షాన్ని ఆత్మరక్షణలోకి నెట్టేసేలా…. కోమటిరెడ్డి మాటల చుట్టూ ఊహాగానాలను వండి వారుస్తోంది. అసలే ఆగస్టు…. పైగా ఆసక్తికర రాజకీయాలు… రెండూ కలిసిరావడంతో పొలిటికల్‌ సర్కిల్స్‌లో ఇదో హాట్‌ డిబేట్‌గా మారింది. ప్రస్తుతానికి రాష్ట్రంలో ఎలాంటి రాజకీయ సంక్షోభం లేకపోయినా.. కాంగ్రెస్‌ సీనియర్‌ మంత్రి చేసిన వ్యాఖ్యలను బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డి చాలా చాకచక్యంగా వాడుకుని పొలిటికల్‌ మైలేజ్‌ పెంచుకోవాలని చూడటమే పొలిటికల్‌ సర్కిల్స్‌లో హాట్‌టాపిక్‌గా మారింది.

Also Read : ఆ ఇద్దరు అక్కలపై సీఎం రేవంత్ రెడ్డి కోపానికి అసలు కారణం ఇదే?

ట్రెండింగ్ వార్తలు