Kavitha New Party: కవిత కొత్త పార్టీ.. ఎవరెవరు చేరబోతున్నారు? ఏ పార్టీపై ప్రభావం ఉండబోతోంది?

కవిత ప్రకటించబోయే రాజకీయ పార్టీలోకి.. ఏయే పార్టీ నుంచి ఎవరెవరు వెళ్తారనే దానిపై పొలిటికల్ సర్కిల్స్ లో జోరుగా చర్చ నడుస్తోంది.

  • Published On : March 28, 2026 / 08:16 PM IST
  • కవిత పార్టీలో చేరబోయేది ఎవరు..?
  • కవిత ప్రభావం.. ఏ పార్టీపై పడనుంది?
  • తన పార్టీలో కవిత ఎవరిని చేర్చుకుంటారు?
  • బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీపై ఎఫెక్ట్ ఎంత?

 

Kavitha New Party: యస్.. ఇట్స్ అఫీషియల్. పార్టీ ప్రకటనకు ముహూర్తం ఖరారయింది. కవిత పెట్టబోయే పార్టీ జెండా ఎలా ఉండబోతోంది, అజెండా ఏంటి అనే ఉత్కంఠకు ఇంకొన్ని రోజుల్లో ఫుల్‌స్టాప్ పడబోతోంది. ఇదంతా సరే.. మరి ఆ కొత్త పార్టీ ప్రయాణం ఎలా ఉంటుంది.. అందులో చేరబోయేది ఎవరు.. ఎవరెవరు కవితతో టచ్ లో ఉన్నారు. బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ మీద కవిత పార్టీ ప్రభావం ఎలా ఉండబోతోంది..

కొత్తగా ఒక పార్టీ పెట్టారంటే.. కొత్తగా వచ్చే ఓట్లు ఏమీ ఉండవు. ఇతర పార్టీలకి సానుకూలంగా ఉన్న ఓట్లను.. లేదా తటస్థులుగా ఉన్న వారిని మాత్రమే సొంతం చేసుకుని.. ఆ పార్టీ ముందుకు సాగుతుంది. క్లియర్ గా చెప్పాలంటే.. కొత్త పార్టీ తెర మీదకు వచ్చిందంటే.. రాజకీయ సమీకరణాలు సరికొత్తగా కనిపిస్తుంటాయ్. కొన్నిసార్లు పూర్తిగా మారిపోతుంటాయ్. తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు ఇదే చర్చ నడుస్తోంది. ఇక్కడ మరో కొత్త పార్టీ పురుడు పోసుకుంటోంది. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత.. పొలిటికల్ పార్టీని ఏర్పాటు చేస్తున్నారు.

ఏప్రిల్ 25న పార్టీ పేరు, జెండా, ఎజెండాను ప్రకటించబోతున్నారు. ఇది దాదాపుగా పసుపు, కుంకుమ రంగుల కలయికతో తెలంగాణ ప్రజా జాగృతి పేరుతో కవిత పార్టీ రాబోతున్నట్లు చర్చ జరుగుతోంది. ఆమె పార్టీ ఎలా ఉండబోతోంది, పార్టీ ప్రకటన సందర్భంగా ఏయే అంశాలను ప్రస్తావించబోతున్నారు.. తన పార్టీ తెలంగాణలోని ఏ పార్టీకి ప్రత్యామ్నాయం కాబోతుందనేది ఉత్కంఠ రేపుతోంది.

కవిత పార్టీలో ఎవరెవరు చేరబోతున్నారనే ఆసక్తి..

అడుగులు.. లక్ష్యాలు.. విధివిధానాల సంగతి ఎలా ఉన్నా.. కవిత ప్రకటించబోతున్న రాజకీయ పార్టీలో ఎవరెవరు చేరబోతున్నారనేది ఇప్పుడు రాజకీయవర్గాల్లో ఆసక్తి రేపుతోంది. తెలంగాణ ఉద్యమకారులు, వివిధ ప్రజా సంఘాల నాయకులు, మేధావులు, అన్ని రాజకీయ పార్టీల నుంచి పలువురు నేతలు .. తన పార్టీలో చేరతారని కవితతో పాటు జాగృతి కార్యకర్తలు విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. అధికార కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ నుంచి కూడా చాలామంది నాయకులు తనకు టచ్ లో ఉన్నారని అంటున్నారు. మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎంపీలు, మాజీ ఎమ్మెల్సీలతో పాటు.. బీఆర్ ఎస్ ముఖ్య నేతలు కూడా తమ పార్టీలోకి వస్తామనే సంకేతాలు పంపుతున్నారని ప్రచారం చేస్తున్నారు. ఇది తెలంగాణ రాజకీయాన్ని మరింత ఆసక్తికరంగా మారుస్తోంది.

బీఆర్ఎస్ నుంచి మెజారిటీ నాయకులను లాగే ప్రయత్నం!

కవిత ప్రకటించబోయే రాజకీయ పార్టీలోకి.. ఏయే పార్టీ నుంచి ఎవరెవరు వెళ్తారనే దానిపై పొలిటికల్ సర్కిల్స్ లో జోరుగా చర్చ నడుస్తోంది. తన తండ్రి పార్టీ బీఆర్ఎస్ నుంచి మెజారిటీ నాయకులను.. తనవైపు తిప్పుకొనే ప్రయత్నం కవిత చేయవచ్చనే అభిప్రాయాలు వినిపిస్తున్న వేళ.. కారు పార్టీ నుంచి ఎవరెవరు వెళ్తారనేది ఇంట్రస్టింగ్ గా మారింది. గులాబీ పార్టీలో చాలామంది నేతలతో.. కవితకు మంచి అనుబంధం ఉంది. గతంలో చాలామంది నాయకులతో ఆమె కలిసి పనిచేశారు. బీఆర్ఎస్ నుంచి తనను సస్పెండ్ చేసిన తర్వాత కూడా.. ఆ పార్టీ నేతలతో కవిత మంచి సంబంధాలు కొనసాగిస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో బీఆర్ఎస్ నుంచి చాలామంది నేతలు, కార్యకర్తలు తన పార్టీలోకి వస్తారని కవిత భావిస్తున్నారని తెలుస్తోంది. పార్టీలో అసంతృప్తులు, గతంలో టికెట్ ఆశించి భంగపడిన వాళ్లను.. కవిత టార్గెట్ చేసే అవకాశాలు ఉన్నాయనేది రాజకీయవర్గాల్లో వినిపిస్తున్న గుసగుస.

కాంగ్రెస్‌, బీజేపీ నుంచి కూడా చేరికలు ఉంటాయనే టాక్‌..

అధికార కాంగ్రెస్ తో పాటు.. బీజేపీ నుంచి కూడా కవిత పార్టీలోకి చేరికలు ఉంటాయని.. ఆమె వర్గం నేతలు ప్రచారం చేస్తున్నారు. అలాగే పదవులు దక్కకపోవడంతో కాంగ్రెస్ లో అసంతృప్తితో ఉన్న నేతలపైనా కవిత దృష్టి సారించినట్లు చెప్తున్నారు. నిజానికి రాజకీయ పార్టీ ఏర్పాటు చేయాలనే నిర్ణయం తీసుకున్న తర్వాత నుంచే.. బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ నేతలతో కవిత సంప్రదింపులు జరుపుతూ వస్తున్నారని.. ఆమె వర్గం నేతలు అంటున్నారు. సీనియర్లతో సహా.. చాలామంది యువ నాయకులు కూడా తమ పార్టీలో చేరతారనే నమ్మకంతో కవిత ఉన్నారని తెలుస్తోంది. మరి ఏది నిజం కాబోతుంది.. ఏం జరగబోతుంది అనేది తేలాలంటే ఏప్రిల్ 25 వరకు ఆగాల్సిందే.

Also Read: అక్రమ మైనింగ్‌పై సీఎం రేవంత్ కీలక నిర్ణయం.. సీబీసీఐడీ విచారణకు ఆదేశం