Danam Nagender: జూబ్లీహిల్స్ టికెట్ నాకివ్వండి..! దానం నాగేందర్ అదిరిపోయే స్కెచ్..! అక్కడ పోటీ చేస్తాననడానికి కారణమిదే..!

ఇప్పుడున్న పరిస్థితుల్లో అక్కడ బీఆర్ఎస్ ఇంకా బలపడిందని..బైపోల్ వస్తే తనకు ఇబ్బందులు తప్పకపోవచ్చని అంచనా వేస్తున్నారట.

Danam Nagender: అనర్హత కత్తి వేలాడుతోంది. తన సెగ్మెంట్‌ పక్కనే ఉన్న మరో నియోజకవర్గంలో బైపోల్ ఉంది. అక్కడైతే గెలిచే ఛాన్స్ ఉందట. అందుకే ఆ ఎమ్మెల్యే ఫోకస్ ఆ నియోజకవర్గం మీదకు మళ్లిందట. పైగా ఆ సీటు బైపోల్‌ బరిలో నిలిచేందుకు హస్తం పార్టీకి బలమైన అభ్యర్థి దొరకట్లేదట. ఇదే అదునుగా కాంగ్రెస్ పెద్దల ముందు ఓ ప్రపోజల్ పెట్టారట ఈ సీనియర్ ఎమ్మెల్యే. ఇప్పడున్న సిచ్యువేషన్‌లో ఆ బై ఎలక్షన్‌లో గెలవాలంటే తనకు టికెట్ ఇవ్వాలని కోరుతున్నారట. అక్కడ తనకు టికెట్ ఇస్తే..తాను రాజీనామా చేస్తే ఖాళీ అయ్యే తన నియోజకవర్గంలో తిరిగి కాంగ్రెస్‌ జెండాను రెపరెపలాడించే బాధ్యత తనదంటున్నారట సదరు ఎమ్మెల్యే. ఇంతకు ఆయన ప్లానేంటి? తన సీటును వదులుకుని మరో చోట పోటీ చేస్తాననడానికి కారణమేంటి?

ఫిరాయింపు ఎమ్మెల్యేల ఎపిసోడ్‌లో హాట్‌ టాపిక్‌గా ఉన్న పేరు దానం నాగేందర్. ఎందుకంటే కాంగ్రెస్ గుర్తు మీద లోక్‌సభ అభ్యర్థిగా పోటీ చేయడంతో దానంపై వేటు పడటం ఖాయమన్న టాక్ బలంగా వినిపిస్తోంది. ఇప్పటికీ ఆయన స్పీకర్ నోటీసులకు రిప్లై ఇవ్వకపోవడానికి ఇదే ప్రధాన కారణమన్న చర్చ జరుగుతోంది. దీంతో దానం నాగేందర్ అలర్ట్ అయినట్లు తెలుస్తోంది. ఎమ్మెల్యే ప‌ద‌విని..రాజకీయంగా తన ఉనికిని కాపాడుకునేందుకు దానం నాగేంద‌ర్ అదిరిపోయే స్కెచ్ వేస్తున్నార‌ట‌.

ఈ ప్రపోజ‌ల్ పెట్టడానికి పెద్ద కారణమే ఉందట..!

ఫిరాయింపుల అంశం సీరియ‌స్‌గా ఉండ‌టంతో..తానే ఒక అడుగు ముందుకు వేస్తున్నార‌ట‌. ప్రస్తుతం ఖైర‌తాబాద్ ఎమ్మెల్యేగా ఉన్న దానం నాగేంద‌ర్ ఆ స్థానానికి రాజీనామా చేస్తాన‌ని ప‌ట్టుప‌డుతున్నార‌ట‌. ఖైర‌తాబాద్ సెగ్మెంట్‌కు రాజీనామా చేసి..ఇప్పటికే ఖాళీ అయిన జూబ్లీహిల్స్ నుంచి పోటీ చేస్తాన‌ని కోరుతున్నారట. ఈ ప్రపోజ‌ల్ పెట్టడానికి పెద్ద కారణమే ఉందట.

సికింద్రాబాద్ పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేసిన దానం నాగేంద‌ర్‌కు త‌న సొంత సెగ్మెంట్ ఖైర‌తాబాద్‌లో..ఎమ్మెల్యే ఎన్నికల్లో వచ్చినన్ని ఓట్లు కూడా రాలేదట. దీంతో దానం రూటు మార్చి జూబ్లీహిల్స్‌ టికెట్ కోసం ట్రై చేస్తున్నారట. అయితే జూబ్లీహిల్స్ బరిలో ఎవరిని నిలిపితే బాగుంటుందని..అభ్యర్థి ఎంపిక కోసం హైకమాండ్ సర్వేల మీద సర్వేలు చేయిస్తుంటే..ఏ సర్వేలో కూడా టికెట్ రేసులో ఉన్న నేతలు బీఆర్ఎస్‌కు గట్టి పోటీ ఇచ్చే పరిస్థితి కూడా లేదని రిపోర్ట్ వస్తుందట.

ఆ కోటాలో మంత్రివ‌ర్గంలో ఛాన్స్?

ఇదే అదునుగా దానం ఎంటర్‌ ఆఫ్‌ ది డ్రాగన్ అంటున్నారట. తనకు జూబ్లీహిల్స్ టికెట్‌ ఇస్తే బంప‌ర్ మెజారిటీతో గెలుస్తానని చెప్తున్నారట. అందుకు ఎంపీ ఎన్నికల్లో జూబ్లీహిల్స్‌లో తనకు వచ్చిన ఓట్లను ఉదాహరణగా చూపిస్తున్నారట దానం. అంతేకాదు రిజైన్‌ చేసి జూబ్లీహిల్స్ నుంచి పోటీ చేస్తానని దానం పట్టుబడటం వెనక పెద్ద స్కెచ్ ఉందంటున్నారు. జూబ్లీహిల్స్‌లో గెలిస్తే..గ్రేటర్ ఈక్వేషన్‌, మున్నూరుకాపు కోటాలో మంత్రివ‌ర్గంలో ఛాన్స్ ద‌క్కించుకోవ‌చ్చని ప్లాన్ వేస్తున్నారట.

పైకి మాత్రం తాను జూబ్లీహిల్స్ టికెట్ అడగడం లేదని చెప్తున్నారట దానం. తన సొంత నియోజకవర్గం ఉండగా ఖైరతాబాద్‌ ఉండగా..జూబ్లీహిల్స్‌కు ఎందుకు వెళ్తానంటూ మీడియాతో ఆఫ్‌ ది రికార్డులో చెప్తున్నారట. కానీ ఇంటర్నల్‌గా బైపోల్ బరిలో నిలిచేందుకు కాంగ్రెస్ ముఖ్యుల‌ను మ‌చ్చిక చేసుకునే ప‌నిలో ప‌డ్డార‌ట‌. జూబ్లీహిల్స్‌తో పాటు ఖైర‌తాబాద్ సెగ్మెంట్‌కు ఎన్నిక‌లు వ‌స్తే..రెండు స్థానాల‌కు అయ్యే ఖ‌ర్చును భ‌రిస్తాన‌ని హామీ ఇస్తున్నార‌ట‌. రెండు సీట్లను గెలిపించుకునే బాధ్యతను కూడా త‌న‌దే అని చెబుతున్నార‌ట‌.

దీంతో పాటు ఇంకొక అదిరిపోయే స్కెచ్ వేశార‌ట‌. ఖైర‌తాబాద్‌కు తాను రాజీనామా చేస్తే..వ‌చ్చే ఉప ఎన్నిక‌ల్లో సీఎం రేవంత్ రెడ్డి క్లోజ్ ఫ్రెండ్ రోహిన్‌రెడ్డిని బ‌రిలో నిలిపి గెలిపిస్తాన‌ని ఆఫ‌ర్ ఇచ్చారట. ఖైర‌తాబాద్ నుంచి పోటీ చేయాల‌ని ఎప్పటినుంచో రోహిన్ రెడ్డి కూడా ఉవ్విల్లూరుతున్నారు. రోహిన్‌రెడ్డిని గెలిపిస్తానంటే రేవంత్‌ కూడా సుముఖత వ్యక్తం చేస్తారని భావించి..మెల్లిగా పావులు కదుపుతున్నారట దానం.

అయితే ఖైరతాబాద్‌ బైపోల్‌లో ట్రయాంగిల్‌ ఫైట్ ఉండే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారట దానం. ఇప్పుడున్న పరిస్థితుల్లో అక్కడ బీఆర్ఎస్ ఇంకా బలపడిందని..బైపోల్ వస్తే తనకు ఇబ్బందులు తప్పకపోవచ్చని అంచనా వేస్తున్నారట. జూబ్లీహిల్స్‌లో అయితే ముస్లిం ఓట్లు ఎక్కువగా ఉండటంతో అక్కడ తనకు కలిసి వస్తుందని..ఎంఐఎం సపోర్ట్ కూడా ఉంటుంది కాబట్టి ఈజీగా గెలుస్తానని లెక్కలు వేసుకుంటున్నారట దానం. ఆయన ప్రతిపాదనకు కాంగ్రెస్ పెద్దలు ఓకే చెప్తారా.? ఒకవేళ దానంకు జూబ్లీహిల్స్ టికెట్ ఇస్తే నవీన్‌ యాదవ్‌తో పాటు లోకల్ లీడర్లు సహకరిస్తారా లేదా అన్నది వేచి చూడాలి.