Telangana Congress: నో రెస్పాన్స్, నో కౌంటర్.. సీఎంను అపోజిషన్ టార్గెట్ చేస్తుంటే మంత్రులు, ఎమ్మెల్యేలకు పట్టట్లేదా? ఎందుకీ మౌనం?

కొందరు అమాత్యుల తీరుపై విసుగొచ్చి ఒకరిద్దరు ఎమ్మెల్యే బహిరంగంగానే విమర్శలు ఎక్కుపెడుతున్నారు. అసెంబ్లీ వేదికగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.. ఖమ్మం జిల్లా మంత్రుల తీరుపై విమర్శలు గుప్పించారు. ఎమ్మెల్యేలుగా తాము లేకపోతే..మీకు ఆ సీట్లు, గౌరవం ఉండదని ఘాటుగా హెచ్చరించారు.

  • Updated on- April 15, 2026 / 11:22 PM IST
  • మంత్రులపై అలిగేషన్స్ వస్తే ఎమ్మెల్యేల నోరెస్పాన్స్‌!
  • కోఆర్డినేషన్ మిస్ అయ్యిందా? లేక ఎవరిదారి వారిదేనా?
  • టీమ్‌ రేవంత్‌ స్పిరిట్‌ స్లోగన్‌ ఎక్కడ తేడా కొడుతోంది?
  • సీఎం, మంత్రులను అపోజిషన్ టార్గెట్‌ చేస్తే హ్యాపీగా ఫీల్ అవుతున్నదెవరు?

 

Telangana Congress: సీఎంను అపోజిషన్‌ టార్గెట్‌ చేస్తే మంత్రులు లైట్ తీసుకుంటారు. అమాత్యులపై అవినీతి ఆరోపణలు వస్తే ఎమ్మెల్యేలకు పట్టదు. పైగా మంత్రులను అపోజిషన్ లీడర్లు టార్గెట్‌ చేస్తుంటే..సొంత పార్టీ నేతలు తెగ హ్యాపీగా ఫీల్ అవుతున్నారట. అసలు తెలంగాణ కాంగ్రెస్‌లో ఏం జరుగుతోంది? ఎవరి మీద విమర్శలు వస్తే వాళ్లే సమాధానం చెప్పుకోవాల్సిందేనా? సెక్రటేరియట్‌కు..గాంధీభవన్‌కు మధ్య గ్యాప్ పెరిగిందా?

తెలంగాణ కాంగ్రెస్ లీడర్ల రూటే సెపరేటు. మంత్రులంతా తమకు తామే సుప్రీమ్ అని..తమకు ఎవరితో ఏ అవసరం అనే భావనలో ఉన్నారట. పార్టీని, ప్రభుత్వాన్ని పట్టించుకునే నాధుడే లేరట. అంతా ఎవరికి వారు యమునా తీరే అన్నట్లు ప్రవర్తిస్తున్నారట. ప్రభుత్వంపై అపోజిషన్ లీడర్లు విమర్శలు చేస్తుంటే తమకేం సంబంధం అన్నట్లుగా ఉంటున్నారట. ప్రతిపక్ష నేతలు సీఎం రేవంత్‌రెడ్డిని టార్గెట్ చేస్తుంటే సీనియర్ మంత్రులు కూడా సైలెంట్‌గా ఉంటున్నారట. ఇక ఎమ్మెల్యేల తీరు ఇంకా వేరు అన్నట్లుగా ఉందట పరిస్థితి. ఏదైనా పనిమీద ఎమ్మెల్యేలు..మంత్రుల దగ్గరకు వెళ్తే గంటల తరబడి వెయిట్ చేయిస్తున్నారట. కనీసం ఎమ్మెల్యేలమనే మర్యాద కూడా ఇవ్వట్లేదట. ముగ్గురు, నలుగురు మంత్రులైతే..ఎమ్మెల్యేలు టైమ్‌ అడిగితే..కూడా బిజీగా ఉన్నామని.. ఫోన్లు చేస్తే లిఫ్ట్ చేయట్లేదట. దీంతో అసంతృప్తితో రగిలిపోతున్న శాసనసభ్యులు సందు చూసి సైలెంట్‌గా ఉండిపోతున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి.

మంత్రులపై ఎక్కుపెడుతున్న బాణాలను చూసి సంబరపడిపోతున్నారట..

కొందరు అమాత్యుల తీరుపై విసుగొచ్చి ఒకరిద్దరు ఎమ్మెల్యేలు బహిరంగంగానే విమర్శలు ఎక్కుపెడుతున్నారు. అసెంబ్లీ వేదికగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.. ఖమ్మం జిల్లా మంత్రుల తీరుపై విమర్శలు గుప్పించారు. ఎమ్మెల్యేలుగా తాము లేకపోతే..మీకు ఆ సీట్లు, గౌరవం ఉండదని ఘాటుగా హెచ్చరించారు. మరో ఎమ్మెల్యే పార్టీ ఫిరాయించి వచ్చిన బాన్సువాడు ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి కూడా తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. మంత్రులకు ఫోన్లు చేస్తే కూడా లిప్ట్ చేయడం లేదని.. అసలు ఇంతకీ రాష్ట్రంలో ప్రభుత్వం ఉందా అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఛాన్స్ దొరికిన ప్రతీసారి ఎమ్మెల్యేలంతా..మంత్రుల తీరుపై తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇదే సందు అనుకుని..మంత్రులపై ఎలాంటి ఆరోపణలు వచ్చినా..అపోజిషన్‌ ఎంత స్ట్రాంగ్‌గా విమర్శించినా కౌంటర్‌ ఇచ్చేందుకు ముందుకు రావట్లేదట ఎమ్మెల్యేలు. పైగా ప్రతిపక్షాలు మంత్రులపై ఎక్కుపెడుతున్న బాణాలను చూసి సంబరపడిపోతున్నారట.

ఈ మధ్య కొందరు మంత్రులు తమ శాఖల్లో అవినీతి అంటూ ప్రతిపక్ష బీఆర్ఎస్‌ సీరియస్ అలిగేషన్స్ చేస్తోంది. మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, భట్టి విక్రమార్క, సీతక్క, పొన్నం ప్రభాకర్, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, శ్రీధర్ బాబు, దామోదర రాజనర్సింహలపై కారు పార్టీ గట్టిగానే ఆరోపణలు చేస్తోంది. వారి వారి శాఖల్లో జరిగే అంశాలపై అవినీతి ఆరోపణలు గుప్పిస్తోంది. అయితే తమపై వచ్చిన ఆరోపణలకే తామే సమాధానం చెప్పుకునే పరిస్థితి మంత్రులకు ఏర్పడిందట. ఏ ఒక్క ఎమ్మెల్యే కూడా..అమాత్యులను వెనకేసుకురావడం లేదనే చర్చ బలంగా జరుగుతోంది. పైగా మంత్రులు ఫోన్లు చేసి రెస్పాండ్‌ కావాలని చెప్పినా..ఎమ్మెల్యేలు..పార్టీ నేతలు లైట్ తీసుకుంటున్నారట.

మంత్రులు మరీ ప్రెజర్‌ చేస్తే..ఒకరిద్దరు నేతలు మొహమాటానికి అలా మీడియా ముందుకు వచ్చి మమ అనిపిస్తున్నారట. పైగా మంత్రులపై ప్రతిపక్ష బీ.ఆర్.ఎస్ నేతలు ఆరోపణలు చేస్తుంటే..బాగైంది అన్నట్లుగా లోలోన నవ్వుకుంటున్నారట. గతంలో సీఎంపై బీఆర్ఎస్ చేసిన విమర్శలను మంత్రులు కౌంటర్‌ ఇవ్వకపోగా..ఇప్పుడు మంత్రులపై వచ్చిన అలిగేషన్స్‌కు ఎమ్మెల్యేలు రెస్పాండ్‌ కావట్లేదట. దీంతో సీఎం విషయంలో మంత్రులు అలా..అమాత్యులపై ఆరోపణల ఎపిసోడ్‌లో ఎమ్మెల్యేలు ఇలా..క్యా సీన్‌ హై అంటూ..హస్తం పార్టీ లీడర్లే జోకులు వేసుకుంటున్నారట.

దీంతో మంత్రుల పరిస్థితి చాలా చిత్రంగా తయారైందట. అత్త తిట్టిన దాని కంటే తోడి కోడలు నవ్విందనే సామెత లాగా మంత్రుల తెగ ఫీలైపోతున్నారట. ప్రతిపక్ష బీఆర్ఎస్ చేస్తున్న విమర్శల కంటే..సొంత పార్టీ నేతలు తమకు అండగా నిలవట్లేదన్న బాధే వారిలో ఎక్కువైందట. సీఎం వర్సెస్ మంత్రులు..మంత్రులు వర్సెస్ ఎమ్మెల్యేల ఎపిసోడ్‌ను హస్తం పెద్దలు ఎలా సెట్ చేస్తారో చూడాలి.

Also Read: హైబ్రిడ్ మోడల్ వర్కౌట్ అయ్యేనా? డీలిమిటేష‌న్‌పై రేవంత్ సరికొత్త లాజిక్స్‌తో చర్చ..