Telangana Govt : రేవంత్ సర్కార్ సంచలన నిర్ణయం.. ఆ భూములన్నీ పేదలకు పంచే యోచన.. లెక్కలు తీస్తున్న అధికారులు!
Telangana Govt : తెలంగాణలో సీలింగ్ భూముల వ్యవహారం మరోసారి హాట్ టాపిక్‌గా మారింది. పరిమితికి మించి ఉన్న భూములపై ప్రభుత్వం దృష్టి పెట్టడంతో భూయజమానుల్లో టెన్షన్ మొదలైంది.
- Harish Thanniru
- Published on- October 2, 2026 / 08:48 AM IST
Telangana Government
Telangana Govt : తెలంగాణలో సీలింగ్ భూముల వ్యవహారం మరోసారి హాట్ టాపిక్‌గా మారింది. పరిమితికి మించి ఉన్న భూములపై ప్రభుత్వం దృష్టి పెట్టడంతో భూయజమానుల్లో టెన్షన్ మొదలైంది. పాత రికార్డులు, ప్రస్తుత భూ వివరాలను పరిశీలిస్తే భారీగా మిగులు భూములు వెలుగులోకి వచ్చే అవకాశముంది. ఈ అక్రమంలో అసలు సీలింగ్ చట్టం ఏం చెబుతోంది? ఎవరికి ఎంత భూమి ఉండొచ్చు? మిగులు భూమి ఉంటే ఏం జరుగుతుంది? అనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.
తెలంగాణలో సీలింగ్ భూముల వ్యవహారం మరోసారి తెరపైకి వచ్చింది. సీలింగ్ చట్టాన్ని పకడ్బందీగా అమలు చేసి, పరిమితికి మించి ఉన్న భూములను గుర్తించే దిశగా ప్రభుత్వం కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. పాత రికార్డులను పరిశీలించి మిగులు భూములను గుర్తించి, వాటిని చట్ట ప్రకారం వినియోగంలోకి తీసుకురావడంపై దృష్టి సారించినట్లు తెలుస్తోంది.
సీలింగ్ చట్టాన్ని ఉల్లంఘించి పరిమితికి మించి భూములు కలిగి ఉంటే వాటిని స్వాధీనం చేసుకుంటామని సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో పేర్కొనడంతో ఈ అంశంపై మరోసారి చర్చ మొదలైంది. సీలింగ్ చట్టం రద్దయిందనే ప్రచారం నేపథ్యంలో.. చట్టం అమల్లోనే ఉందని ప్రభుత్వం స్పష్టం చేసినట్లయింది. అయితే, అందుబాటులో ఉన్న వివరాల ప్రకారం.. రాష్ట్రంలో 2,09,833 మంది సీలింగ్ చట్టం కింద తమ భూములను డిక్లేర్ చేయగా.. 4,42,624 ఎకరాలు ప్రభుత్వానికి సమకూరాయి. మరి ఇందులో ఎంత భూమిని పేదలకు పంపిణీ చేశారు? ఎంత భూమిని ఇళ్ల స్థలాల కోసం రెగ్యులరైజ్ చేశారు? అనే వివరాలపై పూర్తిస్థాయి లెక్కలు అందుబాటులో లేవనే చర్చ జరుగుతోంది. ప్రస్తుతం భూముల పాత రికార్డులను పరిశీలించి సీలింగ్, ప్రభుత్వ, అసైన్డ్, దేవాదాయ, వక్ఫ్, ఇనాం, భూదాన్ తదితర భూములను గుర్తించే అంశంపై అధికారులు దృష్టి సారించినట్లు తెలుస్తోంది.
కంపెనీల పేర్లతో పెద్ద మొత్తంలో భూముల కొనుగోళ్ల అంశం కూడా చర్చకు వస్తోంది. 54 ఎకరాలకు మించి భూమి కొనుగోలు చేసే సంస్థలు నిర్దిష్ట నిబంధనలు పాటించాల్సి ఉంటుంది. సంబంధిత అవసరాలకు అనుగుణంగా అనుమతులు తీసుకోవడంతో పాటు భూమిని నాన్-అగ్రికల్చరల్ వినియోగానికి మార్చాల్సిన నిబంధనలు ఉన్నాయి. సీలింగ్ పరిమితికి మించి ఉన్న భూమిని మిగులు భూమిగా పరిగణించి, నిబంధనల ప్రకారం ప్రభుత్వానికి అప్పగించాల్సి ఉంటుంది. ప్రభుత్వం స్వాధీనం చేసుకున్న భూమిని భూమిలేని పేదలు, దళితులు, గిరిజనులకు వ్యవసాయ లేదంటే నివాస అవసరాల కోసం పంపిణీ చేసే అవకాశం ఉంటుంది.
ఇదిలాఉంటే.. సీలింగ్ పరిమితికి మించిన భూమిని విక్రయించడం, గిఫ్ట్ ఇవ్వడం లేదంటే మార్పిడి చేయడం చట్టపరంగా చెల్లదని సంబంధిత నిబంధనలు పేర్కొంటున్నాయి. ఇలాంటి లావాదేవీలపై సెక్షన్ 17 కింద నిబంధనలు వర్తిస్తాయని అధికారులు చెబుతున్నారు. మిగులు భూముల వివరాలను దాచిపెట్టడం లేదంటే ప్రభుత్వానికి అప్పగించకపోవడం వంటి ఉల్లంఘనలకు సెక్షన్ 23 కింద చర్యలు తీసుకునే అవకాశం ఉంది. నిబంధనల ప్రకారం రెండేళ్ల వరకు జైలు శిక్ష లేదంటే జరిమానా విధించే అవకాశం కూడా ఉన్నట్లు సమాచారం.
అయితే, పాత భూ రికార్డులు, ప్రస్తుత వివరాలను అనుసంధానించి మిగులు భూములను గుర్తించే ప్రక్రియ చేపడితే సీలింగ్ భూములపై మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉంది. దీంతో ప్రభుత్వం చేపట్టబోయే తదుపరి చర్యలపై భూయజమానులు, రియల్ ఎస్టేట్ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది.
