Government Supports Mariammas Family Rs 35 Lakh Compensation To Her Family
Minister Ajay consoles Mariamma’s family in Khammam: ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గం చింతకాని మండలం కోమట్లగూడెం గ్రామంకు చెందిన దళిత మహిళ అంబడిపూడి మరియమ్మ కుటుంబాన్ని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పరామర్శించారు. మరియమ్మ మృతికి కారకులపై చర్యలు తీసుకుంటామని అన్నారు అజయ్. ప్రభుత్వం తరపున కుటుంబానికి అండగా ఉంటామని, మరియమ్మ కుమారుడికి రూ.15లక్షలు, ప్రభుత్వ ఉద్యోగం, ఇద్దరు కుమార్తెలకు చెరో రూ.10లక్షలు ఇవ్వనున్నట్లు అజయ్ కుమార్ ప్రకటించారు.
యాదాద్రి జిల్లా అడ్డగూడూరు పోలీస్ కస్టడీలో మరియమ్మ చనిపోగా.. కస్టోడియల్ డెత్‌పై విచారణ జరుగుతోంది. అడ్డగూడూరు పోలీసుల కస్టడీలో మృతి చెందిన మరియమ్మ కుటుంబాన్ని పరామర్శించిన రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్.. మరియమ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. మరియమ్మ మృతి అత్యంత బాధాకరమని, ఇటువంటి చర్యలను ప్రభుత్వం సహించబోదని మంత్రి స్పష్టం చేశారు.
ఈ సంఘటనలో మరణించిన మరియమ్మ కుటుంబాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ న్యాయం చేస్తానని చెప్పారని, కుమారుడు ఉదయ్ కిరణ్‌కి రూ.15 లక్షల చెక్కు, ప్రభుత్వ ఉద్యోగ నియామక ఉత్తర్వులను స్వయంగా అందజేశారు. ఇద్దరు కుమార్తెలకు ప్రభుత్వం తరుపున చెరో రూ.10 లక్షలు మొత్తం రూ. 35 లక్షల నగదు ఇవ్వాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారని, ఈమేరకు బాధితులకు చెక్కులను అందజేసినట్లు చెప్పారు.