Telangana TET: 2028 ఆగస్టు వరకు టెట్ పాస్ అవ్వకపోతే.. వారందరి ఉద్యోగాలు ఊడినట్లే!

Telangana TET Exam : తెలంగాణ ఉపాధ్యాయ అర్హత పరీక్ష (TET) ఫలితాలు సోవారం విడుదలైన విషయం తెలిసిందే. అయితే, ప్రస్తుతం వెలువడిన టెట్ ఫలితాల్లో 14వేల మందికిపైగా ఉపాధ్యాయులు ఫెయిల్ కావడం చర్చనీయాంశంగా మారింది.

Government Teachers Will Lose Jobs If They Do Not Pass TET By August 2028

Telangana TET : తెలంగాణ ఉపాధ్యాయ అర్హత పరీక్ష (TET) ఫలితాలు సోమవారం విడుదలైన విషయం తెలిసిందే. రాష్ట్ర వ్యాప్తంగా 43.94శాతం మంది మాత్రమే అర్హత సాధించారు. మొత్తం 1,15,028మంది పరీక్షకు హాజరుకాగా.. కేవలం 50,544 మంది మాత్రమే క్వాలిఫై అయ్యారు. ముఖ్యంగా ప్రభుత్వ ఉపాధ్యాయులు అయితే సగం కంటే తక్కువ మంది పాస్ కావడం గమనార్హం. ఏకంగా 14వేల మంది వరకు ప్రభుత్వ ఉపాధ్యాయులు టెట్‌లో ఫెయిల్ అయ్యారు.

Also Read : రేవంత్ సీఎం అయ్యాడని.. ఆ మ్యూజిక్ డైరెక్టర్ మీద కోపంగా ఉందన్న కవిత..

సెకండరీ గ్రేడ్ టీచర్ (SGT) పోస్టుల కోసం నిర్వహించిన పేపర్-1 పరీక్షలో 65.29శాతం మంది ఉత్తీర్ణత సాధించారు. ఇందులో 36,129 మంది పరీక్ష రాయగా.. 23,590 మంది అర్హత సాధించారు. మరోవైపు.. స్కూల్ అసిస్టెంట్ పోస్టులకు నిర్వహించిన పేపర్-2లో మొత్తం 78,899 మంది పరీక్ష రాస్తే కేవలం 26,954 మంది మాత్రమే అర్హత సాధించారు.

మరోవైపు ప్రస్తుతం విధుల్లో ఉంటూ ఈ పరీక్ష రాసిన ఇన్-సర్వీస్ ప్రభుత్వ ఉపాధ్యాయుల్లో 23,623 మందికి గాను కేవలం 8,809 మంది మాత్రమే క్వాలిఫై అయ్యారు. అంటే 37.29శాతం మాత్రమే క్వాలిఫై అయ్యారు. గతేడాది ప్రభుత్వ టీచర్ల పాస్ పర్సంటేజ్ 50 శాతంగా ఉండగా.. ఈసారి అది 37.29 శాతానికి పడిపోయింది. ఇన్-సర్వీస్ టీచర్లలో పేపర్-1లో 52.57 శాతం, పేపర్-2 మ్యాథ్స్ అండ్ సైన్స్‌లో 38.27 శాతం, సోషల్‌లో అత్యంత దారుణంగా 24.05 శాతం మంది మాత్రమే ఉత్తీర్ణత సాధించారు.

సుప్రీంకోర్టు ఉత్తర్వుల ప్రకారం.. విధుల్లో ఉన్న ప్రభుత్వ ఉపాధ్యాయులు 2028 ఆగస్టు నాటికి తప్పనిసరిగా టెట్ పరీక్ష పాస్ కావాల్సి ఉంటుంది. లేదంటే ప్రభుత్వ ఉద్యోగాలను కోల్పోయే ప్రమాదం ఉంది. ప్రస్తుతం వెలువడిన టెట్ ఫలితాల్లో 14వేల మందికిపైగా ఉపాధ్యాయులు ఫెయిల్ కావడం చర్చనీయాంశంగా మారింది. దీంతో వారి ఉద్యోగ భద్రతపై తీవ్రమైన ఆందోళన నెలకొంది.