ఆస్తి కోసం నాయనమ్మను చంపిన 15ఏళ్ల మనవడు
- Naveen
- Published On : July 15, 2020 / 08:29 AM IST
మనషుల్లో మానవత్వం మంటగలుస్తోంది. తాను సృష్టించిన కాగితపు డబ్బు కోసం మనిషి దిగజారిపోతున్నాడు. కాసుల కక్కుర్తితో అయినవారిని కూడా వదలడం లేదు. ఆస్తి కోసం ప్రాణాలు తీస్తున్నారు. ఆఖరికి పిల్లలు కూడా ఆస్తి కోసం దారుణాలకు తెగబెడుతుండటం ఆందోళనకు గురి చేస్తోంది. ఆస్తి కోసం సొంత నాయనమ్మను తగులబెట్టాడు ఓ కసాయి మనవడు. రంగారెడ్డి జిల్లాలో జరిగిన ఈ ఘటన సంచలనం రేపింది. ఈ దురాఘతానికి పాల్పడింది ఓ మైనర్ కావడం విస్మయానికి గురి చేస్తోంది.
కూతుళ్లకు ఆస్తి ఇచ్చిందని నాయనమ్మపై కక్ష పెంచుకున్న మనవడు:
రంగారెడ్డి జిల్లా శంకర్‌పల్లి మండలం ఎలవర్తిలో దారుణం జరిగింది. ఆస్తి కోసం సొంత నాయనమ్మను మనవడు శివకుమార్ చంపేశాడు. ఎలవర్తికి చెందిన కంసమ్మకు ముగ్గురు కూతుళ్లు ఒక కొడుకు ఉన్నారు. ఆమె తనకున్న ఎకరం భూమిని కొడుకుతో పాటు ముగ్గురు బిడ్డలకు సమాన భాగాలు చేసి పంచి ఇచ్చింది. దీంతో తల్లీ, కొడుకుల మధ్య తరుచు గొడవలు జరుగుతున్నాయి. కొద్దిరోజులుగా జరుగుతున్న విషయాన్ని పదో తరగతి చదువుతున్న మనవడు శివకుమార్ గమనిస్తున్నాడు. నాయనమ్మ తన కూతుళ్లకు భూమి ఇవ్వడం అతడికి నచ్చలేదు. నానమ్మపై శివకుమార్ కక్ష పెంచుకున్నాడు.
నాయనమ్మపై పెట్రోల్ పోసి నిప్పు:
ఇదే క్రమంలో మంగళవారం(జూలై 14,2020) మధ్యహ్నం నాయనమ్మతో గొడవకు దిగిన శివకుమార్ ఒక్కసారిగా దాడి చేసి పెట్రోల్ పోసి నిప్పంటించి పారిపోయాడు. తీవ్రంగా గాయపడ్డ కంసమ్మ అక్కడిక్కడే మృతిచెందింది. ఇల్లు కూడా కాలి బూడిదైంది. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం చేవెళ్ళ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. పరారీలో ఉన్న మనవడు శివకుమార్ కోసం గాలిస్తున్నట్లు తెలిపారు. 15ఏళ్ల కుర్రాడు ఇంతటి దురాఘతానికి ఒడిగట్టడం అందరిని విస్మయానికి గురి చేసింది. చక్కగా స్నేహితులతో ఆడుకుంటూ, చదువుకోవాల్సిన వయసులో శివకుమార్ చేసిన పని చర్చనీయాంశంగా మారింది. పిల్లల్లో విపరీత ధోరణి తల్లిదండ్రులను భయాందోళనకు గురి చేసింది.
