Wine Tourism: తెలంగాణలో ‘వైన్ టూరిజం’.. రంగారెడ్డి, వికారాబాద్‌లలో ‘వైన్ రిసార్ట్స్’.. మంత్రి జూపల్లి మాస్టర్ ప్లాన్
రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల పరిధిలో 'వైన్ టూరిజం(Wine Tourism)' అభివృద్ధి చేయడానికి విస్తృత అవకాశాలు ఉన్నాయని మంత్రి జూపల్లి కృష్ణారావు వెల్లడించారు.
Wine tourism potential in telangana jupalli master plan getting ready
- వైన్ టూరిజం ప్రాజెక్ట్
- రైతులకు కొత్త ఆశలు
- భారీ విదేశీ అధ్యయనం
Wine Tourism: తెలంగాణ పర్యాటక రంగాన్ని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లేందుకు రాష్ట్ర ప్రభుత్వం సరికొత్త వ్యూహాలు రచిస్తోంది. హైదరాబాద్ సమీపంలోని రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల పరిధిలో ‘వైన్ టూరిజం(Wine Tourism)’ అభివృద్ధి చేయడానికి విస్తృత అవకాశాలు ఉన్నాయని రాష్ట్ర పర్యాటక, ఆబ్కారీ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు వెల్లడించారు. అమెరికా పర్యటనలో భాగంగా ఆయన వర్జీనియాలోని ప్రసిద్ధ ‘స్టోన్ టవర్ వైనరీ’తో పాటు అష్బర్న్లోని మరో వైనరీని సందర్శించి ప్రత్యేక అధ్యయనం చేశారు. ఈ సందర్భంగా ద్రాక్ష తోటల పెంపకం, ఫెర్మెంటేషన్ ప్రక్రియ, ప్రాసెసింగ్, నిల్వ పద్ధతులు, బాట్లింగ్, గ్లోబల్ మార్కెటింగ్ విధానాలపై అక్కడి నిపుణులతో సమగ్రంగా చర్చించారు.
ఈ పర్యటన ఆధారంగా మంత్రి జూపల్లి మాట్లాడుతూ.. వైన్ టూరిజం ద్వారా పర్యాటకులకు అంతర్జాతీయ స్థాయి అనుభూతిని అందించడమే కాకుండా, స్థానిక ద్రాక్ష రైతులకు మేలైన మద్దతు లభిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. వినూత్నమైన పర్యాటక నమూనాల వల్ల గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతమై, యువతకు పెద్దపీట వేసేలా విస్తృత ఉపాధి అవకాశాలు లభిస్తాయని స్పష్టం చేశారు. ప్రభుత్వ విప్ యెన్నం శ్రీనివాస్ రెడ్డి, ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి కూడా ఈ క్షేత్రస్థాయి అధ్యయన పర్యటనలో మంత్రి వెంట ఉన్నారు.
ఇటీవల ముగిసిన తెలంగాణ టూరిజం కాన్క్లేవ్లో రూ. 15 వేల కోట్లకు పైగా పెట్టుబడుల ప్రతిపాదనలు వచ్చాయని, అందులో ‘వైనరీ వాక్‌త్రూ’తో కూడిన ‘వైన్యర్డ్ రిసార్ట్’ ప్రాజెక్టు ప్రతిపాదన ప్రత్యేక ఆకర్షణగా నిలిచిందని మంత్రి పేర్కొన్నారు. హైదరాబాద్ వాతావరణం, శివారు జిల్లాల్లోని అనుకూల భూములు ద్రాక్ష సాగుకు ఎంతో అనువుగా ఉన్నందున, త్వరలోనే సమగ్ర ప్రణాళికతో ముందడుగు వేస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
