Hyderabad : హైదరాబాద్ వాసులకు గుడ్‌న్యూస్.. ఇక నైట్ జర్నీ.. ఈ ఆరు మార్గాల్లో రాత్రంతా బస్సులు.. ఎప్పటి నుంచంటే?
Hyderabad : హైదరాబాద్ నగరంలో రాత్రంతా బస్సులు నడిపేందుకు గ్రేటర్ ఆర్టీసీ సిద్ధమైంది. తొలి విడతలో ఆరు రూట్లలో ఈ బస్సులు ప్రయాణించనున్నాయి.
- Harish Thanniru
- Published on- August 25, 2026 / 10:40 AM IST
Greater RTC
Hyderabad : హైదరాబాద్ నగరంలో నైట్ లైఫ్ కల్చర్ క్రమంగా పెరుగుతోంది. రాత్రి వేళల్లో ఉద్యోగాలు చేసేవారే కాకుండా.. రాత్రి 12గంటల తరువాత ప్రయాణాలు చేసేవారి సంఖ్య నగరంలో క్రమంగా పెరుగుతుంది. అయితే, అర్ధరాత్రి తరువాత నగరంలో ఆర్టీసీ బస్సులు, మెట్రో అందుబాటులో లేకపోవటంతో ప్రయాణికులు ఎక్కువగా క్యాబ్ లు, ఆటోలను ఆశ్రయిస్తున్నారు. తద్వారా అధిక ధరలతో ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. ఈ క్రమంలో రాత్రి తెల్లవార్లు బస్సులను నడిపేందుకు గ్రేటర్ ఆర్టీసీ సిద్ధమైంది.
నగరం నలుమూలల నుంచి హైటెక్ సిటీ, సైబరాబాద్, తదితర ప్రాంతాలకు రాకపోకలు సాగించే ఐటీ నిపుణులు, ఉద్యోగులే కాకుండా సందర్శకుల కోసం 24గంటలపాటు సిటీ బస్ సర్వీసులు అందుబాటులోకి తెచ్చేందుకు గ్రేటర్ ఆర్టీసీ చర్యలు చేపట్టింది. ఈనెల 29వ తేదీ నుంచి వీటిని ప్రవేశపెట్టనున్నట్లు అధికారులు తెలిపారు. మొదటి దశలో ఆరు రూట్లలో రాత్రి 10గంటల నుంచి తెల్లవారు జామున 5గంటల వరకు ఆర్టీసీ బస్సులు తిరగనున్నాయి. ప్రయాణికుల రద్దీ మేరకు అర్ధగంటకు ఒక బస్సును నడిపేలా అధికారులు ప్రణాళికలు సిద్ధం చేశారు.
తొలుత ఈ రూట్లలో..
♦ సికింద్రాబాద్ నుంచి హైటెక్‌సిటీ మీదుగా కొండాపూర్ వరకు 10హెచ్ బస్సులు రాత్రివేళల్లోనూ ప్రయాణించనున్నాయి. రాత్రి 10గంటల నుంచి తెల్లవారు జామున 5గంటల వరకు మొత్తం ఎనిమిది నుంచి పది బస్సు సర్వీసులు నడిపేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
♦ బాచుపల్లి నుంచి వేవ్‌రాక్ రూట్‌లో ప్రతి గంటకు ఒకసారి 195డబ్ల్యూ బస్సు సర్వీసులు రాత్రి 10గంటల నుంచి తెల్లవారు జాము వరకు అందుబాటులో ఉంటాయి.
♦ సికింద్రాబాద్ నుంచి హయత్ నగర్ రూట్లో 290యూ బస్సులు అందుబాటులో ఉంటాయి. అయితే, రాత్రి వేళల్లో ఈ బస్సు సర్వీసులు రైల్వే స్టేషన్ ఎదురుగా ఉన్న ఆల్ఫా హోటల్ నుంచి బయలుదేరుతాయి. దీంతో రాత్రి వేళల్లో ఆలస్యంగా ట్రైన్ దిగి ఇండ్లకు వెళ్లేవారికి ఉపయోగకరంగా ఉండనుంది. సికింద్రాబాద్ నుంచి పటాన్ చెరు రూట్ లోనూ రాత్రివేళల్లో బస్సులు అందుబాటులో ఉండనున్నాయి.
♦ కోఠి నుంచి పటాన్‌చెరు రూట్ లోనూ రాత్రివేళల్లో ప్రతి గంటకు ఒక బస్సును నడపనున్నారు. అదేవిధంగా కోఠి నుంచి హైటెక్ సిటీ మీదుగా పటాన్‌చెరు రూట్ లోనూ ప్రతి అరగంటకు ఒక బస్సు రాత్రి 10గంటల తరువాత నుంచి తెల్లవారు జాము వరకు అందుబాటులో ఉండనున్నాయి.
ఎంపిక చేసిన ఆరు రూట్లతోపాటు భవిష్యత్తులో మిగిన మార్గాల్లోనూ బస్సు సర్వీసులు నడిపేందుకు ఆర్టీసీ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. చారిత్రక కట్టడాలు, పర్యాటక, సందర్శన స్థలాలను దృష్టిలో ఉంచుకొని భవిష్యత్తులో సర్వీసులను పెంచే అవకాశం ఉంటుందని అధికారులు పేర్కొన్నారు.
