Harish Rao : మాజీ మంత్రి హరీశ్ రావు పరిగి పర్యటనలో హైడ్రామా.. అరెస్టు చేసిన పోలీసులు
Harish Rao : మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే తన్నీరు హరీశ్ రావును పరిగి పర్యటనకు వెళ్తుండగా పోలీసులు అరెస్టు చేశారు.
- Harishth Thanniru
- Published On : April 7, 2026 / 12:51 PM IST
Harish Rao
- మాజీ మంత్రి హరీశ్ రావు అరెస్టు
- పరిగి పర్యటనకు వెళ్తుండగా అరెస్టు చేసిన పోలీసులు
- అప్పా జంక్షన్ వద్ద ఉధ్రిక్తత
Harish Rao : మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే తన్నీరు హరీశ్ రావును పోలీసులు అరెస్టు చేశారు. ఇండస్ట్రియల్ పార్క్ బాధిత రైతులను కలిసేందుకు వికారాబాద్ జిల్లాలోని పరిగి పర్యటనకు వెళ్తున్న హరీశ్ రావు అప్పా జంక్షన్ వద్ద పోలీసులు అరెస్టు చేశారు. హరీశ్ రావుతోపాటు మాజీ మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, ఎర్రబెల్లి దయాకర్ రావు, మాజీ ఎమ్మెల్యే వెంకటేశ్వర్ రెడ్డిని కూడా పోలీసులు అరెస్టు చేశారు. అరెస్టు చేసిన వారిని ఎక్కడికి తీసుకెళ్తున్నారో పోలీసులు గోప్యంగా ఉంచారు. ఓఆర్ఆర్ మీదుగా శంషాబాద్ వైపు పోలీసు వాహనాల్లో బీఆర్ఎస్ నేతలను తరలించారు. కొద్దిసేపటి తరువాత మాజీ మంత్రులు హరీష్ రావు, సబితా ఇంద్రారెడ్డి, దయాకర్ రావును శంషాబాద్ పోలీస్ స్టేషన్‌కు పోలీసులు తరలించారు.
Also Read : Telangana Govt : తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం.. మహిళా సంఘాలకు శుభవార్త..
పోలీసుల తీరుపై బీఆర్ఎస్ నేతలు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. హరీశ్ రావు, బీఆర్ఎస్ నేతల అరెస్టులకు నిరసనగా రోడ్డుపై ఆందోళనకు దిగారు. వారిని అదుపులోకి తీసుకునే క్రమంలో పోలీసులకు, బీఆర్ఎస్ నేతలకు మధ్య తీవ్ర వాగ్వివాదం చోటు చేసుకుంది. దీంతో అప్పా జంక్షన్ వద్ద ఉధ్రిక్తత పరిస్థితి నెలకొంది. పోలీస్ గో బ్యాక్ అంటూ బీఆర్ఎస్ శ్రేణులు పెద్దెత్తు నినాదాలు చేశారు.
అంతకుముందు ఉదయం మాజీ మంత్రి హరీశ్ రావును పోలీసులు హౌస్ అరెస్టు చేశారు. హైదరాబాద్ లోని మంత్రి నివాసంలో ఆయన్ను పరిగి వెళ్లకుండా హౌస్ అరెస్టు చేశారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోని బీఆర్ఎస్ ముఖ్యనేతలను ఉదయం పోలీసులు వారి ఇళ్ల వద్ద గృహనిర్భందం చేశారు.
పరిగి మండలంలోని కాళ్లాపూర్, రాపోల్ గ్రామాల పరిధిలో ఇండస్ట్రియల్ పార్కు ఏర్పాటు కోసం ప్రభుత్వం 1,197 ఎకరాలను సేకరించాలని నిర్ణయించింది. ఈ నేపథ్యంలో భూసేకరణ చేపట్టింది. తమ భూములను ఇచ్చేది లేదని రైతులు రిలే దీక్షలు చేపట్టారు. రైతుల ఆందోళనకు బీఆర్ఎస్ మద్దతు ఇచ్చింది. ఈ క్రమంలో ఆయా గ్రామాల్లోని రైతులను పరామర్శించి సంఘీభావం తెలిపేందుకు హరీశ్ రావు, బీఆర్ఎస్ ముఖ్యనేతలు పరిగి పర్యటనకు సిద్ధమయ్యారు. దీంతో పోలీసులు వారిని అరెస్టు చేశారు.
