Harish Rao: దేవన్నపేట పంప్ హౌస్‌లో ఒక్క పంప్ కూడా పనిచేయడం లేదని తాము ముందే చెప్పామని తెలంగాణ మంత్రి హరీశ్ రావు అన్నారు. ఇవాళ వరంగల్‌లో ఆయన మాట్లాడుతూ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు.
దేవాదుల ప్రాజెక్టు విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని తట్టి లేపితేనే ముఖ్యమంత్రి స్పందించారని, మాటల్లో చలనం కనిపించినా చేతల్లో లేదని హరీశ్ రావు విమర్శించారు. తాము రూ.3,20,000 ఎకరాలకు నీరు అందించామని, కానీ తేదీలు, గడువులు మార్చిన ప్రస్తుత ప్రభుత్వం ఇప్పటివరకు ఒక్క ఎకరాకు కూడా నీరు ఇవ్వలేదని హరీశ్ రావు ఆరోపించారు.
ఉత్తమ్ కుమార్ రెడ్డి ఒక గడువు, మరో మంత్రి మరో గడువు, ముఖ్యమంత్రి మరో గడువు ప్రకటిస్తున్నారని అన్నారు. ఉన్న మోటార్లనే నడపలేని పరిస్థితి ఉందని విమర్శించారు. గోదావరి నదిపై రెండున్నరేళ్లలో ఏ ప్రాజెక్టు కట్టారో చెప్పాలని సవాల్ విసిరారు. అసెంబ్లీలో ఎన్ని గంటలైనా చర్చకు సిద్ధమని, మైక్ కట్ చేయొద్దు, కెమెరా తిప్పొద్దని అన్నారు. పదిశాతం పనులు కూడా పూర్తి చేయలేకపోతున్నారని, నిజాయితీ ఉంటే గడువు మార్చకుండా పనులు పూర్తిచేయాలని డిమాండ్ చేశారు.
Also Read: దేవ్‌జీ సహా లొంగిపోయిన మావోయిస్టు అగ్రనేతలు.. వివరాలు తెలిపిన డీజీపీ
హెల్త్ సిటీ పనులు పూర్తిగా నిలిచిపోయాయని హరీశ్ రావు అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రియల్ ఎస్టేట్ ఏజెంట్లు, కాంట్రాక్టర్ల కోసం ఫ్యూచర్ సిటీపై దృష్టి పెట్టారని ఆరోపించారు. నేరపూరిత ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల హెల్త్ సిటీ ఆలస్యమవుతోందని అన్నారు. ఆస్పత్రి నిర్మాణం జరిగితే కే చంద్రశేఖర్ రావుకు పేరు వస్తుందనే ఉద్దేశంతో పనులు నిర్లక్ష్యం చేస్తున్నారని విమర్శించారు.
జూన్ 2న ప్రారంభిస్తామని గడువు పెట్టారని, నియామకాల కోసం కేబినెట్ అనుమతి ఇచ్చిందా అని ప్రశ్నించారు. ఇది సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రా లేక బస్తీ దవాఖానా అని నిలదీశారు. కొత్త ప్రభుత్వం అని రెండేళ్లు ఓపిక పట్టామని, ఇక వదిలేది లేదని హెచ్చరించారు.
వరంగల్ జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేలకు బాధ్యత లేదని ఆరోపించారు. ముఖ్యమంత్రి రెండేళ్లలో ఒక్కసారి కూడా ఎంజీఎం ఆస్పత్రి వరంగల్‌ను సందర్శించలేదని అన్నారు. ఆరోగ్యశాఖ మంత్రి కూడా సందర్శించలేదని విమర్శించారు.