విద్యుత్ ఉద్యోగులపై అభాండాలు మోపుతున్నారు.. కరెంటు కోతలను సరిదిద్దాలనే చిత్తశుద్ధి లేదా?: హరీశ్ రావు

Harish Rao: కేసీఆర్ హయాంలో రెప్ప పాటు కూడా పోని విధంగా 24 గంటల విద్యుత్ ను ఇచ్చినట్టుగా అన్ని రంగాలకు సరఫరా చేస్తే మంచిదని హరీశ్ రావు అన్నారు.

తెలంగాణ విద్యుత్ ఉద్యోగులపై సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు సరికాదంటూ ఎక్స్‌లో మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్ రావు ట్వీట్ చేశారు. ‘‘కరెంట్ కోతల విషయంలో సీఎం రేవంత్ రెడ్డి తన ప్రభుత్వ వైఫల్యాలను అంగీకరించకుండా ప్రతి పక్షాలు, విద్యుత్ ఉద్యోగుల మీద అభాండాలు మోపడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. విద్యుత్ రంగ వైఫల్యాలకు నేనే భాద్యుడిని అన్నట్టుగా మాట్లాడటం విడ్డూరంగా ఉంది’’ అని అన్నారు.

‘‘ఆయన వైఖరి ఆడ రాక పాత గజ్జెలు అనే సామెతను గుర్తు చేస్తున్నది. బీఆర్ఎస్ ప్రభుత్వం, 24 గంటల పాటు నిరంతరంగా విద్యుత్ సరఫరా చేసేందుకు.. విద్యుత్ ఉద్యోగుల సహకారంతో పటిష్ఠమైన వ్యవస్థను నిర్మించింది. రెప్పపాటు కాలం కూడా కరెంట్ కోతలు లేని ఏకైక రాష్ట్రంగా తెలంగాణను నిలిపింది.

కేవలం 5 నెలల్లోనే కాంగ్రెస్ ప్రభుత్వం ఆ వ్యవస్థను కుప్ప కూల్చింది. గృహ, వ్యవసాయ, పారిశ్రామిక అవసరాలకు సరిపోయే విద్యుత్ సరఫరా చేయడంలో పూర్తిగా విఫలమైంది’’ అని హరీశ్ రావు అన్నారు.

‘‘తమ చేతగాని తనాన్ని కప్పిపుచ్చుకునేందుకు, ప్రతిపక్షాలు, విద్యుత్ ఉద్యోగులపై రేవంత్ రెడ్డి నిరాధార ఆరోపణ చేస్తున్నారు.  తెలంగాణ ఉద్యమంలో, తెలంగాణ పునర్ నిర్మాణంలో కీలక పాత్ర పోషించిన విద్యుత్ ఉద్యోగులను చీటికి మాటికి నిందించడం, చర్యలు తీసుకోవడం వారి ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయడమే.

విద్యుత్ ఉద్యోగుల పై నెపం నెట్టడమే తప్ప కరెంటు కోతలను ఎలా సరిదిద్దాలనే చిత్తశుద్ధి ముఖ్యమంత్రికి లేకపోవడం దురదృష్టకరం. సీఎం ఇలాంటి చిల్లర మల్లర చేష్టలు మాని కేసీఆర్ హయాంలో రెప్ప పాటు కూడా పోని విధంగా 24 గంటల విద్యుత్ ను ఇచ్చినట్టుగా అన్ని రంగాలకు సరఫరా చేస్తే మంచిది. తన లాగే అందరూ కుట్రలు కుతంత్రాలకు పాల్పడుతారని సీఎం భ్రమల్లో ఉన్నట్టున్నారు. వాటిని వీడి పాలన పై దృష్టి పెడితే మంచిది’’ అని హరీశ్ రావు చెప్పారు.

Also Read: పాక్ అక్రమిత కశ్మీర్‌ను స్వాధీనం చేసుకుంటాం: అమిత్ షా కీలక వ్యాఖ్యలు

ట్రెండింగ్ వార్తలు