Harish Rao
మాజీ సీఎం కేసీఆర్ 2019లో అప్పటి ఏపీ మంత్రి రోజా ఇంటికి వెళ్లి రొయ్యల పులుసు తిన్నారని, తెలంగాణకు అన్యాయం చేశారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విమర్శిస్తున్న విషయం తెలిసిందే. అప్పట్లో రాయలసీమను రతనాల సీమను చేస్తానని కేసీఆర్ మాటిచ్చారని, జగన్‌కు అన్ని విధాలా సహకరిస్తామన్నారని రేవంత్ రెడ్డి అంటున్నారు.
అనంతరం జగన్‌తో రెండు సార్లు సమావేశమై చర్చలు జరిపారని, తెలంగాణలో కరవు ప్రాంతాలను పట్టించుకోని కేసీఆర్ రాయలసీమకు నీళ్లిస్తానని అన్నారని రేవంత్ ఆరోపణలు గుప్పిస్తున్నారు.
Also Read: ఆంధ్రప్రదేశ్ దృష్టిలో ఇది వివాదం.. తెలంగాణ దృష్టిలో మాత్రం..: హరీశ్ రావు
దీనిపై హరీశ్ రావు స్పందించారు. 10టీవీ ప్రత్యేక ఇంటర్వ్యూలో హరీశ్ రావు మాట్లాడుతూ… “తెలంగాణ ఒక కరవు ప్రాంతం. నీటి విషయంలో ఎన్నో ఇబ్బందులు పడ్డ ప్రాంతం. రాయలసీమలో కరవు ఉంటే నీళ్లు తీసుకెళ్లడానికి ఓ పద్ధతి ఉంది. తెలంగాణ ప్రయోజనాలను కాపాడుతూ రాయలసీమకు నీళ్లు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది.
అప్పట్లో ఈ విషయంలో జగన్ కలిసి వస్తారన్న ఉద్దేశంతో కేసీఆర్ ఈ ప్రతిపాదన పెట్టారు. ఆ రోజు జగన్ ను తెలంగాణకు పిలిచి ఏపీ ప్రభుత్వం ముందు ప్రతిపాదన పెట్టారు. మనం ప్రకాశం బ్యారేజీ నుంచి నదీ మార్గంగా నాగార్జున సాగర్‌కు నీళ్లు తెచ్చుకుందాం.. ఒక్క లిఫ్టులో నాగార్జున సాగర్‌కు నీళ్లు తేవచ్చు.. మరో లిఫ్టుతో శ్రీశైలానికి నీళ్లు తీసుకెళ్లవచ్చు.. సాగర్, శ్రీశైలానికి నీళ్లు తెచ్చుకుంటే ఇటు తెలంగాణకు, అటు రాయలసీమకు ఉపయోగపడుతుందని అన్నారు. కృష్ణానదిలో నీళ్లు లేకనే గొడవలు అవుతున్నాయి” అని తెలిపారు.