Godavari Floods : తెలుగు రాష్ట్రాల్లో గోదావరి ఉగ్రరూపం.. భద్రాచలం వద్ద మూడో ప్రమాద హెచ్చరిక.. ధవళేశ్వరం వద్ద టెన్షన్ టెన్షన్

Godavari Floods : గోదావరి ఉగ్రరూపం దాల్చింది. ఎగువ నుంచి వస్తున్న వరద ఉధృతితో గోదావరిలో వరద ఉధృతి క్రమంగా పెరుగుతోంది.

Heavy Flood In Godavari River

Godavari Floods : గోదావరి ఉగ్రరూపం దాల్చింది. ఎగువ నుంచి వస్తున్న వరద ఉధృతితో గోదావరిలో నీటిమట్టం క్రమంగా పెరుగుతోంది. ముఖ్యంగా భద్రాచలం వద్ద శనివారం ఉదయానికి గోదావరి నీటిమట్టం 55.1 అడుగులకు చేరింది. దీంతో మూడో ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది.

Also Read : Girl Apology To PM Modi : ‘నాకు 15 ఏళ్లే.. నన్ను క్షమించండి’.. ప్రధాని మోదీకి క్షమాపణలు చెప్పిన బాలిక.. వీడియో వైరల్

గోదావరిలో వరద ఉధృతి క్రమంగా పెరుగుతున్న నేపథ్యంలో అధికారులు అప్రమత్తమయ్యారు. భద్రాద్రి కొత్తగూడెం కలెక్టర్ అంకిత్, ఎస్పీ రోహిత్ రాజ్ క్షేత్ర స్థాయిలో పర్యటించి.. లోతట్టు ప్రాంత వాసులను పునరావాస కేంద్రాలకు తరలించాలని అధికారులను ఆదేశించారు. వరద నీటిమట్టం పెరగడంతో దమ్మాయిగూడెం – భద్రాచలం మధ్య శుక్రవారం సాయంత్రం నుంచి రాకపోకలు నిలిపివేశారు. గోదావరిలో వరద ఉధృతి కారణంగా.. దుమ్ముగూడెం మండలంలోని పర్ణశాల వద్ద స్నానఘట్టాలు, సీతవాగు వద్ద సీతమ్మ నారచీరలు, స్వామివారి సింహాసనం, ఐరన్‌ ఫుట్‌ బ్రిడ్జి నీటమునిగాయి. కూనవరం వద్ద గోదావరి నీటిమట్టం 19.20 మీటర్లకు చేరగా.. పోలవరం వద్ద 11.96 మీటర్ల మేర ప్రవహిస్తోంది.

తూర్పుగోదావరి జిల్లాలోని ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ వద్ద గోదావరి నది ఉధృతంగా ప్రవహిస్తోంది. శనివారం ఉదయం 8గంటలకు 11.40 అడుగులకు చేరుకుంది. ధవళేశ్వరం వద్ద 175 గేట్లు ఎత్తి 8.93లక్షల క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి వదులుతున్నట్లు అధికారులు తెలిపారు. పలు కాజ్‌వేలు, రహదారులు నీటమునగగా లంక గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. లంక గ్రామాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. అంబేడ్కర్ కోనసీమ, పోలవరం జిల్లాల్లో కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేసి సహాయక చర్యలను ముమ్మరం చేశారు. లోతట్టు ప్రాంతాల ప్రజల రాకపోకల కోసం నాటు పడవలను అందుబాటులో ఉంచారు.

ధవళేశ్వరం బ్యారేజీ వద్ద 10లక్షల క్యూసెక్కులకు చేరగానే మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేసే అవకాశం ఉంది. రాత్రిలోపు రెండో ప్రమాద (13లక్షల క్యూసెక్కులు) హెచ్చరిక జారీచేసే అవకాశం ఉంది. 15లక్షల క్యూసెక్కులు వరకు వరద ప్రవాహం చేరే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. గోదావరి నదీ పరివాహక ప్రాంతాల ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేయగా.. సహాయ చర్యల్లో అధికారులు నిమగ్నమయ్యారు.