మరో రెండు రోజులు భారీ వర్షాలు!

  • Publish Date - October 16, 2020 / 06:03 AM IST

heavy rains another two days : తెలంగాణ రాష్ట్రంలో మరో రెండు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఇప్పటికే భారీ వర్షాలతో రాష్ట్రంలోని పలు ప్రాంతాలు అతలాకుతలమైన సంగతి తెలిసిందే. ప్రధానంగా హైదరాబాద్ నగరంలో వరద నీరు పోటెత్తింది. కాలనీలు ఇంకా జలదిగ్భందంలోనే ఉన్నాయి.



ఇదిలా ఉంటే..రాష్ట్రంపై ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని, దీనికి తోడు కర్నాటక, మహారాష్ట్ర సరిహద్దుల్లో వాయుగుండం ప్రభావం ఉందని అధికారులు తెలిపారు. దీంతో సరిహద్దు జిల్లాలతో పాటు..మిగిలిన చోట్ల..తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురవచ్చని వెల్లడించారు. అధికారులను రాష్ట్ర ప్రభుత్వం అలర్ట్ చేసింది. అప్రమత్తంగా ఉండాలని సూచించింది.



ఈ నెల 17వ తేదీ నుంచి మరో రెండు రోజులు రాష్ట్ర వ్యాప్తంగా పలుచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురవొచ్చని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.



మరోవైపు…భారీ వర్షాలు, వరదలు హైదరాబాద్‌లో బీభత్సం సృష్టించాయి. ముఖ్యంగా చాదర్‌ఘాట్‌, ముసానగర్‌, శంకర్‌ నగర్‌, రసూల్‌పురా, భూలక్ష్మీ మాత వెనుక బస్తీ ప్రాంతాల్లో వేలాది కుటుంబాలు నిరాశ్రయులయ్యాయి. మూసీ పరివాహక కాలనీలు నామరూపాల్లేకుండా పోయాయి. వర్షాల ధాటికి ఇళ్లు కూలిపోయి, బురదమయంగా మారిపోయాయి. ఇంట్లోని వస్తువులు చెల్లాచెదురయ్యాయి.



వర్షాలు తగ్గుముఖం పట్టడంతో ప్రాణభయంతో సురక్షిత ప్రాంతాలకు వెళ్లిన స్థానికులు ఇప్పుడిప్పుడే ఇళ్లకు చేరుకుంటున్నారు. బురదమయంగా మారిన ఇళ్లను చూసి లబోదిబోమంటున్నారు. హైదరాబాద్‌ నగరంలో భారీవర్షాలు విద్యుత్‌ సరఫరాకు తీవ్ర అంతరాయం కలిగించాయి. పలు చోట్ల విద్యుత్‌ స్తంభాలు, ట్రాన్స్‌ఫార్మర్లు నేలకూలాయి. దీంతో పలు కాలనీలు అంథకారంలో మునిగిపోయాయి. విద్యుత్‌ను పునరుద్ధరించడానికి మరికొంత సమయం పట్టే అవకాశం ఉందని అధికారులు అంటున్నారు.

ట్రెండింగ్ వార్తలు