Heavy Rains in Telangana
Heavy Rains in Telangana : తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు దంచికొడుతున్నాయి. అయితే, మరో వారం రోజులు పలు జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. కొన్ని ప్రాంతాల్లో 10 నుంచి 20 సెంటీమీటర్ల మధ్య వర్షపాతం నమోదయ్యే అవకాశాలు ఉన్నట్లు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, వర్షం పడే సమయంలో బయటకు రావొద్దని, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరికలు జారీ చేసింది.
Also Read : Kavitha: కవిత కొత్త రాజకీయ పార్టీ..! టైమ్, డేట్ ఫిక్స్? పేరు ఇదేనా?
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ఇవాళ వాయుగుండంగా మారే అవకాశం ఉందని, ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని 15 జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది. ఇవాళ కొన్ని ప్రాంతాల్లో 10 నుంచి 20 సెంటీమీటర్ల మధ్య వర్షపాతం నమోదయ్యే అవకాశాలు ఉన్నాయని తెలిపింది.
నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, సిరిసిల్ల, భూపాలపల్లి, ములుగు, మహబూబాబాద్, వరంగల్, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తిలకు వాతావరణ శాఖ ఆరెంజ్ హెచ్చరికలు జారీ చేసింది. ఈ జిల్లాల్లోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, కుండపోత వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో ప్రజలు వర్షాల సమయంలో బయటకు రావొద్దని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అవసరం అయితే తప్ప బయటకు వెళ్లవద్దని వాతావరణ శాఖ అధికారులు సూచించారు.
ముఖ్యమంత్రి కీలక ఆదేశాలు..
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారనున్న నేపథ్యంలో వచ్చే రెండుమూడు రోజులు తెలంగాణ వ్యాప్తంగా భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. దీంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను అప్రమత్తం చేశారు. అన్ని జిల్లాల కలెక్టర్లు పరిస్థితిని సమీక్షించాలని, అన్ని చెరువు కట్టలను పరిశీలించాలని ఆదేశించారు. వరద నీరు నిలిచే రోడ్లను గుర్తించి ముందస్తుగా వాహనాలను నిలిపివేయాలని, అదే సమయంలో భారీ వర్షాల నేపథ్యంలో విద్యుత్ శాఖ ప్రత్యేక శ్రద్ద తీసుకొని విద్యుత్ అంతరాయం లేకుండా చర్యలు చేపట్టాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు.
హైదరాబాద్ లో దంచికొట్టిన వాన..
హైదరాబాద్ లో గురువారం సాయంత్రం భారీ వర్షం కురిసింది. శుక్రవారం తెల్లవారు జామున పలు ప్రాంతాల్లో వర్షం దంచికొట్టింది. నగరంలో మరో మూడు రోజులుపాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. దీంతో జీహెచ్ఎంసీ, హైడ్రా సిబ్బంది అప్రమత్తం అయ్యారు. వర్షాల నేపథ్యంలో ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు చేపడుతున్నారు. మరోవైపు.. లోతట్టు ప్రాంతాల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని అధికారులు ఆదేశించారు.