Hc Fire On Telangana Ec And Government
HC fire On Telangana EC and government : ఓ పక్క కరోనాతో ప్రజలు నానా కష్టాలు పడుతుంటే మీకు ఎన్నికలు అవసరమయ్యాయా? ప్రజల ప్రాణాలు ముఖ్యమా? ఎన్నికలు ముఖ్యమా? అని తెలంగాణ ఎన్నికల కమిషన్ ను సూటిగా ప్రశ్నించింది. అలాగే తెలంగాణా ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. కరోనా విధ్యంసం సృష్టిస్తున్న ఈ సమయంలో ఎన్నికలు అవసరమా? అని ప్రశ్నించింది. కరోనా కాలంలో ఎన్నికలు నిర్వహించటపై ఎన్నికల కమిషన్ పై ఆగ్రహం వ్యక్తం చేసింది ధర్మాసనం. ఇటువంటి విపత్కర పరిస్థితుల్లో ఎన్నికలు నిర్వహించాల్సిన అంత అవసరం ఏమొచ్చిందని ప్రశ్నించింది.
నైట్ కర్ఫ్యూ తరువాత కరోనా కట్టడికి ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకుందో వెంటనే కోర్టుకు తెలియజేయాలని ఆదేశాలు జారీ చేసింది. కరోనా కేసులు గంటగంటకూ పెరుగుతున్న ఇటువంటి పరిస్థితుల్లో ఎన్నికల ర్యాలీలు, ప్రచార కార్యక్రమాలను అనుమతి ఇవ్వటంపై ధర్మాసనం తీవ్రంగా మండిపడింది. ఏఫ్రిల్ 22 నుంచి 27 వరకూ ఎన్నికల ప్రచారా కార్యక్రమాలకు, ర్యాలీలకు ఈసీ ఎందుకు పర్మిషన్ ఇచ్చిందో తెలపాలని ఈసీకి హైకోర్టు వార్నింగ్ ఇచ్చింది.
ఇటువంటి పరిస్థితుల్లో ఎలక్షన్ కమిషన్ ఎన్నికలు నిర్వహిస్తానని అనటం దానికి ప్రభుత్వం సహకరించటంపై అభ్యంతరం వ్యక్తంచేసింది. ఎన్నికల నిర్వాహణకు ఎటువంటి ఏర్పాట్లు చేశారు? ఓటర్లకు తమ ఓటుహక్కును ఎలా నిర్వహించుకోగలరో వివరించాలని అటు తెలంగాణ ప్రభుత్వాన్ని, ఇటు ఎలక్షన్ కమిషన్ ను ఆదేశించింది. ఎన్నికలను వాయిదా వేయాలని ప్రభుత్వాన్ని ఈసీ కోరింది. దానికి సంబంధించి ఓ లెటర్ ను కూడా ప్రభుత్వానికి రాసింది. ఆ లెటర్ ను కోర్టుకు సమర్పించాలని కోర్టు కోరింది. కాగా..తెలంగాణలో ఐదు మున్సిపాలిటీలు, రెండు కార్పొరేషన్లకు సంబంధించి రేపు అంటే ఏప్రిల్ 30,2021న ఎన్నికలు జరుగనున్నాయి. ఈ అంశంపై కోర్టులో విచారణ సందర్భంగా ధర్మాసనం రాష్ట్ర ప్రభుత్వం.ఈసీపై ఆగ్రహం వ్యక్తంచేసింది.