High Court on Group 1 : గ్రూప్-1పై 222 పేజీల ఆర్డర్ కాపీలో కీలక అంశాలు.. టీజీపీఎస్‌సీపై హైకోర్టు కీలక కామెంట్స్ ..

High Court on Group 1 : టీజీపీఎస్సీ (తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్) లో పారదర్శకత లోపించిందని తెలంగాణ హైకోర్టు పేర్కొంది.

High Court on Group 1 : గ్రూప్-1పై 222 పేజీల ఆర్డర్ కాపీలో కీలక అంశాలు.. టీజీపీఎస్‌సీపై హైకోర్టు కీలక కామెంట్స్ ..

High Court on Group-1

Updated On : September 10, 2025 / 12:23 PM IST

High Court on Group 1 : గ్రూప్-1 నిర్వహణ, మూల్యాంకనంలో అవకతవకలు జరిగాయని, వాటిని రద్దు చేయాలని కోరుతూ కొందరు, వాటిని రద్దు చేయొద్దంటూ మరికొందరు తెలంగాణ హైకోర్టులో పిటిషన్లు వేశారు. ఇలా మొత్తం 12 పిటిషన్లు రాగా.. వీటిపై జులై7న న్యాయమూర్తి జస్టిస్ నామవరపు రాజేశ్వరరావు విచారణ జరిపారు. అయితే, ఈ పిటీషన్లపై హైకోర్టు మంగళవారం సంచలన తీర్పును వెలువరించిన విషయం తెలిసిందే. తీర్పుకు సంబంధించి 222 పేజీల ఆర్డర్ కాపీలో హైకోర్టు టీజీపీఎస్సీపై తీవ్ర అసహనం వ్యక్తం చేసింది.

Also Read: Donald Trump : దెబ్బకు దిగొచ్చిన ట్రంప్..! మోదీతో మాట్లాడేందుకు సిద్ధంగా ఉన్నానంటూ పోస్ట్.. స్ట్రాంగ్ రిప్లయ్ ఇచ్చిన ప్రధాని మోదీ.. కానీ..

టీజీపీఎస్సీ (తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్) లో పారదర్శకత లోపించిందని హైకోర్టు పేర్కొంది. రెండుసార్లు గ్రూప్-1 రద్దు అయినా కూడా టీజీపీఎస్సీలో మార్పురాలేదు. గత అనుభవాలను దృష్టిలో పెట్టుకొని జాగ్రత్తగా పరీక్షలు నిర్వహించాల్సింది పోయి మళ్లీ నిర్లక్ష్యంగా వ్యవహరించారంటూ హైకోర్టు పేర్కొంది.

టీజీపీఎస్సీ నిర్లక్ష్యం కారణంగా తెలంగాణ నిరుద్యోగులు తీవ్రంగా నష్టపోతున్నారు. రోజుకు 12గంటలపాటు కోచింగ్ సెంటర్లలో యువత కష్టపడుతున్నారు. టీజీపీఎస్సీ తమ సొంత నియమాలను ఉల్లంఘించింది. గ్రూప్-1 మెయిన్స్ రాసిన తెలుగు మీడియం అభ్యర్థులకు తీవ్ర అన్యాయం జరిగింది. ఇంగ్లీష్ మీడియంలో 89.9శాతం మంది తెలుగు మీడియంలో 9.95శాతం మంది సెలెక్ట్ అయ్యారు. తెలుగు మీడియంలో బాగా రాసిన వారికి ఎంత నమ్మకం లేకపోతే రీవాల్యుయేషన్ అడుగుతారు? అంటూ టీజీపీఎస్సీని హైకోర్టు కోర్టు ప్రశ్నించింది. దీనికి టీజీపీఎస్సీ ఇచ్చిన సమాధానంపైనా హైకోర్టు అసహనం వ్యక్తం చేసింది.

ఏపీపీఎస్సీలో కూడా తెలుగు మీడియం వారు ఇలానే సెలెక్ట్ అయ్యారని టీజీపీఎస్సీ హైకోర్టుకు సమాధానం ఇచ్చింది. ఏపీపీఎస్సీ గ్రూప్-1 నియామకం మూడు లేయర్లలో ఉంది. ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూ. కానీ, తెలంగాణలో కేవలం ప్రిలిమ్స్, మెయిన్స్ ఏ ఉన్నాయి కదా అంటూ హైకోర్టు పేర్కొంది. ఆన్సర్ షీట్స్ కరెక్షన్ అంశంలో సరైన విధానాన్ని టీజీపీఎస్సీ పాటించలేదని హైకోర్టు పేర్కొంది. రెండు సెంటర్లలో పరీక్ష రాసిన 71 మంది మహిళలు ఎలా సెలెక్ట్ అయ్యారు..? అంటూ హైకోర్టు ప్రశ్నించింది.

హైకోర్టు తీర్పు ప్రకారం.. ఇప్పటివరకు ప్రకటించిన గ్రూప్-1 మెయిన్స్ ఫలితాలు రద్దు చేస్తూ తీర్పునిచ్చిన హైకోర్టు.. పరీక్షల పేపర్లను రీవాల్యుయేషన్ చేయాలని ఆదేశించింది. రీవాల్యుయేషన్ చేసిన తర్వాత దాని ఆధారంగా ఫలితాలు వెల్లడించాలని టీజీపీఎస్సీకి ఆదేశాలు జారీ చేసింది. ఒకవేళ సాధ్యం కాకపోతే పరీక్షలు మళ్లీ నిర్వహించాలని ఆదేశించింది. గతంలో ప్రకటించిన జనరల్ ర్యాంకింగ్ లిస్టును రద్దు చేసింది. ఎనిమిది నెలల్లో ప్రాసెస్ పూర్తి చేయాలని హైకోర్టు ఆదేశించింది.

రాష్ట్రంలో గ్రూప్-1 నియామక పరీక్షలపై హైకోర్టు తీర్పు కాపీ అందిన తరువాతే తదుపరి కార్యాచరణ చేపట్టాలని టీజీపీఎస్సీ భావిస్తోంది. అందులోని అంశాలపై బోర్డులో చర్చించి టీజీపీఎస్సీ తుది నిర్ణయం తీసుకోనుంది. అయితే, తీర్పుపై అప్పీలుకు వెళ్లే అవకాశాలు ఉన్నట్లు సమాచారం.