×
Ad

Jagga Reddy: సంగారెడ్డిలో హైటెన్షన్.. సీఐపై ఆవేశంతో ఊగిపోయిన జగ్గారెడ్డి.. వదిలేది లేదని వార్నింగ్

వివాదం ముదరడంతో పోలీస్ ఉన్నతాధికారులు అక్కడికి చేరుకున్నారు. వారితోనూ జగ్గారెడ్డి వాగ్వాదానికి దిగారు. సీఐని వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు.

  • Published On : February 11, 2026 / 05:20 PM IST

Jagga Reddy Representative Image (Image Credit To Original Source)

  • పోలీసులపై ఫైర్ అయిన జగ్గారెడ్డి
  • కాంగ్రెస్ అభ్యర్థి గల్లా పట్టుకున్నారని సీరియస్
  • వెంటనే సీఐని సస్పెండ్ చేయాలని డిమాండ్

Jagga Reddy: మున్సిపల్ ఎన్నికల సందర్భంగా సంగారెడ్డిలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి హల్ చల్ చేశారు. 34వ వార్డులో పోలింగ్ బూత్ లోకి చొచ్చుకెళ్లేందుకు ఆయన ప్రయత్నించడం వివాదానికి దారితీసింది. కాంగ్రెస్ అభ్యర్థి చొక్కాను సీఐ పట్టుకున్నారంటూ మండిపడ్డారు. బీఆర్ఎస్ అభ్యర్థి రిగ్గింగ్ కు పాల్పడుతుంటే సీఐ వారికి సహకరిస్తున్నారని ఆరోపించారు. అలాగే ఆ సీఐపై మరిన్ని ఆరోపణలు చేశారు. పోలింగ్ బూత్ నుంచి సీఐ బయటకు రావాలంటూ జగ్గారెడ్డి హంగామా చేశారు.

లేదంటే తానే లోనికి వెళ్తానని హెచ్చరించారు. వివాదం ముదరడంతో పోలీస్ ఉన్నతాధికారులు అక్కడికి చేరుకున్నారు. వారితోనూ జగ్గారెడ్డి వాగ్వాదానికి దిగారు. సీఐని వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. లేదంటే పోలింగ్ ను ఆపేస్తానని జగ్గారెడ్డి వార్నింగ్ ఇచ్చారు. ఇదే సమయంలో అక్కడికి పెద్ద సంఖ్యలో కాంగ్రెస్ శ్రేణులు చేరుకోవడం హైటెన్షన్ ని క్రియేట్ చేసింది. అయితే, ఉన్నతాధికారులు జగ్గారెడ్డితో మాట్లాడి హామీ ఇవ్వడంతో ఆయన అక్కడి నుంచి వెళ్లిపోయారు.

సంగారెడ్డి మున్సిపాలిటీ 34వ వార్డులో కాంగ్రెస్ అభ్యర్థిగా అర్జున్ పోటీ చేస్తున్నారు. పోలింగ్ బూత్ లో బీఆర్ఎస్ అభ్యర్థి రిగ్గింగ్ కు పాల్పడుతున్నారని సీఐ శివకుమార్ కు ఫిర్యాదు చేశారు. బీఆర్ఎస్ అభ్యర్థిపై యాక్షన్ తీసుకోవాల్సింది పోయి.. తిరిగి కాంగ్రెస్ అభ్యర్థి గల్లాను సీఐ పట్టుకున్నారు అనే సమాచారం అందడంతో జగ్గారెడ్డి రంగంలోకి దిగారు. పోలింగ్ బూత్ దగ్గరికి వచ్చిన జగ్గారెడ్డి ఆవేశంతో ఊగిపోయారు. సీఐ వెంటనే వచ్చి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. 34వ వార్డులో పోలింగ్ ను కూడా రద్దు చేయాలన్నారు.

Also Read: సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం మానేసి ఇళ్లల్లో దొంగతనాలు.. బీఎండబ్ల్యూ కారు, నగలు, అల్మారాలో డబ్బులు.. అబ్బో..