Balka Suman Arrest : బీఆర్ఎస్ నేత బాల్క సుమన్ అరెస్ట్.. సీఎం రేవంత్, మంత్రి వివేక్‌పై మాజీ ఎమ్మెల్యే ఫైర్..
Balka Suman Arrested : తెలంగాణ భవన్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. బీఆర్ఎస్ నేత బాల్క సుమన్‌ను అరెస్టు చేసేందుకు పోలీసులు సిద్ధమయ్యారు. ఈ క్రమంలో తెలంగాణ భవన్ వద్ద భారీగా పోలీసులను మోహరించారు.
- Harish Thanniru
- Updated on- May 30, 2026 / 02:22 PM IST
Telangana Bhavan Police Move To Arrest BRS Leader Balka Suman
Balka Suman Arrest : బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ ను నాంపల్లి పోలీసులు అరెస్టు చేశారు. సింగరేణి, ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేయాలనేలా ఇటీవల సంచలన వ్యాఖ్యలు చేసిన బాల్క సుమన్ పై పలు పోలీస్ స్టేషన్ లలో కేసులు నమోదయ్యాయి. దీంతో పోలీసులు ఆయన అరెస్టుకు రంగం సిద్ధం చేశారు. తెలంగాణ భవన్ లో ఉన్నారనే సమాచారంతో నాంపల్లి పోలీసులు బాల్క సుమన్‌ను అరెస్టు చేసేందుకు శనివారం ఉదయం వెళ్లారు. తెలంగాణ భవన్ వద్ద భారీ సంఖ్యలో పోలీసులను మోహరించారు. అయితే, పోలీసులను లోపలకు రానివ్వకుండా బీఆర్ఎస్ కార్యకర్తలు అడ్డుకోవటంతో ఆ ప్రాంతంలో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. పోలీసులు గో బ్యాక్ అంటూ పెద్దెత్తున నినాదాలు చేశారు. ఉద్రిక్తత పరిస్థితుల నేపథ్యంలో కొద్దిసేపటి తరువాత బాల్క సమున్ తెలంగాణ భవన్ నుంచి బయటకు వచ్చి మీడియాతో మాట్లాడారు. ఆ తరువాత ఆయన్ను నాంపల్లి పోలీసులు అరెస్టు చేసి.. నాంపల్లి పోలీస్ స్టేషన్ కు తరలించారు.
బాల్క సుమన్ మీడియాతో మాట్లాడుతూ.. నేను తెలంగాణ భవన్ లోనే ఉన్నా.. ఎక్కడికీ పారిపోలేదు. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే జైలుకు పంపుతున్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో నాపై 250కిపైగా కేసులు పెట్టారు. క్యాతనపల్లి ఎన్నిక సమయంలోనూ నన్ను జైల్లో పెట్టారు. ఇప్పుడు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం నన్ను టార్గెట్ చేసింది. కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న మోసాలను ప్రశ్నిస్తూనే ఉంటాం. సింగరేణిలో వారసత్వ ఉద్యోగాలు ఇస్తామన్నారు. దానినే ప్రశ్నించా. మరోసారి నన్ను జైలుకు పంపాలని సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి వివేక్ ప్రయత్నిస్తున్నారు. నన్ను జైలుకు పంపి పైశాచిక ఆనందం పొందాలని చూస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న మోసాలను ప్రశ్నిస్తూనే ఉంటా అంటూ బాల్క సుమన్ అన్నారు.
అరెస్టుకు ముందు ఏసీపీ ప్రవీణ్ మాట్లాడుతూ.. బాల్క సుమన్ పై నాంపల్లి పీఎస్‌లో కేసు నమోదైందని తెలిపారు. సింగరేణి అధికారి ఫిర్యాదుతో.. సింగరేణి పై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారంటూ ఆయనపై కేసు నమోదైందని చెప్పారు. బాల్క సుమన్ బీఆర్ఎస్ భవన్‌లో ఉన్నట్లు సమాచారం రావడంతో.. నోటీసులు ఇచ్చి తీసుకెళ్లేందుకు వచ్చామని ఏసీపీ తెలిపారు. అయితే, బాల్క సమన్ లాయర్ మాట్లాడుతూ.. ముందస్తు బెయిల్ కోసం దరఖాస్తు చేశామని తెలిపారు. ఆ విషయం తెలిసే పోలీసులు హడావుడా చేస్తున్నామని అన్నారు. పబ్లిక్ ప్రాపర్టీస్ డ్యామేజ్ చేస్తే పెట్టాల్సిన కేసులు పెట్టారు. ఈ కేసులో ఎఫ్ఐఆర్ లో పెట్టిన సెక్షన్లు సుమన్ కు వర్తించవు. లీగల్ గా ప్రొసీడ్ అవుతాం.. విచారణకు సహకరిస్తామని చెప్పారు.
ఇటీవల బాల్క సుమన్ మాట్లాడుతూ.. సింగరేణి సంస్థపై సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. మిలిటెంట్ ఉద్యమాలు చేయాలని, హైదరాబాద్‌లో సింగరేణి భవన్‌ను కాల్చాలంటూ, రైల్వే పట్టాలను కోసెయ్యాలంటూ తీవ్ర స్థాయిలో వ్యాఖ్యలు చేశారు. బాల్క సుమన్ వ్యాఖ్యలను కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండించింది. ఈ క్రమంలో ఆయనపై అబిడ్స్, నాంపల్లి పోలీసు స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి. బాల్క సుమన్ ను ఎప్పుడైనా అరెస్టు చేయొచ్చునని వార్తలు వస్తున్న క్రమంలో.. గత రెండు రోజులుగా ఆయన తెలంగాణ భవన్ లో ఉంటున్నట్లు తెలిసింది. దీంతో పోలీసులు తెలంగాణ భవన్ కు చేరుకొని ఆయన్ను అరెస్టు చేసేందుకు సిద్ధమయ్యారు. ఈ క్రమంలో భారీ సంఖ్యలో తెలంగాణ భవన్ దగ్గర పోలీసులను మోహరించారు. పోలీసులు తెలంగాణ భవన్లోకి వెళ్లేందుకు ప్రయత్నించగా.. కార్యకర్తలు అడ్డుకోవటంతో ఆ ప్రాంతంలో ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది.
