CP Sajjanar: టాస్ ఎవరిది? ఏ జట్టు గెలుస్తుంది? ఇలాంటి ప్రకటనలతో జాగ్రత్త.. ఐపీఎల్ బెట్టింగ్ మోసాలపై సీపీ సజ్జనార్ వార్నింగ్

కొంత మంది ఇన్‌ఫ్లుయెన్సర్లు కూడా డబ్బు కోసం ఈ అసత్య ప్రచారాల్లో పాల్గొంటున్నారని సీపీ సజ్జనార్ మండిపడ్డారు.

  • Published On : April 7, 2026 / 05:23 PM IST
  • ఐపీఎల్ ప్రిడిక్షన్ పేరుతో ఆన్ లైన్ బెట్టింగ్ మోసాలు
  • సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్ లో ఫేక్ క్రికెట్ ప్రిడిక్షన్ ఛానెల్స్ హల్ చల్
  • ఇలాంటి ప్రచారాలను నమ్మి ఎవరూ డబ్బు పెట్టొద్దని సీపీ సజ్జనార్ వార్నింగ్
  • ఫేక్ ప్రిడిక్షన్స్, బెట్టింగ్‌లపై కఠిన చర్యలు
  • సైబర్ మోసం జరిగితే వెంటనే 1930కి ఫోన్ చేయాలని సూచన

CP Sajjanar: ఐపీఎల్ క్రికెట్ స్టార్ట్ అయిపోయింది. ఐపీఎల్ కు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. పెద్ద సంఖ్యలో అభిమానులు ఉన్నారు. ఇదే అదనుగా సైబర్ క్రిమినల్స్ ఎంట్రీ ఇచ్చారు. సైబర్ మోసాలకు తెరలేపారు. ఐపీఎల్ క్రికెట్ కు ఉన్న క్రేజ్ ను క్యాష్ చేసుకునేందుకు సైబర్ క్రిమినల్స్ రెడీ అయిపోయారు. ప్రిడిక్షన్ పేరుతో ఆన్ లైన్ బెట్టింగ్ మోసాలకు పాల్పడుతున్నారు. అట్రాక్ట్ చేసే ప్రకటనలతో అడ్డంగా దోచేస్తున్నారు. దీనిపై హైదరాబాద్ సీపీ సజ్జనార్ హెచ్చరిక జారీ చేశారు.

ఆన్‌‌లైన్ బెట్టింగ్‌ మోసాలపై సోషల్ మీడియా వేదికగా సీపీ హెచ్చరించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఐపీఎల్ ప్రిడిక్షన్ పేరుతో సోషల్ మీడియాలో వస్తున్న ప్రకటనలు పూర్తిగా మోసపూరితమైనవని స్పష్టం చేశారు. టాస్ ఎవరిది, మ్యాచ్ ఎవరు గెలుస్తారో ముందే చెబుతామన్న మాటలు అసత్యం అన్నారు. ఇలాంటి ప్రచారాలను నమ్మి ఎవరూ డబ్బు పెట్టొద్దని సీపీ సజ్జనార్ ఎక్స్ వేదికగా సూచించారు.

సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్ లో ఫేక్ క్రికెట్ ప్రిడిక్షన్ ఛానెల్స్ దందా చేస్తున్నాయన్నారు. టాస్, మ్యాచ్ ఫలితాలు ముందే చెబుతామని అమాయకులను బెట్టింగ్ ఉచ్చులోకి లాగుతూ మోసం చేస్తున్నాయని వివరించారు. కొంత మంది ఇన్‌ఫ్లుయెన్సర్లు కూడా డబ్బు కోసం ఈ అసత్య ప్రచారాల్లో పాల్గొంటున్నారని సీపీ సజ్జనార్ మండిపడ్డారు. ఈ ఫేక్ ప్రిడిక్షన్ ఛానెల్స్ లో ముందుగా ఎన్‌రోల్ చేయిస్తారని, తర్వాత బెట్టింగ్ యాప్స్ లింక్స్ పంపి మోసం చేస్తున్నారని సజ్జనార్ వివరించారు. బెట్టింగ్ వల్ల కష్టపడి సంపాదించిన డబ్బును అమాయకులు కోల్పోతున్నారని సీపీ ఆవేదన వ్యక్తం చేశారు. ఫేక్ ప్రిడిక్షన్లను ఎట్టి పరిస్థితుల్లోనూ నమ్మొద్దని సీపీ సూచించారు. ఫేక్ ప్రిడిక్షన్స్, బెట్టింగ్‌లపై హైదరాబాద్ సైబర్ క్రైమ్ విభాగం కఠిన చర్యలు తీసుకుంటోందని సీపీ తెలిపారు.

ఇప్పటివరకు 494 పెయిడ్ యాడ్స్‌ను సైబర్ క్రైమ్ పోలీసులు బ్లాక్ చేశారని సీపీ తెలిపారు. సోషల్ మీడియాలో 129 ఫేక్ ప్రొఫైళ్లను తొలగించారన్నారు. బెట్టింగ్ యాప్‌లపై నిరంతర నిఘా ఉంటుందని తేల్చి చెప్పారు. మోసపూరిత యాడ్స్ కనిపిస్తే వెంటనే రిపోర్ట్ చేయాలని ప్రజలను కోరారు. సైబర్ మోసం జరిగితే వెంటనే 1930కి ఫోన్ చేయాలని లేదా cybercrime.gov.in వెబ్‌సైట్‌లో ఫిర్యాదు చేయాలని సీపీ సజ్జనార్ సూచించారు. సైబర్ నేరాల ఫిర్యాదు వేదికలో వివరాలు నమోదు చేస్తే వెంటనే చర్యలు తీసుకుంటామన్నారు.

Also Read: బిర్యానీ లవర్స్‌కు బిగ్ షాక్.. ఆన్‌లైన్‌లో బిర్యానీ తెప్పించుకుంటున్నారా? ఒక్కసారి ఇది చూడండి..