VC Sajjanar: ఏఐ సైబర్ దాడులపై అలర్ట్.. పాత APIలను వెంటనే మార్చండి.. సీపీ సజ్జనార్ కీలక సూచనలు!

సైబర్ దాడులు పెరుగుతున్నందున బ్యాంకులు, క్విక్ కామర్స్ సంస్థలు భద్రతా వ్యవస్థలను బలోపేతం చేసుకోవాలని హైదరాబాద్ సీపీ వి.సి. సజ్జనార్ (VC Sajjanar)హెచ్చరించారు.

Hyderabad cp vc sajjanar warns banks quick commerce over ai cyber attacks

VC Sajjanar: కృత్రిమ మేధస్సు (AI) సాంకేతికతను ఆసరాగా చేసుకుని సైబర్‌ నేరగాళ్లు సరికొత్త రీతిలో దాడులకు తెగబడుతున్న తరుణంలో బ్యాంకులు, ఆర్థిక సంస్థలు, క్విక్‌ కామర్స్‌ రంగాలు మరింత అప్రమత్తంగా ఉండాలని హైదరాబాద్‌ నగర పోలీస్‌ కమిషనర్‌ వి.సి. సజ్జనార్ (VC Sajjanar)తీవ్రంగా హెచ్చరించారు. సైబర్ దాడుల నుంచి వినియోగదారుల డేటాను, ఆర్థిక లావాదేవీలను కాపాడుకునేందుకు భద్రతా వ్యవస్థలను తక్షణమే బలోపేతం చేసుకోవాలని సూచించారు. థర్డ్‌ పార్టీ మాడ్యూళ్లు, ఏపీఐ (API) సేవలకు పటిష్ఠమైన డిజిటల్ రక్షణ కల్పించాల్సిన అవసరం ఉందని ఆయన నొక్కిచెప్పారు.

YS Jagan: చంద్రబాబు పెద్ద ‘రిగ్గింగ్ మాస్టర్’.. వైఎస్ జగన్ సంచలన ట్వీట్.. ఏపీలో వేడెక్కిన రాజకీయం!

లోపాలను సొమ్ము చేసుకుంటున్న ఏఐ ఏజెంట్లు.. పాత సాఫ్ట్‌వేర్ల తొలగింపునకు ఆదేశం:

పాత సాఫ్ట్‌వేర్లు, భద్రత లేని ఏపీఐల వల్ల తీవ్రమైన సైబర్‌ ముప్పు పొంచి ఉందని సీపీ వివరించారు. సైబర్‌ నేరగాళ్లు అధునాతన ఏఐ ఏజెంట్లను ఉపయోగించి ఆర్థిక సంస్థల నెట్‌వర్క్‌లలోని లోపాలను త్వరితగతిన గుర్తిస్తున్నారని, పేమెంట్ ఏపీఐల ద్వారా మ్యూల్ ఖాతాల్లోకి అక్రమంగా నిధులు మళ్లిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. కాబట్టి వినియోగంలో లేని పాత ఏపీఐలను వెంటనే తొలగించాలని, నగదు విడుదల చేసే సిస్టమ్స్‌కు బలమైన సెక్యూరిటీని ఏర్పాటు చేయాలని స్పష్టం చేశారు.

మాక్ డ్రిల్స్, కఠిన కేవైసీ నిబంధనలు.. సైబర్ మోసపోతే 1930కి కాల్ చేయాలని విజ్ఞప్తి:

అసాధారణ లావాదేవీలపై పరిమితులు విధించడంతో పాటు నగదు బదిలీకి ముందు పూర్తిస్థాయి కేవైసీ (KYC) తప్పనిసరి చేయాలని, భారీ లావాదేవీలకు ఉన్నతాధికారుల ఆమోదం పొందేలా చర్యలు ఉండాలని సూచించారు. సైబర్ బెదిరింపులను ఎదుర్కొనేందుకు ‘రెడ్ టీమ్ మాక్ డ్రిల్’ నిర్వహిస్తూ ఐటీ, సెక్యూరిటీ బృందాలు సమన్వయంతో పనిచేయాలన్నారు. ఒకవేళ ఎవరైనా సైబర్ మోసానికి గురైతే తక్షణమే 1930 టోల్ ఫ్రీ నంబర్‌కు కాల్ చేయాలని లేదా cybercrime.gov.in పోర్టల్‌లో ఫిర్యాదు చేయాలని సూచించారు.