కరోనా వేళ ఖైదీలు పారిపోతున్న ఘటనలు తరచూ వింటున్నాం. ఈ క్రమంలో నలుగురు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయిన ఖైదీలు పరారయ్యారు. చర్లపల్లి జైలులో నలుగురు ఖైదీలకు కరోనా లక్షణాలు రావటంతో వారిని ఎర్రగడ్డ హాస్పిటల్ లో టెస్టులు చేయించగా పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. దీంతో వారిని అధికారులు సికింద్రాబాద్ లోని గాంధీ హాస్పిటల్ కు తరలించి అధికారులు చికిత్స చేయిస్తున్నారు. ఈ క్రమంలో గాంధీ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న ఖైదీలు బుధవారం (ఆగస్టు 26 తెల్లవారుఝామున 3 గంటల ప్రాంతంలో హాస్పిటల్ నుంచి తప్పించుకుని పరారయ్యారు.
ఆస్పత్రి మెయిన్ బిల్డింగ్ 2వ అంతస్థులోని బాత్ రూమ్ గ్రిల్స్ తొలగించి దాంట్లోంచి ఎస్కేప్ అయ్యారు. వీరు నలుగురు ఖైదీలు ఒకే కేసులో శిక్ష పడినవారే కావటం విశేషం. కాగా పక్కా ప్లాన్ ప్రకారంగానే ఈ నలుగురు ఖైదీలు తప్పించుకుని ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. దీంతో ఆ నలుగురు ఖైదీలను పట్టుకోవటానికి పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు.
పలు ప్రాంతాల్లో ఆస్పత్రుల నుంచి తప్పించుకుంటున్న కరోనా ఖైదీలు
https://10tv.in/sushant-death-case-rhea-chakrabortys-deleted-whatsapp-chats-reveal-she-was-in-touch-with-two-drug-dealers/
తూర్పుగోదావరి జిల్లా రాజానగరం జీఎ్‌సఎల్ ఆస్పత్రిలో కరోనాకు చికిత్స పొందుతున్న రాజమహేంద్రవరం సెంట్రల్ జైలు ఖైదీ పరారైయ్యాడు. ఈ విషయాన్ని రాజానగరం ఎస్‌ఐ జుబేర్ దృవీకరించారు. ఈ ఖైదీది పశ్చిమ గోదావరి జిల్లా నిడదవోలు. రాజమహేంద్రవరం సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా శిక్ష అనుభవిస్తున్నాడు. కాగా, తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం సెంట్రల్ జైలులో 24 మంది సిబ్బందికి, 18 మంది ఖైదీలకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయినట్లు జైలు అధికారులు వెల్లడించారు.
అలాగే చిత్తూరు జిల్లా కోవిడ్ ఆస్పత్రి నుండి కరోనా సోకిన రిమాండ్ ఖైదీ పరార్ అయ్యాడు. పలమనేరులో 2019 జులై 24వ తేదీన జరిగిన హత్య కేసు నిందితుడు అన్వర్(49)ను పలమనేరు పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ నిమిత్తం చిత్తూరు జైలుకు తరలించారు. అయితే జైలు శిక్ష అనుభవిస్తున్న సమయంలో అతనికి కరోనా సోకటంతో అధికారులు అతన్ని చికిత్స నిమిత్తం చిత్తూరు కోవిడ్ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఆస్పత్రి నుంచి పరార్ అయ్యాడు.
ఇలా పలు ప్రాంతాల్లోని జైళ్లలో శిక్షలు అనుభవిస్తున్న ఖైదీలకు కరోనా సోకగా వారిని చికిత్స నిమిత్తం హాస్పిటల్ కు తరలించిన క్రమంలో వారు ఆస్పత్రుల నుంచి పరారవుతున్న ఘటనలు తరచూ జరుగుతున్నాయి.