ట్రిపుల్ఆర్ పై కోమటిరెడ్డి బ్రదర్స్ తలోదారి.. అన్న అవునంటే.. తమ్ముడు కాదంటున్న పరిస్థితి
తనకు మంత్రి పదవి ఇస్తామని చెప్పి ఆలస్యం చేసిన పర్వాలేదని..రైతులకు అన్యాయం జరిగితే ఊరుకునేది లేదంటున్నారు. ట్రిపుల్ఆర్ అలైన్మెంట్ మారాలంటే..ప్రభుత్వం మారాలేమో అంటూ బాంబ్ పేల్చారు.

Komatireddy brothers: తెలంగాణ కాంగ్రెస్లో కోమటిరెడ్డి బ్రదర్స్ అంటే సంథింగ్ స్పెషల్. పార్టీలో మరీ ముఖ్యంగా ఉమ్మడి నల్గొండ జిల్లాలో పట్టున్న నేతలు కావడంతో వారి విషయంలో మిగతా నేతలు కూడా కాస్త చూసి చూడనట్లుగా వ్యవహరిస్తుంటారు. ఈ మధ్యకాలంలో ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పార్టీ తీరుపై..ప్రభుత్వ అధినేతలపై సుర్రుబుర్రులాడుతున్నారు.
తనకు మంత్రి పదవి ఇస్తామని హామీ ఇచ్చి ఇప్పుడు ఆ మాటను నిలబెట్టుకోవడం లేదంటూ గుర్రుగా ఉంటున్నారు. అయితే మంత్రి పదవి విషయంలోనే కోమటిరెడ్డి బ్రదర్స్ మధ్య సీఎం రేవంత్రెడ్డి అసంతృప్తిని రాజేశారన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. ఆ రచ్చ అలా నడుస్తుండగానే..మరో బిగ్ రోడ్ కన్స్ట్రక్షన్ ప్రాజెక్ట్పై సొంత అన్నదములు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిలు చెరో వాయిస్ వినిపిస్తున్నారు.
Also Read: లిక్కర్ కేసు లింకులు ఎక్కడ దాకా? వెలుగులోకి వస్తున్న కొత్త కొత్త పేర్లు
ఆర్ అండ్ బీ శాఖ మంత్రిగా ఉన్న కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ట్రిపుల్ఆర్ తన డ్రీమ్ ప్రాజెక్టు అని చెబుతుంటారు. తన శాఖ పరిధిలోనిది కావడంతో రీజనల్ రింగ్ రోడ్ పై వెంకట్ రెడ్డి ఫుల్ ఫోకస్ పెడుతున్నారు. రెగ్యులర్గా రివ్యూలు చేయడంతో పాటు కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీతో తరచూ సమావేశమయ్యారు. అలా రీజనల్ రింగ్ రోడ్డు పూర్తి చేయడం తన టార్గెట్ అంటూ చెప్పుకుంటూ వస్తున్నారు వెంకట్రెడ్డి. ట్రిపుల్ఆర్ కోసం భూసేకరణ .. త్వరగా పూర్తి చేయాలంటూ అధికారులను ఉరుకులు, పరుగులు పెట్టిస్తున్నారు.
అయితే ట్రిపుల్ఆర్ కోసం అన్న వెంకట్రెడ్డి ఆత్రం చేస్తుంటే.. తమ్ముడు రాజగోపాల్ రెడ్డి సోదరుడి స్పీడ్కు బ్రేకులు వేస్తున్నారు. ట్రిపుల్ఆర్ రోడ్డులో భూములు కోల్పోతున్న రైతులకు మార్కెట్ రేటు ప్రకారం ధర చెల్లించాలని… అప్పటి వరకు భూసేకరణ చేసే ప్రసక్తే లేదని తెగేసి చెబుతున్నారు. ఈ విషయంలో రైతుల కోసం అండగా ఉండేందుకు ప్రభుత్వంపై పోరాటం చేసేందుకు సిద్ధమంటూ శపథం చేశారు.
తనకు మంత్రి పదవి ఇస్తామని చెప్పి ఆలస్యం చేసిన పర్వాలేదని..రైతులకు అన్యాయం జరిగితే ఊరుకునేది లేదంటున్నారు. ట్రిపుల్ఆర్ అలైన్మెంట్ మారాలంటే..ప్రభుత్వం మారాలేమో అంటూ బాంబ్ పేల్చారు. ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి చేసిన కామెంట్స్ హాట్ టాపిక్గా మారాయి. కాంగ్రెస్ పార్టీలో ఇద్దరు కీలక నేతలు..పైగా సొంత అన్నదమ్ములు డిఫరెంట్ కామెంట్స్ చేస్తుండటం చర్చనీయాంశంగా మారింది. ట్రిపుల్ఆర్ భూసేకరణ పరిహారం విషయంలో ప్రభుత్వం ఎలా ముందుకెళ్తుందో..రాజగోపాల్ రెడ్డి కామెంట్స్పై పార్టీ ప్రభుత్వం ఎలా రెస్పాండ్ అవుతుందో చూడాలి మరి.