HMWSSB Water Tankers : ట్యాంకర్‌లలో నీటిని బుక్ చేసే వారికి జల మండలి కీలక అలర్ట్.. అలాంటి వారంతా జైలుకే

HMWSSB Water Tankers : జలమండలి కీలక ప్రకటన చేసింది. లోగో దుర్వినియోగంపై హెచ్చరికలు జారీ చేసింది.

hyderabad jalmandali warns private water tankers on using hmwssb logo will face criminal action

HMWSSB Water Tankers : వేసవి కాలం పూర్తిగా రాకముందే నీటి ఎద్దడి ప్రారంభమైంది. మున్సిపల్ వాటర్ సప్లై కూడా తగ్గింది. దీంతో చాలా ప్రాంతాల్లో నీటి కొరత మొదలైంది. మార్చి నెల ప్రారంభం నుంచే వాటర్ ట్యాంకర్ల మీద ఆధారపడే పరిస్థితి వచ్చేసింది. ఇప్పటికే వాటర్ ట్యాంకర్లకు డిమాండ్ పెరిగింది. ఈ క్రమంలో జలమండలి కీలక ప్రకటన చేసింది. ప్రైవేటు వ్యక్తులు, కంపెనీలు జలమండలి లోగో (HMWSSB) వినియోగిస్తే.. క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించింది. జలమండలి బోర్డు లోగో దుర్వినియోగంపై ప్రకటన విడుదల చేసింది.

ప్రైవేట్ ట్యాంకర్లు జలమండలి లోగోను వినియోగించడం వల్ల జనాలు వాటిని ప్రభుత్వ ట్యాంకర్లుగా భావిస్తున్నారు. ప్రైవేటు ట్యాంకర్లు.. సాధారణంగా బోర్‌వెల్‌ల నుండి సేకరించిన నీటిని శుద్ధి చేయకుండానే.. నాణ్యత పరీక్షలు చేయకుండానే సరఫరా చేస్తున్నారు. ఈ నీటిని వినియోగించడం వల్ల తీవ్రమైన ఆరోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం ఉంది.

ఈక్రమంలో జలమండలి అధికారులు దీన్ని చాలా తీవ్రమైన అంశంగా పరిగణిస్తున్నారు. జలమండలి లోగో దుర్వినియోగం చేసే వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులు నిర్ణయించారు. అలానే ఇలాంటి ప్రైవేట్ ట్యాంకర్ల పట్ల జనాలు కూడా అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.

అందువల్ల నగర ప్రజలు నీటి కోసం ప్రైవేట్ ట్యాంకర్ ఆపరేటర్లపై ఆధారపడవద్దని జలమండలి సూచిస్తోంది. ప్రజలు తాగునీటి కోసం ట్యాంకర్లను బుక్ చేసుకోవాలనుకుంటే.. వారు జలమండలి అధికారిక కస్టమర్ కేర్‌కు కాల్ చేసి.. వారి ద్వారా మాత్రమే ట్యాంకర్ బుక్ చేయవలసిందిగా విన్నవించింది.. టోల్ ఫ్రీ నంబర్ 155313 కు కాల్ చేసి, సురక్షితమైన, శుద్ధి చేయబడిన తాగునీటిని పొందవచ్చని తెలిపింది.

జలమండలి అధికారులు కొన్ని రోజుల క్రితం నిర్వహించిన తనిఖీల్లో.. ఒక ప్రైవేట్ నీటి ట్యాంకర్ జలమండలి లోగోను అనధికారికంగా వినియోగిస్తున్నట్లు అధికారుల దృష్టికి వచ్చింది. వారు వెంటనే అప్రమత్తమై ఆ ట్యాంకర్‌ను స్వాధీనం చేసుకున్నారు. అలానే దీనికి బాధ్యుడైన వ్యక్తిపై క్రిమినల్ కేసు నమోదు చేశారు.