బీఆర్‌ఎస్ నేత ఎర్రోళ్ల శ్రీనివాస్‌ను వెస్ట్ మారేడ్‌పల్లిలోని ఆయన నివాసంలో మాసాబ్‌ట్యాంక్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల విధులను అడ్డగించారని బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డితో పాటు ఎర్రోళ్ల శ్రీనివాస్, మరికొంత మందిపై గతంలో కేసు నమోదైన విషయం తెలిసిందే.
ఈ కేసులో విచారణకు రావాలని నోటీసులు ఇచ్చేందుకు పోలీసులు వెళ్లారు. ఎర్రోళ్ల శ్రీనివాస్ తలుపులు తెరవకపోవడం, బీఆర్ఎస్ కార్యకర్తలు అక్కడికి భారీగా చేరుకోవడంతో అక్కడ స్వల్ప ఉద్రిక్తత నెలకొంది. దీంతో శ్రీనివాస్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ఎర్రోళ్ల శ్రీనివాస్ అరెస్టుపై మాజీ మంత్రి హరీశ్ రావు మండిపడ్డారు. ఇందిరమ్మ రాజ్యమా? పోలీస్ రాజ్యమా? అంటూ ట్వీట్ చేశారు. బీఆర్‌ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు, ఎస్సీ ఎస్టీ కమిషన్ మాజీ చైర్మన్ డాక్టర్ ఎర్రోళ్ల శ్రీనివాస్ అక్రమ అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నానని చెప్పారు.
ఉదయాన్నే పోలీసులు ఇంటి వద్దకు వచ్చి అక్రమ అరెస్టు చేయడం దుర్మార్గమని అన్నారు. కుటుంబ సభ్యులకు కనీస సమాచారం ఇవ్వకుండా, ఎలాంటి నోటీసు లేకుండా అరెస్ట్ చేయడం పూర్తిగా అప్రజాస్వామికమని చెప్పారు. ప్రజాస్వామ్య పాలన అని డబ్బా కొడుతూ, రాక్షస పాలన కొనసాగిస్తున్నారని తెలిపారు.
సెలవు రోజుల్లో కావాలని తమ నేతలను అరెస్ట్ చేస్తూ, సీఎం నియంతలా వ్యవహరిస్తున్నారని చెప్పారు. హోం మంత్రిగా శాంతి భద్రతల నిర్వహణలో విఫలమైన రేవంత్ రెడ్డి, బీఆర్‌ఎస్ కార్యకర్తలను వేధించడంపైనే దృష్టి పెట్టారని తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి పిట్ట బెదిరింపులు, అక్రమ కేసులకు తాము భయపడబోమని అన్నారు. తెలంగాణ సమాజమే వారికి తగిన బుద్ధి చెబుతుందని చెప్పారు.
SI Sai kumar: చెరువులో దూకి ఎస్సై, మహిళా కానిస్టేబుల్, కంప్యూటర్ ఆపరేటర్ బలవన్మరణం