Hyderabad Police Arrest Robber : తాళాలు వేసిన ఇళ్లే టార్గెట్.. హైదరాబాద్‌లో ఘరానా దొంగ అరెస్ట్.. రూ.కోటి విలువైన సొత్తు

రాత్రి కాగానే అసలు అవతారం ఎత్తుతాడు. దొంగతనాలకు దిగుతాడు. తాళాలు వేసిన ఇళ్లే అతడి టార్గెట్. అతడి కన్ను పడిందా? ఆ ఇల్లు గుల్ల కావాల్సిందే.

Hyderabad Police Arrest Robber : పగలు ఎలక్ట్రానిక్ పనులు చేస్తాడు. రాత్రి కాగానే అసలు అవతారం ఎత్తుతాడు. దొంగతనాలకు దిగుతాడు. తాళాలు వేసిన ఇళ్లే అతడి టార్గెట్. అతడి కన్ను పడిందా? ఆ ఇల్లు గుల్ల కావాల్సిందే. తాజాగా ఆ దొంగ దొరికాడు. హైదరాబాద్ పోలీసులు ఘరానా దొంగను అరెస్ట్ చేశారు. దీనికి సంబంధిచిన వివరాలను రాచకొండ కమిషనర్ మహేశ్ భగవత్ తెలిపారు. తాళాలు వేసిన ఇళ్లలో చోరీలకు పాల్పడుతున్న దొంగను అరెస్ట్ చేశామని, అతడి నుంచి ఏకంగా కోటి 30 లక్షల 18 వేల విలువగల సొత్తును స్వాధీనం చేసుకున్నామని ఆయన వెల్లడించారు.

వనస్థలిపురం పోలీస్ స్టేషన్ పరిధిలో వరుస దొంగతనాలకు పాల్పడుతున్న ముచ్చు అంబేద్కర్ అలియాస్ రాజు అలియాస్ రాజేష్, అలియాస్ ప్రసాద్, అలియాస్ రాజేందర్ ప్రసాద్ ను అరెస్ట్ చేసినట్టు పోలీసులు తెలిపారు. గుంటూరు పిడుగురాళ్లకు చెందిన అంబేద్కర్ 1989 నుండి నేరాలకు పాల్పడుతున్నాడని వెల్లడించారు. ఇందిరా పార్కు దగ్గర ఎలక్ట్రానిక్ వర్క్ చేస్తుంటాడని.. సైబరాబాద్, హైదరాబాద్, రాచకొండ పరిధిలో అతడిపై మొత్తం 21 కేసులు నమోదయ్యాయని తెలిపారు. తాళాలు వేసిన ఇళ్లను టార్గెట్ చేసుకుని దొంగతనాలకు పాల్పడుతున్నాడని చెప్పారు.

కాగా, చోరీ చేసిన బంగారాన్ని అమ్మితే పోలీసులు పట్టుకుంటారని భయపడిన అంబేద్కర్.. చోరీ సొత్తుని ఎక్కడా అమ్మలేదు. దొంగతనం చేసిన వస్తువులు మొత్తం ఇంట్లోనే భద్రంగా దాచి పెట్టుకుంటాడని తెలిపారు. మొత్తం 43 కేసుల్లో దొంగతనాలకు పాల్పడినట్టు పోలీసులు తెలిపారు. దొంగ నుంచి 230 తులాల బంగారం, 10.2 కేజీల వెండి, నెట్ క్యాష్ రూ.18 వేలు స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు. ఈ సొత్తు విలువ మొత్తం కోటి 30 లక్షల 18 వేల ఉంటుందన్నారు. నిందితుడిని మరోసారి కస్టడీలోకి తీసుకుని విచారిస్తామని పోలీసులు తెలిపారు.

ట్రెండింగ్ వార్తలు