అక్రమ నిర్మాణాల కూల్చివేతలపై హైడ్రా సంచలన నిర్ణయం..

ఎఫ్ టీఎల్, బఫర్ జోన్ల పరిధిలో అనేక ప్రాంతాల్లో పేదలు నివాసాలు ఏర్పాటు చేసుకుంటున్నారు. ఆ తర్వాత వాటిని కొంత పెద్ద వ్యక్తులు కొనుగోలు చేసి వాటిని లేఔట్లుగా మార్చి నిర్మాణాలు చేసి వాటిని అమ్ముకుంటున్నారు.

Hydra Demolitions : అక్రమ నిర్మాణాల కూల్చివేతలపై హైడ్రా కీలక నిర్ణయం తీసుకుంది. ఎఫ్ టీఎల్, బఫర్ జోన్లలో ఏళ్ల తరబడి నిర్మించిన భవనాలను కూల్చబోమని హైడ్రా కమిషనర్ రంగనాథ్ ప్రకటించారు. ఎఫ్ టీఎల్, బఫర్ జోన్లలో కొత్తగా నిర్మించిన వాటిని మాత్రమే కూల్చివేస్తున్నట్లు ఆయన స్పష్టం చేశారు. హైదరాబాద్ నగరంలోని చెరువులు, నాలాలు, మూసీ నది సమీపంలో నిర్మించిన నిర్మాణాలు.. ఎఫ్ టీఎల్ పరిధిలోకి పెద్ద సంఖ్యలో వస్తున్నాయి. ఇలాంటి వాటి విషయంలో హైడ్రా కీలక నిర్ణయం తీసుకుందని చెప్పొచ్చు. ఈ నిర్మాణాలను కూల్చివేస్తారంటూ కొన్ని రాజకీయ పార్టీలు, కొంత మంది భయపడుతున్నారు.

ఈ నేపథ్యంలో హైడ్రా కమిషనర్ రంగనాథ్ చేసిన ప్రకటన కీలకంగా మారిందని చెప్పొచ్చు. ఎఫ్ టీఎల్, బఫర్ జోన్ల పరిధిలో అనేక ప్రాంతాల్లో పేదలు నివాసాలు ఏర్పాటు చేసుకుంటున్నారు. ఆ తర్వాత వాటిని కొంత పెద్ద వ్యక్తులు కొనుగోలు చేసి వాటిని లేఔట్లుగా మార్చి నిర్మాణాలు చేసి వాటిని అమ్ముకుంటున్నారు. చాలా ప్రాంతాల్లో అలాంటి నిర్మాణాల్లో జనాలు నివాసం ఉంటున్నారు. ఇలాంటి వారి విషయంలో ప్రభుత్వం ఒక క్లారిటీ ఇచ్చిందని చెప్పొచ్చు. ఎవరైతే ఇప్పటికే నిర్మాణాలు పూర్తి చేసుకుని ఆ ఇళ్లలో నివాసం ఉంటున్నారో అలాంటి ఇళ్లను మాత్రం తాము కూల్చమని రంగనాథ్ ప్రకటించారు. హైడ్రా తీసుకున్న ఈ నిర్ణయం ద్వారా చాలామందికి భారీ ఊరట లభించిందని చెప్పొచ్చు.

ఇళ్లను కూల్చివేస్తే చెరువుల్లో పట్టా భూములను కొనుగోలు చేసిన వారంతా ఇబ్బంది పడతారనే హైడ్రా ఈ నిర్ణయం తీసుకుంది. చెరువు పరిసర ప్రాంతాల్లో నివాసాలు కలిగి ఉన్న వారంతా హైడ్రా తాజా నిర్ణయంతో ఊపిరిపీల్చుకున్నారు. అయితే, చెరువుల పరిసర ప్రాంతాల్లో నిర్మించిన కమర్షియల్ భవనాలను, కొత్తగా నిర్మిస్తున్న వాటిని మాత్రం కచ్చితంగా కూల్చివేస్తామని హైడ్రా కమిషనర్ రంగనాథ్ తేల్చి చెప్పారు. భవిష్యత్తులో ఎవరు కూడా ఎఫ్ టీఎల్, బఫర్ జోన్ల పరిధిలో నిర్మాణాలు చేయాలంటే భయపడేలా చర్యలు తీసుకుంటామన్నారు. భవిష్యత్తులో ఎవరూ కూడా చెరువుల పరిసర ప్రాంతాల్లో నిర్మాణాలు చేపట్టొద్దని అధికారులు సూచించారు. ఇక, ఎవరైనా చెరువుల పరిసర ప్రాంతాల్లో ఉండే ఇళ్లను కొనుగోలు చేసే సమయంలో అవి ఎఫ్ టీఎల్, బఫర్ జోన్ల పరిధిలోకి ఏమైనా వస్తాయా అన్నది చెక్ చేసుకున్న తర్వాతే కొనుగోలు చేయాలని హైడ్రా కమిషనర్ సూచించారు.

హైడ్రా కూల్చివేతలపై వివరణ ఇస్తూ కమిషనర్ రంగనాథ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ”ప్రజలు చెరువుల ఎఫ్ టీఎల్, బఫర్ జోన్లలో ఉన్న స్థలాలు, ఇళ్లుఎట్టి పరిస్థితుల్లోనూ కొనుగోలు చేయొద్దు. కొనే ముందు ఒకటికి రెండుసార్లు డాక్యుమెంట్లు పరిశీలించుకోవాలి. ప్రస్తుతం ఎఫ్ టీఎల్, బఫర్ జోన్లలో ఉన్న కొత్త నిర్మాణాలను మాత్రమే కూల్చేస్తున్నాం. ఆక్రమణలో ఉన్న ఏ ఇంటినీ కూల్చబోము” అని స్పష్టం చేశారు రంగనాథ్.

Also Read : ఫాతిమా‌ కళాశాలను ఎప్పుడు కూల్చుతారు?: రాజాసింగ్

ఇక ఇవాళ కూడా మూడు ప్రాంతాల్లో చెరువుల వద్ద కట్టిన భారీ నిర్మాణాలను హైడ్రా అధికారులు కూల్చేశారు. కొన్ని ప్రాంతాల్లో లోకల్ గా ఉండే లీడర్లు చెరువును పూడ్చేసి, నిర్మాణాలు చేసి, తాత్కాలికంగా షెడ్లు వేసి, ఆ తర్వాత పక్కా నిర్మాణాలు చేస్తున్నారని, వాటిని అద్దెకు ఇచ్చి ఆదాయం పొందుతున్నారని, ఇలాంటి వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేసేందుకు సిఫార్సు చేస్తామని హైడ్రా కమిషనర్ రంగనాథ్ హెచ్చరించారు. కొన్ని చోట్ల చెరువులు, నాలాలు, మూసీ నది పరిసర ప్రాంతాల్లో రాజకీయ నాయకుల అండదండలతో, స్థానికంగా ఉండే లీడర్లు అధికారులను మ్యానేజ్ చేయడం లేదా అధికారులను భయబ్రాంతులకు గురి చేసి వారిని అటువైపు రానీయకుండా చేసిన ఘటనలు ఉన్నాయి. ఇలాంటి వాటికి చెక్ పెట్టే విధంగా అటువంటి వ్యక్తులపై క్రిమినల్ కేసులు బుక్ చేసే విధంగా ఆలోచన చేస్తున్నట్లు రంగనాథ్ తెలిపారు. మాదాపుర్ సున్నం చెరువుకు సంబంధించిన ప్రాంతంలో గోపాల్ అనే వ్యక్తి ఈ విధమైన చర్యలకు పాల్పడ్డారని, ఆయనపై క్రిమినల్ కేసులు నమోదు చేయబోతున్నామని రంగనాథ్ ప్రకటించారు.

 

ట్రెండింగ్ వార్తలు