Maoist Narahari : మావోయిస్టు పార్టీకి భారీ షాక్.. డీజీపీ ఎదుట లొంగిపోయిన నరహరి దంపతులు.. రూ45 లక్షల చెక్
Maoist Narahari : తెలంగాణలో మావోయిస్టు పార్టీకి బిగ్ షాక్ తగిలింది. కీలక నేత నరహరి దంపతులు డీజీపీ ఎదుట లొంగిపోయారు.
- Dharani Pilli
- Updated on- May 26, 2026 / 04:30 PM IST
in telangana top maoist leader narahari and his wife surrenders in front of dgp cv anand
- తెలంగాణ మావోయిస్టు పార్టీకి భారీ షాక్
- డీజీపీ ఎదుట లొంగిపోయిన నరహరి దంపతులు
- గణపతి సైతం లొంగిపోవాలని పిలుపు
Maoist Narahari : ఇప్పటికే వరుస షాకులతో బలహీనంగా మారిన మావోయిస్టు పార్టీకి మరో ఎదురుదెబ్బ తగిలింది. తాజాగా మావోయిస్టు పార్టీకి చెందిన కీలక నేత, సెంట్రల్ కమిటీ మెంబర్ పసూనూరి నరహరి అలియాస్ సంతోష్.. తన భార్య మేదర దానమ్మ అలియాస్ లత అలియాస్ పూనమ్ అలియాస్ బోజాతో కలిసి మంగళవారం నాడు తెలంగాణ పోలీసుల ఎదుట లొంగిపోయారు. ఈ విషయాన్ని తెలంగాణ డీజీపీ సీవీ ఆనంద్ ధ్రువీకరించారు. నేడు డీజీపీ సీవీ ఆనంద్.. నరహరి దంపతుల లొంగుబాటు వివరాలను మీడియాకు వెల్లడించారు.
ఈ సందర్భంగా నరహరి మాట్లాడుతూ.. “సీఎం రేవంత్ రెడ్డి, డీజీపీ సీవీ ఆనంద్ గారికి నా కృతజ్ఞతలు. జార్ఖండ్, తెలంగాణ మరియు మిగతా ప్రాంతాల్లో పోరాట పరంగా అనేక నష్టాలు చూశాము. మావోల సాయుధ పోరాటం ఇప్పుడు కష్టంగా మారింది. తెలంగాణ ప్రభుత్వం కల్పించిన అవకాశాల కారణంగా ప్రజా జీవితంలోకి వచ్చాం. జార్ఖండ్‌లోని పీబీ మెంబర్స్, అలాగే కమిటీ మెంబర్ బిశ్రా అనుమతితోనే మేం బయటకు వచ్చాము’’ అని తెలిపారు.
*ఒక్క రూపాయి చెల్లించకుండా రూ.5లక్షలు ఉచిత బీమా.. అర్హులు వీరే.. అమల్లోకి ఎప్పటి నుంచంటే?
మరియు “తెలంగాణ ప్రజల హక్కుల సాధన చట్టపరంగానే జరగాలని భావిస్తున్నాం. తెలంగాణ ప్రభుత్వ సదుపాయాలు, సాయుధ పోరాటంలోని ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని.. గణపతిని సైతం ప్రజా జీవితంలోకి రావాలని కోరుతున్నాం’’ అన్నారు. ఇదిలా ఉంటే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వాసి అయిన నరహరి.. 45 ఏళ్లుగా అజ్ఞాతంలో ఉంటూ మావోయిస్ట్ పార్టీలో కీలక పాత్ర పోషించారని పోలీసులు వెల్లడించారు.
ఈ సందర్భంగా డీజీపీ సీవీ ఆనంద్ మాట్లాడుతూ.. దేశవ్యాప్తంగా ఇంకా 47 మంది మావోయిస్టులు అజ్ఞాతంలో ఉన్నట్లు గుర్తించామన్నారు. ఇందులో తెలంగాణకు చెందిన వారు ముగ్గురు, ఏపీకి చెందిన వారు ఒకరు, ఛత్తీస్‌గఢ్ 15, జార్ఖండ్ 13, ఒడిశాకు చెందిన వారు 15 మంది ఉన్నారని తెలిపారు. 2024 నుండి ఇప్పటివరకు 822 మంది సరెండర్ అయ్యారని, వారిలో 334 మంది ఆయుధాలతో తెలంగాణ పోలీసుల ముందు లొంగిపోయారని వివరించారు. తెలంగాణ పోలీసుల ముందు లొంగిపోయిన ఒడిశాకు చెందిన మావోయిస్టులను ఆ రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగించామన్నారు.
*నిరుద్యోగులకు శుభవార్త చెప్పిన మంత్రి నారా లోకేశ్.. త్వరలో మరో డీఎస్సీ.. జగన్‌కు స్ట్రాంగ్ కౌంటర్..
మన రాష్ట్రానికి చెందిన మావోయిస్టుల ప్రాంతాలకు త్వరలోనే స్వయంగా వెళ్లి వారిని కలుస్తానని డీజీపీ చెప్పారు. తెలంగాణకు చెందిన సెంట్రల్ కమిటీ మెంబెర్ ముప్పాళ లక్ష్మణరావు అలియాస్ గణపతి లొంగిపోవాలని ఈ సందర్భంగా డీజీపీ ఆనంద్ అప్పీల్ చేశారు. ఆయన లొంగిపోతే ప్రభుత్వం నుండి వచ్చే అన్ని బెనిఫిట్స్, సదుపాయాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఇంకా అజ్ఞాతంలో ఉన్న గణపతి, జాడే రత్నబాయి అలియాస్ సుజాత, వార్త శేఖర్ అలియాస్ మంగు లొంగిపోవాలని కోరారు. అలాగే నేడు లొంగిపోయిన నరహరిపై రూ.25 లక్షలు, ఆయన భార్య దానమ్మపై రూ.20 లక్షల రివార్డు ఉండగా.. ఆయా మొత్తాల చెక్కులను డీజీపీ వారికి అందజేశారు.
