Indian Railways: తెలుగు రాష్ట్రాల రైల్వే ప్రయాణీకులకు కేంద్రం గుడ్‌న్యూస్.. ఇక ఈ 3 స్పెషల్ రైళ్లు రెగ్యులర్‌ సర్వీసులుగా మార్పు

ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా రైల్వే శాఖ కొత్త రైలు సర్వీసులను ప్రారంభిస్తూ ఉంటుంది. 2014 నుంచి ఇప్పటివరకు హైదరాబాద్ కేంద్రంగా 91 కొత్త రైలు సర్వీసులు ప్రారంభించింది.

  • Published On : March 13, 2026 / 05:17 PM IST

Indian Railways Representative Image (Image Credit To Original Source)

  • మూడు స్పెషల్ రైళ్లు రెగ్యులర్ రైళ్లుగా మార్పు
  • ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని కీలక నిర్ణయం
  • హైదరాబాద్ మీదుగా నడుస్తున్న 3 స్పెషల్ రైళ్లు

Indian Railways: తెలుగు రాష్ట్రాల రైల్వే ప్రయాణీకులకు కేంద్రం మరో శుభవార్త చెప్పింది. హైదరాబాద్ మీదుగా నడిచే మూడు స్పెషల్ రైళ్లను రెగ్యులర్ రైళ్లుగా మారుస్తూ రైల్వేశాఖ నిర్ణయం తీసుకుంది. ఆ మార్గాలలో ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ప్రత్యేక రైళ్లను రెగులర్ సర్వీసులుగా మార్పు చేసింది. ఈ రైళ్లు ఆంధ్రప్రదేశ్ లోని రైల్వే స్టేషన్ల మీదుగా ప్రయాణం చేస్తాయి.

ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా రైల్వే శాఖ కొత్త రైలు సర్వీసులను ప్రారంభిస్తూ ఉంటుంది. 2014 నుంచి ఇప్పటివరకు హైదరాబాద్ కేంద్రంగా 91 కొత్త రైలు సర్వీసులు ప్రారంభించింది. ఈ రైళ్లన్నీ కూడా ప్రధానంగా హైదరాబాద్‌, సికింద్రాబాద్, కాచిగూడ, చర్లపల్లి స్టేషన్ల నుంచి నడుస్తున్నాయి. తాజాగా కొన్ని స్పెషల్ రైళ్లను ప్రయాణికుల డిమాండ్ మేరకు రెగ్యులర్ ట్రైన్లుగా మార్చింది.

కాచిగూడ-ట్యుటికోరిన్ ఎక్స్‌ప్రెస్

రైలు నెంబర్ 07191/07192 కాచిగూడ-మధురై స్పెషల్ రైలును ఇప్పుడు 17165/17166 కాచిగూడ-ట్యుటికోరిన్ ఎక్స్‌ప్రెస్‌గా మార్చారు. ఈ రైలు ప్రతి సోమవారం మధ్యాహ్నం 3 గంటలకు కాచిగూడలో బయలుదేరుతుంది. మంగళవారం రాత్రి 10గంటల 45 నిమిషాలకు ట్యుటికోరిన్ (కేరళ) చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో బుధవారం ఉదయం (7.45 గంటలు) బయలుదేరి గురువారం మధ్యాహ్నం (1.25 గంటలు) కాచిగూడ చేరుకుంటుంది.

హైదరాబాద్-కన్యాకుమారి ఎక్స్‌ప్రెస్

రైలు నెంబర్ 07230/07229 హైదరాబాద్-కన్యాకుమారి స్పెషల్ రైలును ఇప్పుడు 17069/17070 రెగ్యులర్ ఎక్స్‌ప్రెస్‌గా మార్చారు. ఈ రైలు గతంలోలానే ప్రతి బుధవారం సాయంత్రం 5గంటల 20 నిమిషాలకు హైదరాబాద్ నుంచి బయలుదేరి శుక్రవారం తెల్లవారుజామున 2గంటల 30 నిమిషాలకు కన్యాకుమారి (తమిళనాడు) చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో శుక్రవారం తెల్లవారుజామున 5 గంటల 15 నిమిషాలకు కన్యాకుమారిలో బయలుదేరి శనివారం మధ్యాహ్నం 2 గంటల 30 నిమిషాలకు హైదరాబాద్ చేరుకుంటుంది.

చర్లపల్లి-షాలిమార్ అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్

రైలు నెంబర్ 07225/07226 చర్లపల్లి-షాలిమార్ స్పెషల్ రైలును ఇప్పుడు 17065/17066 అమృత్ భారత్ ఎక్స్ ప్రెస్ గా మార్చారు. ఈ రైలు ప్రతి మంగళవారం ఉదయం 7గంటల 15 నిమిషాలకు చర్లపల్లి నుంచి బయలుదేరి బుధవారం ఉదయం 11 గంటల 20 నిమిషాలకు షాలిమార్‌ (వెస్ట్ బెంగాల్) రైల్వే స్టేషన్‌కు (పశ్చిమ బెంగాల్) చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో బుధవారం మధ్యాహ్నం 12గంటల 50 నిమిషాలకు షాలిమార్ లో బయలుదేరి మరుసటి రోజు గురువారం రాత్రి 7 గంటలకు చర్లపల్లికి చేరుకుంటుంది.

మూడు స్పెషల్ రైళ్లను రెగ్యులర్ సర్వీసులుగా మారుస్తూ రైల్వే శాఖ తీసుకున్న నిర్ణయంపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ప్రధాని మోదీ, రైల్వేశాఖ మంత్రికి ఆయన ధన్యవాదాలు తెలిపారు. మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో రైల్వేల అభివృద్ధికి, ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడానికి చిత్తశుద్ధితో పని చేస్తోందని తెలిపారు. ”ప్రయాణికుల నుంచి వచ్చిన డిమాండ్ కు అనుగుణంగా రైల్వే శాఖ సేవలు విస్తరిస్తోంది. మూడు స్పెషల్ ట్రైన్స్‌ను రెగ్యులర్ ట్రైన్స్‌గా మారుస్తూ భారతీయ రైల్వే నిర్ణయం తీసుకుంది. దీని వల్ల రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు మేలు జరగనుంది” అని కిషన్ రెడ్డి తెలిపారు. ఇప్పటికే తెలంగాణ నుంచి 5 వందే భారత్ రైళ్లు, 4 అమృత్ భారత్ రైళ్లు సేవలు అందిస్తున్నాయని కిషన్ రెడ్డి తెలిపారు. రానున్న రోజుల్లో మరిన్ని అధునాతన రైళ్లు, రద్దీ ఉన్న మరిన్ని కొత్త మార్గాలకు రైలు సర్వీసులు అందుబాటులో తీసుకొస్తామన్నారు.

Also Read: గ్యాస్ బుక్ చేస్తున్నారా..? అయితే, మీకు బిగ్‌అలర్ట్.. ఈ విషయాలు తెలుసుకోండి.. కొత్త రూల్స్ వచ్చాయ్!