Inter Students : ఇంటర్ విద్యార్థులకు శుభవార్త.. కొత్త స్కీంలు వచ్చేస్తున్నాయ్..! వచ్చే విద్యా సంవత్సరం నుంచే అమల్లోకి..?

Inter Students : ప్రభుత్వ కళాశాలల్లో చదివే ఇంటర్ విద్యార్థులకోసం వచ్చే విద్యా సంవత్సరం నుంచి రెండు కొత్త పథకాలను అమల్లోకి తీసుకొచ్చేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధమైంది.

intermediate students

  • ప్రభుత్వ కాలేజీల్లో అడ్మీషన్లు పెంచేందుకు విద్యాశాఖ దృష్టి
  • ఇంటర్ చదివే దివ్యాంగ విద్యార్థులకు స్కూటీలు
  • ప్రతిభావంతులైన విద్యార్థినులకు స్కాలర్ షిప్‌లు
  • ప్రభుత్వానికి ఇంటర్ విద్యాశాఖ ప్రతిపాదనలు
  • వచ్చే విద్యా సంవత్సరం నుంచి అమల్లోకి వచ్చే చాన్స్

Inter Students : ప్రభుత్వ కళాశాలల్లో చదివే ఇంటర్ విద్యార్థులకోసం రెండు కొత్త పథకాలను ప్రవేశపెట్టేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధమైంది. ఈ మేరకు ఇంటర్ విద్యాశాఖ రేవంత్ రెడ్డి సర్కార్‌కు కీలక ప్రతిపాదనలు చేసింది. వచ్చే విద్యా సంవత్సరం నుంచి కొత్త పథకాలను అమల్లోకి వచ్చే అవకాశం ఉంది.

Also Read : Kuldeep Yadav Wedding : భారత క్రికెటర్ కుల్దీప్ యాదవ్ పెండ్లి ఫొటోలు వైరల్.. క్రికెటర్లు ఎవరెవరు హాజరయ్యారంటే..?

రాష్ట్ర వ్యాప్తంగా 430 ప్రభుత్వ కళాశాలలు ఉన్నాయి. వీటిల్లో 1.72లక్షల మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. ప్రభుత్వ కాలేజీల్లో అడ్మీషన్లు పెరిగేందుకు ప్రభుత్వం అందిస్తున్న సహకారంతో ఇంటర్ విద్యాశాఖ ప్రత్యేక దృష్టి సారించింది. దీంతో ఈ విద్యా సంవత్సరంలో గతేడాదితో పోలిస్తే 11వేల అడ్మిషన్లు పెరిగాయి. వచ్చే విద్యా సంవత్సరం నుంచి ప్రభుత్వ కాలేజీల్లో అడ్మిషన్లు మరింతగా పెంచేందుకు ఇంటర్ విద్యాశాఖ ప్రత్యేక చర్యలు తీసుకుంటుంది. ఇందులో భాగంగా ప్రభుత్వాకి కీలక ప్రతిపాదనలు చేసింది.

రాష్ట్రంలోని ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో చదువుతున్న దివ్యాంగ, ట్రాన్స్‌జెండర్ అండగా నిలవడంతోపాటు.. ప్రతిభావంతులైన విద్యార్థినులకోసం ఇంటర్ విద్యాశాఖ రెండు కొత్త స్కీంలు అమలు చేయాలని భావిస్తోంది. ఈ మేరకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించింది. రేవంత్ సర్కార్ సైతం అందుకు సముఖత వ్యక్తం చేసినట్లు తెలిసింది. ఈ పథకాలు అమల్లోకి వస్తే ప్రభుత్వ కాలేజీల్లో అడ్మిషన్లు పెరిగే అవకాశం ఉందని ఇంటర్ విద్యాశాఖ భావిస్తోంది.

అర్హులైన దివ్యాంగ విద్యార్థులకు ప్రత్యేకంగా రూపొందించిన స్కూటీలను పంపిణీ చేయాలని అధికారులు యోచిస్తున్నారు. తద్వారా విద్యార్థులు ఇతరులపై ఆధారపడకుండా కాలేజీలకు వచ్చేందుకు అవకాశం ఉంటుంది. తొలుత వెయ్యి మంది విద్యార్థులకు స్కూటీలు ఇవ్వాలని ప్రభుత్వానికి ఇంటర్ విద్యాశాఖ ప్రతిపాదిందించి. ఒక్కో వాహనానికి రూ.50వేల చొప్పున మొత్తం రూ.5కోట్లు కేటాయించాలని ప్రభుత్వాన్ని కోరింది. వీరితోపాటు ట్రాన్స్ జెండర్ విద్యార్థులకూ ఈ స్కీంను వర్తింపజేయాలని అధికారులు భావిస్తున్నారు.

సర్కార్ కాలేజీల్లో మెరిట్ విద్యార్థినులకోసం కొత్తగా స్కాలర్ షిప్ స్కీం తీసుకురావాలని ఇంటర్ విద్యాశాఖ ఆలోచన చేస్తోంది. సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థినులు ఉన్నత విద్యను మధ్యలోనే ఆపేకుండా ప్రోత్సహించడమే ఈ పథకం ప్రధాన ఉద్దేశమని అధికారులు చెబుతున్నారు. ఈ పథకంలో భాగంగా.. టెన్త్‌లో వచ్చే మార్కుల ఆధారంగా 40వేల మందికి రూ.2500 చొప్పున స్కాలర్ షిప్ ఇవ్వాలని భావిస్తున్నారు. ఇందుకు 10 కోట్ల బడ్జెట్ కావాలని ఇంటర్ విద్యాశాఖ రేవంత్ సర్కార్ కు ప్రతిపాదనలు పంపించింది. రేవంత్ సర్కార్ ఇప్పటికే ఈ పథకాల అమలుకు సూచన ప్రాయంగా ఆమోదం తెలిపినట్లు సమాచారం. సర్కార్ గ్రీన్‌సిగ్నల్ ఇస్తే ఈ పథకాలు వచ్చే విద్యా సంవత్సరంలో ప్రారంభించనున్నారు.