Anirudh Reddy – Pawan Kalyan: తెలంగాణతో మీకేం పని? క్షమాపణ చెప్పాకే సభ పెట్టాలి- పవన్ కల్యాణ్ పై ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి ఫైర్

ఆంధ్ర ఉద్యోగులు తెలంగాణలో స్వర్గంలో ఉన్నట్టు ఉన్నారు. ఏపీలో మన ఉద్యోగులు కష్టపడుతున్నారు. టీటీడీ హుండీలో ఎక్కువ డబ్బులు వేసేది తెలంగాణ వాళ్లవే.

  • Updated on- June 1, 2026 / 04:47 PM IST

Anirudh Reddy – Pawan Kalyan: తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేళ జనసేనాని పవన్ కల్యాణ్ హైదరాబాద్ లో నిర్వహించ తలపెట్టిన తెలంగాణ నవ నిర్మాణ సభ రాజకీయ దుమారం రేపుతోంది. పవన్ కల్యాణ్ పై తెలంగాణ నాయకులు ఫైర్ అవుతున్నారు. అధికార, విపక్ష నేతలు విరుచుకుపడుతున్నారు. ఆంధ్రా నాయకులకు తెలంగాణతో ఏం పని అని ప్రశ్నిస్తున్నారు. మీ రాజకీయాలు ఆంధ్రాలోనే చేసుకోండి తెలంగాణ జోలికి రావొద్దని వార్నింగ్ లు ఇస్తున్నారు. ఇప్పటికే పవన్ కల్యాణ్ కు తెలంగాణ రక్షణ సేన చీఫ్ కవిత వార్నింగ్ ఇచ్చారు.

కాంగ్రెస్ నేత, జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి సైతం పవన్ పై ఫైర్ అయ్యారు. తెలంగాణ ప్రజల కన్ను నరదిష్టి అన్న పవన్ కళ్యాణ్ కి తెలంగాణతో ఏం పని? అని అనిరుధ్ రెడ్డి ప్రశ్నించారు. పవన్ కళ్యాణ్ సభ విషయంలో మాకు అభ్యంతరం లేదన్న అనిరుధ్ రెడ్డి.. సభ ఎవరైనా ఎక్కడైనా పెట్టుకోవచ్చన్నారు. అయితే, గతంలో తెలంగాణ ప్రజలను అవమానించిన విషయంలో కచ్చితంగా పవన్ కల్యాణ్ క్షమాపణ చెప్పాల్సిందేనని డిమాండ్ చేశారు. తెలంగాణ వాళ్లవి దిష్టి కళ్లు, మీ కళ్ల వల్లే కోనసీమలో కొబ్బరి చెట్లన్నీ చచ్చిపోయాయి అన్నందుకు పవన్ క్షమాపణ చెప్పాలన్నారు. తెలంగాణ వాళ్లను చిన్న చూపు చూసిన పవన్.. తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాకే సభ పెట్టాలని తేల్చి చెప్పారు.

దేశంలో ఎవరైనా పార్టీ పెట్టుకోవచ్చు. నేను కూడా తమిళనాడులో పార్టీ పెట్టొచ్చు. కానీ నాకు తమిళ్ రాదే. ప్రొఫెసర్ నాగేశ్వర్ విషయంలో నేను అరెస్ట్ చేయొద్దని చెప్పాను అని పవన్ అంటున్నారు. పవన్ కళ్యాణ్ చెప్పినట్టే పోలీసులు వింటున్నారా? ఏపీ నేతలు తెలంగాణపై విద్వేషం చిమ్ముతుంటే .. బీఆర్ఎస్ నాయకులు ఎందుకు మాట్లాడటం లేదు? వచ్చే ఎన్నికల్లో ఆంధ్రా పార్టీలతో బీఆర్ఎస్ పొత్తు పెట్టుకుంటుందని క్లారిటీ ఇస్తున్నారు.

ఉద్యోగుల విభజనలో ఏపీలో ఉన్న తెలంగాణ వాళ్లను ఇక్కడికి పంపండి. ఆంధ్ర ఉద్యోగులు తెలంగాణలో స్వర్గంలో ఉన్నట్టు ఉన్నారు. ఏపీలో మన ఉద్యోగులు కష్టపడుతున్నారు. కొండగట్టుకు డబ్బులు టీటీడీ నుంచి ఇచ్చారు. పవన్ జేబులో నుంచి ఇవ్వలేదు. టీటీడీ హుండీలో ఎక్కువ డబ్బులు వేసేది తెలంగాణ వాళ్లవే. పవన్ సభపై బీజేపీ, బీఆర్ఎస్ మౌనం వెనుక రాజకీయ కారణం ఉంది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన, బీజేపీ, బీఆర్ఎస్ కలిసి పోటీ చేస్తాయి” అని అనిరుధ్ రెడ్డి ఆరోపించారు.

Also Read: మా జోలికి వస్తే మూతి పళ్లు రాలతాయి..!- పవన్ కల్యాణ్‌కు కవిత వార్నింగ్..