×
Ad

Jagital Municipality : జీవన్ రెడ్డికి షాకిచ్చిన కాంగ్రెస్ అధిష్టానం.. జగిత్యాల చైర్‌పర్సన్ పీఠం సంజయ్ వర్గానికే..

Jagital Municipality : జగిత్యాల మున్సిపాలిటీలో చైర్‌పర్సన్ పీఠం విషయంపై కాంగ్రెస్ పార్టీలో సయోధ్య కుదిరింది. చైర్ పర్సన్ పీఠంను ఎమ్మెల్యే సంజయ్ వర్గానికి అప్పగిస్తూ కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయం తీసుకుంది.

Jagtial Municipality

  • జగిత్యాల మున్సిపాలిటీ చైర్‌పర్సన్ ఎన్నికలో ఉత్కంఠకు తెర
  • అధిష్టానం పెద్దలు రంగంలోకి.. వెనక్కు తగ్గిన జీవన్ రెడ్డి
  • సంజయ్ కుమార్ వర్గానికే చైర్‌పర్సన్ పదవి

Jagital Municipality : జగిత్యాల మున్సిపల్ చైర్‌పర్సన్ పీఠం కోసం కాంగ్రెస్ పార్టీలోని రెండు వర్గాలు తీవ్రంగా ప్రయత్నాలు చేసిన విషయం తెలిసిందే. కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్ రెడ్డి, ఎమ్మెల్యే సంజయ్ కుమార్‌లు తమ వర్గానికి చెందిన వారికే చైర్మన్ పదవి ఇవ్వాలని పట్టుబట్టారు. దీంతో కాంగ్రెస్ పెద్దలు రంగంలోకి వారి మధ్య సయోధ్య కుదర్చేందుకు చర్చలు జరిపారు. చివరికి కాంగ్రెస్ అధిష్టానం ఆ పార్టీ సీనియర్ నేత జీవన్ రెడ్డికి బిగ్ షాకిచ్చింది. జగిత్యాల చైర్మన్ పీఠం సంజయ్ వర్గానికే కట్టబెడుతూ నిర్ణయించింది.

Also Read : Karimnagar Mayor : కాంగ్రెస్‌‌ను దెబ్బకొట్టిన బీఆర్ఎస్.. కరీంనగర్ మేయర్ బీజేపీకే?

జగిత్యాల మున్సిపాలిటీలో మొత్తం 50 వార్డులు ఉండగా చైర్‌పర్సన్‌ను ఎన్నుకోవాలంటే కనీసం 25 మంది కౌన్సిలర్ల మద్దతు అవసరం. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ 23 చోట్ల, స్వతంత్రులు 15 చోట్ల గెలుపొందారు. బీజేపీ ఆరు, బీఆర్ఎస్ నాలుగు, ఎంఐఎం రెండు స్థానాలు గెలుచుకుంది.

కాంగ్రెస్‌లో ఎమ్మెల్యే సంజయ్ కుమార్ వర్గం నుంచి 33 మంది పోటీ చేయగా 14మంది, మాజీ మంత్రి జీవన్ రెడ్డి వర్గం నుంచి 17 మంది పోటీ చేయగా తొమ్మిది మంది విజయం సాధించారు. స్వతంత్రుల్లో తొమ్మిది మంది జీవన్ రెడ్డి వర్గం కాగా.. నలుగురు ఎమ్మెల్యే వర్గీయులు, ముగ్గురు బీజేపీ రెబల్స్ ఉన్నారు.

ఈ క్రమంలో చైర్మన్ పీఠం కోసం జీవన్ రెడ్డి, సంజయ్ కుమార్ పోటీ పడ్డారు. దీంతో కాంగ్రెస్ పార్టీ అధిష్టానం పెద్దలు రంగంలోకి దిగారు. జీవన్ రెడ్డితో పలు దఫాలుగా చర్చలు జరిపారు. ఈ చర్చల్లో భాగంగా సంజయ్ వర్గానికి చైర్‌పర్సన్ పదవి అప్పగించేందుకు నిర్ణయించారు.

జగిత్యాల మున్సిపల్ చైర్ పర్సన్ గా సంజయ్ వర్గానికి చెందిన సమిండ్ల వాణిని కాంగ్రెస్ అధిష్టానం ఎంపిక చేసింది. భవిష్యత్తులో జడ్పీటీసీ, మార్కెట్ కమిటీ పదవుల విషయంలో ప్రాధాన్యత కల్పిస్తామని కాంగ్రెస్ పార్టీ పెద్దలు జీవన్ రెడ్డికి హామీ ఇవ్వడంతో ఆయన వెనక్కు తగ్గినట్లు తెలిసింది. దీంతో గత రెండు రోజులుగా జీవన్ రెడ్డి వర్సెస్ సంజయ్ కుమార్ మధ్య జరుగుతున్న వార్ లో పార్టీ పెద్దలతో సహకారంతో సంజయ్ కుమార్ పంతం నెగ్గించుకున్నట్లయింది.