Karimnagar Mayor : కాంగ్రెస్‌ను దెబ్బకొట్టిన బీఆర్ఎస్.. కరీంనగర్ మేయర్ పీఠం బీజేపీ కైవసం
Karimnagar Mayor : కరీంనగర్ మేయర్ పీఠాన్ని బీజేపీ కైవసం చేసుకుంది. మేయర్‌గా కొలగాని శ్రీనివాస్, డిప్యూటీ మేయర్‌గా సునీల్ రావు ఎన్నికయ్యారు.
Karimnagar Mayor
- కరీంనగర్ మేయర్ పీఠం బీజేపీ కైవసం
- మేయర్‌గా కొలగాని శ్రీనివాస్
- డిప్యూటీ మేయర్‌గా సునీల్ రావు ఎన్నిక
Karimnagar Mayor : కరీంనగర్ బల్దియాలో నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. కాంగ్రెస్ పార్టీకి బీఆర్ఎస్ బిగ్ షాకిచ్చింది. మేయర్ ఓటింగ్ ప్రక్రియకు బీఆర్ఎస్ దూరంగా ఉంది. దీంతో కరీంనగర్ మేయర్ స్థానంపై పాగావేయాలని భావించిన కాంగ్రెస్ ఆశలు అడియాశలయ్యాయి. కార్పొరేషన్లో అత్యధిక స్థానాలు గెలుచుకున్న బీజేపీ మేయర్ స్థానంను దక్కించుకుంది. కరీంనగర్ కార్పొరేషన్ మేయర్ గా కొలగాని శ్రీనివాస్, డిప్యూటీ మేయర్ గా సునీల్ రావు ఎన్నికయ్యారు.
కరీంనగర్ బల్దియాలో రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. మేయర్ పీఠాన్ని దక్కించుకునేందుకు బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు హోరాహోరీగా ప్రయత్నాలు చేస్తున్నాయి. ఈ కార్పొరేషన్లో మొత్తం 66 డివిజన్లలో 30 స్థానాలు గెలుచుకుని మేజిక్ ఫిగర్ సాధించామని, తమకు నలుగురు స్వతంత్రులు తోడుగా ఉన్నారని, ఎక్స్ అఫీసియో ఓటు కింద ఎంపీ ఉన్నారని మొత్తం 35 సీట్ల బలం ఉందని బీజేపీ పేర్కొంటుంది.
అయితే, రాత్రికిరాత్రే బీజేపీ శిబిరంలో ఉన్న కార్పొరేటర్ ఒకరు కాంగ్రెస్ శిబిరంలో వెళ్లినట్లు సమాచారం. మరోవైపు.. కాంగ్రెస్, బీఆర్ఎస్ ఏకమై బీజేపీకి మేయర్ పదవి దూరం చేయాలని భావించాయి. ఈ క్రమంలో కాంగ్రెస్ 14, బీఆర్ఎస్ తొమ్మిది, మజ్లిస్ మూడు, ఏఐఎఫ్బీ ఇద్దరు, స్వతంత్రులు నలుగురు, ఎక్స్ అఫీసియో ఇద్దరు కలిపి తమకు 34 బలముందని కాంగ్రెస్ చెబుతూ వచ్చింది. అయితే, తాజాగా పరిణామాల నేపథ్యంలో బీఆర్ఎస్ ఓటింగ్ కు దూరంగా ఉండాలని నిర్ణయించడంతో కాంగ్రెస్ పార్టీకి గట్టి షాకిచ్చినట్లయింది.
బీఆర్ఎస్ మేయర్ ఎన్నికకు దూరంగా ఉంటే మిగిలిన 59మంది సభ్యులు సభకు హాజరయ్యే అవకాశం ఉంది. 31మంది సభ్యుల ఓటింగ్ బీజేపీకి పడితే బీజేపీ మేయర్ పీఠాన్ని కైవసం చేసుకుంటుంది. ఇప్పటికే ఆ మేరకు బీజేపీకి బలం ఉంది. బీఆర్ఎస్ మద్దతు లేకుండా కాంగ్రెస్ పార్టీ మేయర్ పీఠాన్ని దక్కించుకునే అవకాశం లేదు. బీఆర్ఎస్ ఓటింగ్ కు దూరంగా ఉండాలని నిర్ణయించిన నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ సభ్యులు మేయర్ ఓటింగ్ లో పాల్గొంటారా లేదా అనేది ఆసక్తికరంగా మారింది. మొత్తానికి కరీంనగర్ మేయర్ స్థానాన్ని దక్కించుకునే క్రమంలో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ఎత్తుకు పైఎత్తులు వేస్తున్నాయి. బీఆర్ఎస్ సభ్యులు ఎన్నికకు హాజరుకాకుంటే బీజేపీ మేయర్ పీఠాన్ని దక్కించుకోవటం లాంఛనంగా మారింది.
ఇప్పటికే కరీంనగర్ కార్పొరేషన్‌కు మేయర్ అభ్యర్థిగా కొలగాని శ్రీనివాస్, డిప్యూటీ మేయర్ అభ్యర్థిగా సునీల్‌రావును బీజేపీ ఖరారు చేసింది. ఈ మేరకు ఎన్నికల అధికారికి ఆ పార్టీ ప్రతిపాదించింది.
