Pawan Kalyan : అటు సభకు నో పర్మిషన్.. ఇటు తెలంగాణ ఆవిర్భావం వేళ పవన్ కామెంట్స్.. ‘ఈ నేల నుంచే..’
Pawan Kalyan : తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం వేళ రాష్ట్ర రాజకీయాలు ఒక్కసారిగా హీటెక్కాయి. జనసేన ఆధ్వర్యంలో హైదరాబాద్ నగరంలో తలపెట్టిన సభకు ప్రభుత్వం అనుమతి నిరాకరించింది. ఈ నిర్ణయాన్ని జనసేన పార్టీ నేతలు తప్పుబడుతున్నారు. ఈ క్రమంలోనే తాజా పరిణామాలపై ఇవాళ సాయంత్రం మీడియా సమావేశంలో మాట్లాడతానని పవన్ కల్యాణ్ ట్వీట్ చేశారు.
- Harish Thanniru
- Updated on- June 2, 2026 / 12:00 PM IST
Pawan Kalyan
Pawan Kalyan : తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం వేళ రాష్ట్ర రాజకీయాలు ఒక్కసారిగా హీటెక్కాయి. ఏపీ ఉపముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ మంగళవారం హైదరాబాద్‌లో ‘తెలంగాణ నవ నిర్మాణ సంకల్ప సభ’ను నిర్వహించేందుకు నిర్ణయించారు. ఈ మేరకు జనసేన శ్రేణులు ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. అయితే, తెలంగాణలో పవన్ కల్యాణ్ సభ నిర్వహణకు పలు పార్టీలు, పలువురు తెలంగాణ వాదులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే తెలంగాణ నవ నిర్మాణ సంకల్ప సభకు పోలీసులు అనుమతి నిరాకరించడం చర్చనీయాంశంగా మారింది. శాంతి భద్రతల సమస్య తలెత్తవచ్చునన్న కారణంగా సభ నిర్వహణకు పోలీసులు అనుమతి ఇవ్వలేదని తెలిసింది.. పోలీసుల నిర్ణయాన్ని జనసేన కార్యకర్తలు తప్పుబడుతున్నారు.
Also Read : Janasena Peddi : ఇటు జనసేన మీటింగ్ అటు పెద్ది ఈవెంట్.. ఒకేసారి బాబాయ్ అబ్బాయి..
సభకు అనుమతి నిరాకరిస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై జనసేన పార్టీ కోర్టును ఆశ్రయించింది. ఇదే సమయంలో తాజా పరిణామాలపై మాట్లాడేందుకు పవన్ కల్యాణ్ సిద్ధమయ్యారు. జూబ్లీహిల్స్ లోని తన నివాసంలో మీడియా సమావేశం నిర్వహించేందుకు సిద్ధమయ్యారు. సాయంత్రం 4.30గంటల నుంచి 5.30 గంటల మధ్యలో జూబ్లీహిల్స్ లోని తన నివాసంలో మీడియా సమావేశం ఏర్పాటు ఉంటుందని పవన్ తన ట్విటర్ వేదికగా ప్రకటించారు. ప్రెస్‌మీట్‌కు అయినా అనుమతి ఇస్తారా..? లేదా? అని పవన్ ట్వీట్‌లో పేర్కొన్నారు. మీడియా సమావేశంలో కీలక అంశాలపై పవన్ స్పందించే అవకాశం ఉంది. తెలంగాణ రాజకీయాల్లో జనసేన భవిష్యత్ కార్యాచరణపై పవన్ ప్రకటించే అవకాశం ఉంది.
సభకు అనుమతి ఇవ్వకపోవడంపై జనసేన కార్యకర్తలు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. ఇదే సమయంలో జనసేన పార్టీ అధిష్టానం సభ నిర్వహణకు అనుమతి ఇవ్వాలంటూ కోర్టును ఆశ్రయించింది. ఈ అంశంపై కోర్టు ఎలాంటి తీర్పు ఇస్తుందనే అంశంపై ఉత్కంఠ నెలకొంది.
జనసేన ఊపిరులూదుకొన్నది తెలంగాణ గడ్డపైనే : పవన్
మరోవైపు.. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం వేళ జనసేన అధినేత పవన్ కల్యాణ్ రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. మూడున్నర కోట్ల మంది ప్రజల ఆశలు.. ఆకాంక్షలతో.. యువత బలిదానాలతో సిద్ధించిన రాష్ట్రం తెలంగాణ. ప్రత్యేక రాష్ట్రంగా ఆవిర్భవించి పుష్కర కాలం పూర్తయిన సందర్భంగా యావత్ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు హృదయపూర్వక శుభాకాంక్షలు అని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. జనసేన ఊపిరులూదుకొన్నది తెలంగాణ గడ్డపైనే. ఈనేల నుంచే వారసత్వంగా పోరాట పటిమను పుణికి పుచ్చుకున్నది. అణగారిన వర్గాల సంక్షేమం.. యువత ఆకాంక్షలు.. వ్యక్తి స్వేచ్ఛకు విఘాతం కలిగితే – గళం వినిపించే తెగువ తెలంగాణలో ఉంది. అటువంటి లక్షణం జనసేన శ్రేణుల్లోనూ నిండుగా ఉంది. ఘనమైన చారిత్రక, సాంస్కృతిక వారసత్వ సంపద విలసిల్లే తెలంగాణ రాష్ట్రం సమున్నతంగా అభివృద్ధి చెందాలని ఆకాంక్షిస్తున్నాను. తెలంగాణ కోసం బలిదానం చేసిన ప్రతి ఒక్కరికీ అంజలి ఘటిస్తున్నాను పవన్ పేర్కొన్నారు.
