Jeevan Reddy Representative Image (Image Credit To Original Source)
Jeevan Reddy: తెలంగాణ మున్సిపల్ ఎన్నికల టికెట్ల వ్యవహారం జగిత్యాల కాంగ్రెస్ లో చిచ్చు పెట్టింది. టికెట్ల వ్యవహారంపై జగిత్యాల కాంగ్రెస్ నేతలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మొత్తం 50 వార్డుల్లో 30 ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కి, 20 వార్డులు జీవన్ రెడ్డికి కేటాయించంతో మరోసారి ఇద్దరు నేతల మధ్య పంచాయితీ భగ్గుమంది. పార్టీ నిర్ణయంపై జీవన్ రెడ్డి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. దీంతో ఆయన ఏ నిర్ణయం తీసుకుంటారో అనే దానిపై ఉత్కంఠ నెలకొంది. కండువా మోసిన కార్యకర్తలకు మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బీఫామ్ లు ఇవ్వలేదంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బీఆర్ఎస్ నుంచి వచ్చిన నాయకులకు కాంగ్రెస్ బీఫామ్ లు ఇచ్చారని ఆరోపించారు.
మరోవైపు జగిత్యాల మున్సిపల్ ఎన్నికల టికెట్ల పంపిణీలో ఎమ్మెల్యే సంజయ్ వైపు అధిష్టానం మొగ్గు చూపినట్లు తెలుస్తోంది. దీంతో ఎమ్మెల్యే సంజయ్ కాంగ్రెస్ కార్యకర్తల కడుపు కొట్టారంటూ ఆయనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎమ్మెల్యే సంజయ్ ఇంటిని ముట్టడిస్తామని కాంగ్రెస్ కార్యకర్తలు హెచ్చరించారు. దీంతో ఎమ్మెల్యే సంజయ్ క్యాంప్ ఆఫీస్ దగ్గర భద్రత పెంచారు. అటు మాజీమంత్రి జీవన్ రెడ్డి ఇంటికి కాంగ్రెస్ కార్యకర్తలు పెద్దఎత్తున చేరుకుంటున్నారు.
”దశాబ్ద కాలంగా కాంగ్రెస్ జెండా మోసిన వారే నిజమైన కాంగ్రెస్ కార్యకర్త. అన్యాయానికి గురైతే నేను నోరు మెదపొద్దా? నిజమైన కాంగ్రెస్ కార్యకర్తకి టికెట్ వస్తే నేను వ్యతిరేకంగా ప్రచారం చెయ్యను. సింబల్ కేవలం ఐడెంటిటీ మాత్రమే. కార్యకర్తల కోసం ఇంటింటికి తిరిగి ప్రచారం చేస్తాను. కాంగ్రెస్ లో ఉన్నది ఒకే పడవ. కాలమే సమస్యని పరిష్కరిస్తుంది. నాకు అన్యాయం జరిగితే భరించాను. కార్యకర్తకి అన్యాయం జరిగితే సహించను. గుర్తుతో సంబంధం లేకుండా.. కాంగ్రెస్ కార్యకర్త పోటీ చేస్తే.. ప్రచారం నిర్వహిస్తా” అని జీవన్ రెడ్డి తేల్చి చెప్పారు.
కేవలం 20 మంది అభ్యర్థుల పేర్లనే కాంగ్రెస్ కార్యకర్తలను ప్రకటించారని మాజీమంత్రి జీవన్ రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు. జగిత్యాల బీఆర్ఎస్ ఎమ్మెల్యే చెప్పిన విధంగా మున్సిపల్ కౌన్సిలర్ అభ్యర్థుల జాబితా రూపొందించడమేంటి..? అని ఆయన ప్రశ్నించారు. కార్యకర్తలు దశాబ్దాల నుంచి పార్టీని పట్టుకుని ఉంటే, వారికి కాక ఇంకొకరిని తీసుకొచ్చి బీ ఫామ్స్ ఇవ్వడమేంటి..? అని వాపోయారు. కార్యకర్తల అభిప్రాయం మేరకు మేం జాబితా తయారు చేస్తే, అందుకు భిన్నంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యే నిర్ణయం మేరకు అభ్యర్థులను ప్రకటించడమేంటి..? అని నిలదీశారు.
”జెండా మోసిన కార్యకర్తల ఆవేదనకు ఎవరు బాధ్యత వహిస్తారు..? ఎంత సీనియర్ నాయకుడైనా క్రమశిక్షణ ఉల్లంఘిస్తే చర్యలంటూ ఎమ్మెల్సీ బల్మూర్ వెంకట్ మాట్లాడతాడు. ఇంతకు ఎవరు క్రమశిక్షణ ఉల్లంఘిస్తున్నదో ఇప్పుడు ఆయనే చెప్పాలి. అఖిల భారత కాంగ్రెస్ నాయకులు జగిత్యాల పరిణామాలు పరిశీలించాలని డిమాండ్. జీవితంలో కాంగ్రెస్ జెండా మోయనోళ్లకు బీఫామ్స్ ఇస్తారా? రాయికల్ లోనూ కాంగ్రెస్ తో సంబంధం లేని వాళ్లకి బీఫామ్స్ ఇచ్చారు. గాంధీభవన్ లోకి బీఆర్ఎస్ ఎమ్మెల్యే అనుమతిని నేను ప్రశ్నించానని నాపై కోపముంటే నాపై చర్యలు తీసుకోవాలి. కానీ కార్యకర్తలపై ఆ కోపమేంటి..?” అని జీవన్ రెడ్డి నిలదీశారు.
Also Read: బూడిదలో పోసిన పన్నీరు..! మంత్రి గారు ఒకటి తలిస్తే మరొకటి జరిగిందా? మేడారం జాతరలో ఎందుకిలా