Kalvakuntla Kavitha: భూములపై సీబీఐ విచారణకు సిద్దమే.. మీరు సిద్ధమా.. సీఎం రేవంత్ కు కవిత సంచలన సవాల్!
అసెంబ్లీ సాక్షిగా సీఎం రేవంత్ రెడ్డి చేసిన ఆరోపణలపై తెలంగాణ రక్షణ సేన పార్టీ అధ్యక్షురాలు కవిత(Kalvakuntla Kavitha) తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
- V Santhosh Kumar
- Updated on- September 16, 2026 / 05:44 PM IST
Kalvakuntla kavitha demands cbi inquiry on 22a lands rejects cm revanth reddy allegations
- రేవంత్ వ్యాఖ్యలపై కవిత ఫైర్
- సీబీఐ విచారణకు తీవ్ర డిమాండ్
- అదనపు భూమి ఉంటే సరెండర్
Kalvakuntla Kavitha: తెలంగాణ శాసనసభలో 22ఏ నిషేధిత భూములపై జరిగిన వేడివేడి చర్చ తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర తుఫాను రేపుతోంది. అసెంబ్లీ సాక్షిగా సీఎం రేవంత్ రెడ్డి చేసిన ఆరోపణలపై తెలంగాణ రక్షణ సేన పార్టీ అధ్యక్షురాలు కవిత(Kalvakuntla Kavitha) తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. సిద్ధిపేట జిల్లాలో కవిత, ఆమె భర్త పేరిట 37.26 ఎకరాల భూమి ఉందంటూ సీఎం రేవంత్ అసెంబ్లీలో తప్పుడు సమాచారం ఇచ్చారని, శాసనసభ వేదికగా ఆయన పచ్చి అబద్ధాలు మాట్లాడారని ఆమె ధ్వజమెత్తారు. ముఖ్యమంత్రి ప్రకటనను ఖండిస్తూ సోషల్ మీడియా వేదికగా ఆమె సంచలన సవాల్ విసిరారు.
సీబీఐ విచారణకు కవిత డిమాండ్:
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీలో ప్రస్తావించిన నవీన్ రావు, కొండల్ రావు, గంగుల కమలాకర్, ఎర్రబెల్లి దయాకర్ రావు, జగదీశ్ రెడ్డి, పల్లా రాజేశ్వర్ రెడ్డి, సుధీర్ రెడ్డి, పైలెట్ రోహిత్ రెడ్డిలతో పాటు ఇతర నేతల భూములపై వెంటనే సీబీఐతో సమగ్ర విచారణ జరిపించాలని కవిత డిమాండ్ చేశారు. కేంద్ర దర్యాప్తు సంస్థతో విచారణ జరిపిస్తేనే అసలు నిజాలు బయటకు వస్తాయని స్పష్టం చేశారు.
అదనపు భూమి ఉంటే ప్రభుత్వానికే సరెండర్:
తన కుటుంబానికి ఎక్కడో ఎకరాలకు ఎకరాలు భూములు ఉన్నాయని సీఎం ఆరోపించడాన్ని కవిత తోసిపుచ్చారు. ప్రభుత్వ నిబంధనలకు మించి గానీ, లేదా తాను ఎన్నికల అఫిడవిట్‌లో పేర్కొన్న దానికన్నా ఒక్క గజం భూమి అదనంగా ఉన్నట్లు నిరూపించినా, ఆ భూమిని ప్రభుత్వానికే సరెండర్ చేయడానికి సిద్ధంగా ఉన్నానని తేల్చి చెప్పారు. రాజకీయం కోసం తనపై లేనిపోని నిందలు వేయడం సముచితం కాదని మండిపడ్డారు.
